ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు సాధ్యమేనా? ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇంతకీ చరిత్ర ఏం చెబుతోంది?
ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు ట్రంప్ ప్లాన్- అందుకే ఆకస్మిక దాడితో ఖమేనీ హత్య- అయినా ప్రభుత్వ మార్పు ఈజీ కాదంటున్న పరిశీలకులు- సైద్ధాంతికంగా, రాజకీయంగా, సైనికంగా బలమైన స్థితిలో ఇరాన్

Published : March 1, 2026 at 9:52 PM IST
GOVERNMENT CHANGE IN IRAN : ఇరాన్‌పై శనివారం ఉదయం దాడులు చేసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఖమేనీని కూలదోసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని ఇరాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన వెంటనే ఇరాన్‌లో ప్రభుత్వం మారిపోతుందా? ఖమేనీ అంతమైనంత మాత్రాన ఇరాన్ విధానాలు మారిపోతాయా? వెనెజువెలాలా ఇరాన్‌లోనూ అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమయ్యే విషయమేనా? చారిత్రక ఘటనల వివరాలతో కథనమిది.
200 ఏళ్ల క్రితం కూడా అమెరికా అధ్యక్షులు అంతే!
అమెరికా చరిత్రను తిరగేస్తే, డొనాల్డ్ ట్రంప్‌ను మించిన దూకుడును కనబర్చిన దేశాధ్యక్షులు చాలామందే కనిపిస్తారు. తొలుత మనం జేమ్స్ మన్రో గురించి చెప్పుకోవాలి. ఆయన 1817 నుంచి 1825 మధ్యకాలంలో అమెరికా 5వ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ భూమిపై ఉన్న పశ్చిమార్ధ గోళం మొత్తం అమెరికాదే అనే వాదనను ఆయన వినిపించారు. పశ్చిమార్ధ గోళం పరిధిలోని దేశాలలో వలస కాలనీలను ఏర్పాటు చేసేందుకు ఐరోపా దేశాలు యత్నిస్తే కవ్వింపు చర్యగా పరిగణిస్తామని అప్పట్లో జేమ్స్ మన్రో వార్నింగ్ ఇచ్చారు. ఐరోపా దేశాల ప్రభావం, అమెరికాకు చేరువగా రాకూడదని ఆయన భావించారు.
బెడిసి కొట్టిన సీఐఏ ప్లాన్లు
జేమ్స్ మన్రో విధానాన్నే చాలామంది అమెరికా అధ్యక్షులూ ఫాలో అయిపోయారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ద్వారా గ్వాటెమాలా, హోండురస్, ఎల్ సాల్వడార్ వంటి మధ్య అమెరికా దేశాల్లో తిరుగుబాట్లను చేయించారు. అక్కడి ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితులను సృష్టించారు. ఈక్రమంలో పలుచోట్ల అమెరికా సీఐఏ ప్లాన్ బెడిసికొట్టింది. అమెరికా పొరుగునే ఉండే క్యూబాలోని ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చేందుకు 1961లో సీఐఏ ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది. దీన్ని 'బే ఆఫ్ పిగ్స్ ఇన్‌వేషన్' అంటారు. ఇందులో భాగంగా క్యూబా నుంచి దేశ బహిష్కరణకు గురైన 1500 మందికి అమెరికా ఆశ్రయం ఇచ్చింది. వారికి సైనిక శిక్షణ, ఆయుధాలను ఇచ్చి 1961 ఏప్రిల్ 17న సముద్ర మార్గంలో దాడికి పంపింది. ఫిడెల్ క్యాస్ట్రో సైనికుల ఎదుట ఈ తిరుగుబాటుదారులు తోక ముడిచారు. 1961 ఏప్రిల్ 20న లొంగిపోయారు. 1960 - 1970 మధ్యకాలంలో వియత్నాంలో, 1989లో పనామాలో, 1984లో నికరాగ్వాలో, 2021లో అఫ్గానిస్థాన్‌లలో సీఐఏ ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి.
