ETV Bharat / international

గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే ‘నాటో’ కథ ముగిసినట్లే: డెన్మార్క్ ప్రధాని

నాటో కూటమిపై డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ సంచలన వ్యాఖ్యలు. గ్రీన్‌లాండ్‌‌తో కూడిన ఆర్కిటిక్‌ ప్రాంత భద్రత, శాంతి, స్వేచ్ఛలను డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు పరిరక్షించుకుంటాయని స్పష్టం.

Denmark on Greenland Issue
Denmark on Greenland Issue (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 10:24 AM IST

|

Updated : January 6, 2026 at 12:06 PM IST

5 Min Read
Choose ETV Bharat

Denmark on Greenland Issue : నాటో కూటమిపై డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలోని గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే, నాటో సైనిక కూటమి ఉనికి ముగిసిపోతుందన్నారు. ‘నాటో’ కూటమిలో ఉన్న తమ దేశంపై సైనిక దాడి చేయాలని అమెరికా నిర్ణయించుకుంటే, కూటమికి సంబంధించిన భావనే ముగిసిపోతుందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి తమకు భద్రతను కల్పిస్తున్న నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ముప్పు ఉంటుందని మెటే ఫ్రెడరిక్సన్ హెచ్చరించారు. వెనెజువెలాపై సైనిక దాడి చేసిన మరుసటి రోజు (ఆదివారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గ్రీన్‌లాండ్‌’ అంశాన్ని లేవనెత్తారు. ఖనిజ నిక్షేపాలకు నెలవైన గ్రీన్‌లాండ్‌ను అమెరికా అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని, దానిపై 20 రోజుల్లోగా మాట్లాడుదామన్నారు. గ్రీన్‌లాండ్ భద్రతపై డెన్మార్క్ పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ డెన్మార్క్ ప్రధానమంత్రి ఫ్రెడరిక్సన్ ఈ కామెంట్స్ చేశారు. తమ దేశాన్ని, తమ దేశంలోని గ్రీన్‌లాండ్‌‌ను ఈవిధంగా ట్రంప్ హెచ్చరించడాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌‌తో కూడిన ఆర్కిటిక్‌ ప్రాంత భద్రత, శాంతి, స్వేచ్ఛలను డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు పరిరక్షించుకుంటాయని స్పష్టం చేశారు.

ఆక్రమణకు అమెరికా యత్నిస్తే తీవ్ర పర్యవసానాలు : గ్రీన్‌లాండ్ ప్రధాని

ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్‌లాండ్‌ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా అంత ఈజీగా ఆక్రమించుకోలేదని, తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాత్రికి రాత్రి గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలు పక్కన పెట్టి, తమతో ఉన్న దీర్ఘకాలిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా ప్రభుత్వం ఫోకస్ పెడితే బాగుంటుందని హితవు పలికారు. గ్రీన్‌లాండ్‌ను వెనెజువెలాతో పోల్చి చూడటం సరికాదన్నారు. అమెరికా వైఖరి విషయంలో యావత్ డెన్మార్క్ దేశం ఐక్యంగా ముందుకు సాగాలని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ పిలుపునిచ్చారు.

గ్రీన్‌లాండ్‌ చుట్టూ చైనా, రష్యా నౌకలు : ట్రంప్

గ్రీన్‌లాండ్ ప్రాంతానికి చైనా, రష్యా సైన్యాలతో ముడిపెడుతూ ఇటీవలే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం చుట్టూ ఆర్కిటిక్ మహా సముద్ర జలాల్లో చైనా, రష్యా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను శత్రుదుర్బేధ్యంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పనిని డెన్మార్క్ చేయలేకపోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకోసం అమెరికా సహాయాన్ని యూరోపియన్ యూనియన్ (ఈయూ) తీసుకోవాలని సూచించారు. గ్రీన్‌లాండ్ తమది అని డెన్మార్క్ చెప్పుకుంటున్నప్పటికీ, ఆ ప్రాంతంపై డెన్మార్క్ ప్రభుత్వం పెద్దగా ఖర్చేం చేయలేదన్నారు. గ్రీన్‌లాండ్‌కు సైనిక భద్రత లేని పరిస్థితి నెలకొందని ట్రంప్ పేర్కొన్నారు. 300 ఏళ్ల క్రితం కూడా గ్రీన్‌లాండ్ తమ పరిధిలోనే ఉండేదని డెన్మార్క్ వాదిస్తోందని, అలా అయితే తాము కూడా కొన్ని బోట్లతో అక్కడే నివసించే వాళ్లమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అమెరికా ప్రెసిడెంట్ కామెంట్ చేశారు.

ట్రంప్ వాదనలో నిజమెంత ?

