ETV Bharat / international

'ఇరాన్ రహస్య అణ్వస్త్ర కేంద్రం ధ్వంసం'- వందలాది టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడి

ఇది ఆరంభం మాత్రమే ఇరాన్‌పై దాడులను ఆపేది లేదన్న అమెరికా- వందలాది టార్గెట్లను ధ్వంసం చేశామన్న ఇజ్రాయెల్

israel strikes iran nuclear site
israel strikes iran nuclear site (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 10:46 AM IST

3 Min Read
Choose ETV Bharat

Israel Strikes Iran Nuclear Site : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న రహస్య అణ్వస్త్ర హెడ్ క్వార్టర్స్‌ను మంగళవారం ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. 2025 సంవత్సరంలో తాము చేసిన దాడుల్లో ధ్వంసమైన ఈ న్యూక్లియర్ ప్లాంటును ఇరాన్ మళ్లీ నిర్మించుకుందని తెలిపింది. టెహ్రాన్ నగర శివార్లలో ఉన్న ఈ అణ్వస్త్ర తయారీ ప్లాంటు పేరు మిన్జా దేహై అని చెప్పింది. ఈ వివరాలను మీడియా సమావేశం వేదికగా ఐడీఎఫ్ అధికార ప్రతినిధి ఎఫ్పీ డెఫ్రిన్ తెలిపారు. ఈ న్యూక్లియర్ ప్లాంటులో కొంతభాగం అండర్ గ్రౌండ్‌లో ఉందన్నారు. ఇందులో అణ్వస్త్రాల తయారీపై ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు రహస్య పరిశోధనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ అణు శాస్త్రవేత్తలను ట్రాక్ చేశాం
2025 జూన్‌లో ఆపరేషన్ రైజింగ్ లయన్‌ సైనిక చర్యను ఇజ్రాయెల్ మొదలుపెట్టాక, ఈ ప్లాంటులో రహస్యంగా అణ్వస్త్ర తయారీ పరిశోధనలను ప్రారంభించారని ఎఫ్పీ డెఫ్రిన్ వివరించారు. గతేడాది 12 రోజుల పాటు ఇరాన్‌లోని మిగతా న్యూక్లియర్ సైట్లపై తాము దాడులు చేస్తుండగా, టెహ్రాన్ శివారులోని మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంలో నిరాటంకంగా పరిశోధనలు కొనసాగాయన్నారు. మిగతా న్యూక్లియర్ సైట్లలోని అణ్వస్త్ర ప్రయోగ పరికరాలు, టెక్నాలజీ, ఇతర వసతులను మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంలోకి ఇరాన్ తరలించిందని ఆయన తెలిపారు. అప్పట్లో ఇరాన్ అణుశాస్త్రవేత్తల అనుమానాస్పద కదలికలను, వారంతా కొత్త లొకేషన్‌కు వెళ్లడాన్ని తాము ఎప్పటికప్పుడు ట్రాక్ చేశామన్నారు. ఆ సమాచారం ప్రకారమే ఇప్పుడు ఫిబ్రవరి 3న మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంపై దాడులు చేశామని ఎఫ్పీ డెఫ్రిన్ పేర్కొన్నారు. అణ్వస్త్రాల తయారీకి అవసరమైన ఒక ప్రధాన రసాయన సమ్మేళనంపై ఈ కర్మాగారంలో రీసెర్చ్ జరిగిందన్నారు.

అయితే ఈ యూనిట్‌లో యురేనియం శుద్ధి ప్రక్రియ జరిగిందా? లేదా? అనే సమాచారాన్ని ఐడీఎఫ్ తెలపలేదు. మిన్జా దేహై న్యూక్లియర్ కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి వివరాలపై ఇప్పటివరకు అమెరికా సైన్యం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. 2025లో తాము చేసిన దాడుల్లోనే ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ధ్వంసమైందని గతవారం అమెరికా స్పష్టం చేసింది. అయితే మళ్లీ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోందని చెప్పింది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ మొదలుపెట్టిందనే అంశంపై అమెరికా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గత 24 గంటల వ్యవధిలో వందలాది ఎటాక్స్ : ఐడీఎఫ్
ఇరాన్, లెబనాన్‌లోని వందలాది టార్గెట్లపై ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) భీకర దాడులు చేసింది. గత 24 గంటల వ్యవధిలో వందలాది యుద్ధ విమానాలతో ఈ ఎటాక్స్ చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లోని 300కుపైగా మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్‌లను ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ రక్షణ కోసం ఇరాన్‌‌లోని బాలిస్టిక్ మిస్సైల్ తయారీ యూనిట్లు, లాంచింగ్ ప్యాడ్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేశామని పేర్కొంది.

60 హిజ్బుల్లా స్థావరాలు ధ్వంసం
లెబనాన్ దక్షిణ భాగంలోని హిజ్బుల్లా మిలిటెంట్ల 60 స్థావరాలను ధ్వంసం చేశామని ఐడీఎఫ్ తెలిపింది. ఆయా స్థావరాల్లో ఆయుధాలు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. లెబనాన్‌లోని టైరే, సిడాన్ ఏరియాలలో ఉన్న హమాస్ మౌలిక సదుపాయాలపైనా ఎటాక్స్ చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం, పౌరులపై దాడులకు ఈ స్థావరాల్లోనే మిలిటెంట్లు పథక రచన చేసేవారని తెలిపింది.

ఇది ఆరంభం మాత్రమే, ఇరాన్‌పై దాడులను ఆపేది లేదు: అమెరికా
ఇది ఆరంభం మాత్రమేనని, ఇరాన్‌పై దాడులను ఆపేది లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ప్రకటించారు. ఇకపైనా ఇరాన్‌పై భీకర దాడులను చేస్తామని ఆయన వెల్లడించారు. తమ దాడుల ప్రభావంతో ప్రతిదాడులు చేసే ఇరాన్ సామర్థ్యం తగ్గుతోందన్నారు. ఈ సైనిక ఆపరేషన్‌లో తొలి 100 గంటల్లోనే 2వేలకుపైగా ఆయుధాలతో ఇరాన్‌లోని దాదాపు 2వేల టార్గెట్లను ధ్వంసం చేశామని తెలిపారు. ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలతో పాటు పలు జలాంతర్గాములను పేల్చేశామని బ్రాడ్ కూపర్ చెప్పారు. ప్రస్తుతం అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర జలాల్లో ఒక్క ఇరాన్ నౌక కూడా తిరగడం లేదన్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన అమెరికా, ఇజ్రాయెల్‌ వాయుసేనలు ఇరాన్ గగనతలంపై స్వేచ్ఛగా తిరుగుతూ దాడులు చేస్తున్నాయని ఆయన తెలిపారు. తప్పకుండా తమ సైనిక లక్ష్యాలన్నీ నెరవేరుతాయన్నారు.