వెనెజువెలా - ఇరాన్ పోలికలు
తాజాగా ఈ ఏడాది వెనెజువెలా పాలకుడు మదురోను అమెరికా ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లి, పోలీసు కేసులు నమోదు చేసింది. డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక దేశాధ్యక్షురాలిగా నియమించి, ఆమె ద్వారా ప్రస్తుతం వెనెజువెలా ప్రభుత్వాన్ని అమెరికా ఆపరేట్ చేస్తోంది. మదురోను తీవ్రంగా వ్యతిరేకించిన, విమర్శించిన వెనెజువెలా నాయకురాలు మారియా కొరినా మచాడోకు ఆ అవకాశాన్ని అమెరికా ఇవ్వలేదు. అంటే వెనెజువెలాలో మదురో ప్రభుత్వం అలాగే ఉంది. ఒక్క మదురో మాత్రమే అందుబాటులో లేరు. ఇక ఇరాన్‌లోనూ ఇప్పుడు ఖమేనీ మాత్రమే లేరు. కానీ ఆయన భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఎంతోమంది నేతలు, సైనిక కమాండర్లు అలాగే ఉన్నారు. వారంతా ఏకంగా ఉన్నన్ని నాళ్లు, ఇరాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడటం దాదాపు అసాధ్యం. ఒకవేళ ఎవరైనా ఒక నేత అమెరికాకు అనుకూలంగా వ్యవహరించినా, ఇరాన్‌లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఆ విధమైన రాజకీయ, పాలనాపరమైన, సైనిక, సైద్ధాంతిక వ్యవస్థలను ఖమేనీ సిద్ధం చేసి పెట్టారు. ఈ లెక్కన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల సైనిక చర్య నేతలను అంతం చేసిందే తప్ప, నేతల భావజాలాన్ని కాదు.
అమెరికా సైనిక జోక్యంతో భారీ నష్టాలు
అమెరికా సైన్యం ప్రత్యక్ష ప్రమేయం చేసుకున్న చాలా దేశాల్లో భారీ రక్తపాతం జరిగింది. లక్షలాది మంది చనిపోయారు. చరిత్ర చెబుతున్నది ఇదే. 1950వ దశకంలో గ్వాటెమాలా దేశ వ్యవహారంలో అమెరికా సైనిక జోక్యం చేసుకుంది. దీంతో అక్కడ 40 ఏళ్లపాటు అంతర్యుద్ధం జరిగింది. 2 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1980వ దశకంలో నికరాగ్వాలో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రా తిరుగుబాటుదారులకు అమెరికా ఆయుధాలను, ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో అక్కడ దీర్ఘకాలిక అంతర్యుద్ధం జరిగింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. పదివేల మంది చనిపోయారు. అమెరికా సైన్యం కాలుపెట్టాక ఇరాక్, అఫ్గానిస్థాన్‌లలోనూ తీవ్ర మారణహోమం జరిగింది. ఎంతోమంది జనజీవితాలు నాశనమయ్యాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మునుపటి కంటే దీనస్థితికి చేరాయి.
'అమెరికా ఫస్ట్'ను పక్కన పెట్టిన ట్రంప్
ఇతర దేశాల వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం సరికాదనే అభిప్రాయంతోనే తొలుత డొనాల్డ్ ట్రంప్ ఉండేవారు. అంతెందుకు గత అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్నే ఆయన హైలైట్ చేసుకున్నారు. 'అమెరికా ఫస్ట్' నినాదం ట్రంప్‌ను రెండోసారి ప్రెసిడెంట్‌గా చేసింది. తీరా ఎన్నికల్లో గెలిచాక ఇజ్రాయెల్ లాంటి దేశాల ప్రభావంలో పడి, అమెరికా ఫస్ట్ నినాదం నుంచి ఆయన డైవర్ట్ అయ్యారు. ఈక్రమంలోనే తొలుత ఉక్రెయిన్, వెనెజువెలా ఇష్యూలలోకి, ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలోకి అమెరికా తలదూర్చింది. ప్రస్తుతం ఇరాన్ టార్గెట్‌లో యావత్ పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ట్రంప్ అనాలోచిత నిర్ణయం వల్ల అమెరికా ఒక అనవసర యుద్ధాన్ని కొని తెచ్చుకున్నట్లు అయింది.
ట్రంప్ వర్సెస్ ఇరాన్- పరస్పరం బిగ్ వార్నింగ్స్- ఏం జరగబోతోంది?