ఆర్కిటిక్ మహా సముద్ర ప్రాంతంలో గ్రీన్‌లాండ్‌ ద్వీపం ఉంది. అది డెన్మార్క్ దేశంలోని ఒక స్వయం పాలిత ప్రాంతం. గ్రీన్‌లాండ్ సరిహద్దుల విషయానికొస్తే, అత్యంత సమీపంలో కెనడా దేశం ఉంది. కెనడా దేశం, గ్రీన్‌లాండ్ మధ్యలో హన్స్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం ఉంది. దీని భూభాగం విషయంలో కెనడా, డెన్మార్క్ (గ్రీన్‌లాండ్) దేశాల మధ్య శతాబ్దాల పాటు విభేదాలు కొనసాగాయి. చివరకు 2022లో ఈ ఐలాండ్‌ను రెండు దేశాలు చెరో సగం పంచుకున్నాయి. అసలు విషయం ఏమిటంటే హన్స్ ఐలాండ్‌లో జనం ఎవరూ నివసించరు. అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. చైనాతో కానీ, రష్యాతో కానీ గ్రీన్‌లాండ్‌కు నేరుగా సరిహద్దులేం లేవు. కానీ గ్రీన్‌లాండ్‌కు అత్యంత దూరంగా, అమెరికాకు చెందిన అలస్కాకు సమీపంలో ఆర్కిటిక్ మహా సముద్ర జలాల్లో, మంచురాశుల కింద చైనా, రష్యా జలాంతర్గాములు మోహరించి ఉన్నాయి. రష్యా, చైనా కలిసి ఈ ప్రాంతంలో సంయుక్త సైనిక విన్యాసాలు కూడా చేస్తుంటాయి. తమ టార్గెట్ అమెరికా కాదని, శాస్త్రీయ, వాణిజ్య లక్ష్యాలతోనే ఇవన్నీ చేస్తున్నామని రష్యా, చైనా అంటున్నాయి. అయితే అసలు వ్యూహం మాత్రం వ్యూహాత్మక సైనిక లక్ష్యాలే అని పరిశీలకులు అంటున్నారు. కానీ గ్రీన్‌లాండ్‌పై రష్యా, చైనా సైన్యాలు ఫోకస్ పెట్టాయనే ట్రంప్ వాదనలో వాస్తవికత లేదని తేల్చి చెబుతున్నారు.

గ్రీన్‌లాండ్‌కు అత్యంత దూరంలో చైనా, రష్యా నౌకలు : రక్షణ రంగ నిపుణుడు

‘‘ఆర్కిటిక్ సముద్రంలో చైనా, రష్యా నౌకల ఉనికి ఉండొచ్చు. కానీ అవి గ్రీన్‌లాండ్‌కు అత్యంత దూరంలో ఉంటాయి. బైనాక్యులర్‌తోనూ ఆ నౌకల నుంచి గ్రీన్‌లాండ్‌ను చూడలేరు’’ అని డానిష్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన రక్షణ రంగ నిపుణుడు ఉల్‌రిక్ ప్రమ్ గాడ్ గతేడాది ఓ నివేదికలో ప్రస్తావించారు.

గ్రీన్‌లాండ్‌లో అమెరికా‌ వైమానిక స్థావరం

ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో అమెరికా‌కు ఒక వైమానిక స్థావరం ఉంది. దాన్ని ‘పిటుఫ్ఫిక్ స్పేస్ బేస్’ అంటారు. గతంలో ‘థ్యూల్ ఎయిర్ బేస్’ అని పిలిచేవారు. 1951లో డెన్మార్క్, అమెరికా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో కూటమి దేశాల సైనిక ప్రయోజనాల కోసం గ్రీన్‌లాండ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుకు ఆనాడు అమెరికాకు డెన్మార్క్ అనుమతిని మంజూరు చేసింది. శత్రుదేశాల క్షిపణుల రాకపై నాటో దేశాలకు ముందస్తు సందేశాలను చేరవేయడం, గగనతల దాడులపై ఎప్పటికప్పుడు అలర్ట్‌లు పంపడం వంటి పనులను ఈ వైమానిక స్థావరం నుంచి చేస్తుంటారు. 2025 సంవత్సరంలో అమెరికా నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలను సైతం డెన్మార్క్ కొనుగోలు చేసింది. డెన్మార్క్ గడ్డపై అమెరికా సైనిక స్థావరాల ఏర్పాటు ప్రతిపాదనతో కూడిన బిల్లుకు డెన్మార్క్ పార్లమెంటు గతేడాది ఆమోదాన్ని తెలిపింది. డెన్మార్క్‌లోని వైమానిక స్థావరాలను వినియోగించుకునే అవకాశాన్ని అమెరికాకు కల్పించాలని ఆనాడు నిర్ణయించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలతో డెన్మార్క్, అమెరికా మధ్య గ్యాప్ పెరిగింది. పరస్పర విశ్వాస భావనకు విఘాతం కలిగించేలా ట్రంప్ సర్కారు వైఖరి ఉందని పరిశీలకులు అంటున్నారు.

గ్రీన్‌లాండ్ ‘సూన్’ పోస్ట్ వైరల్ : డెన్మార్క్ రియాక్షన్

కేటీ మిల్లర్ గతంలో ట్రంప్ ప్రభుత్వంలో అధికారిగా సేవలు అందించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలో హోం ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్న స్టీఫెన్ మిల్లర్‌ను కేటీ మిల్లర్ పెళ్లి చేసుకున్నారు. కేటీ మిల్లర్ ప్రస్తుతం సోషల్ మీడియా పోడ్‌కాస్టర్‌గా పని చేస్తున్నారు. గత శనివారం రోజు వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిగింది. సరిగ్గా అదే రోజున గ్రీన్‌లాండ్‌కు సంబంధించి కేటీ మిల్లర్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్‌లో ‘సూన్’ (Soon) అనే ఒకే ఒక పదం ఉంది. దీనికితోడుగా ఒక ఫొటో ఉంది. అందులోని గ్రీన్‌లాండ్ భూభాగంపై ఎరుపు, తెలుపు, నీలం రంగులు ఉన్నాయి. ఫొటోపై ‘సూన్’ (Soon) అనే క్యాప్షన్ రాసి ఉంది. దీంతో త్వరలోనే గ్రీన్‌లాండ్‌పైనా అమెరికా సైనిక చర్య చేపడుతుందనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. కేటీ మిల్లర్ పోస్ట్‌పై అమెరికాలోని డెన్మార్క్ ప్రధాన రాయబారి జెస్పర్ మొల్లర్ సోరెన్సన్ స్పందించారు. డెన్మార్క్ ప్రాదేశిక భద్రతకు పూర్తిస్థాయి గౌరవాన్ని తమ దేశం ఆశిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

Last Updated : January 6, 2026 at 12:06 PM IST