అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం- ధ్రువీకరించిన ఐఏఈఏ
ప్రధాన అణు శుద్ధి వ్యవస్థలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని తెలిపిన ఐఏఈఏ అధికారులు

Published : March 3, 2026 at 3:42 PM IST
Natanz Nuclear Facility Hit : ఇరాన్ అణు కార్యక్రమంపై మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) తాజా ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రం వద్ద ఇటీవల కొంత నష్టం జరిగినట్లు ధ్రువీకరించింది. అయితే రేడియేషన్ లీక్ లేదా ప్రజలకు ప్రమాదం కలిగే పరిస్థితి లేదని స్పష్టం చేసింది.
రేడియోలాజికల్ ప్రభావం ఉండే అవకాశం లేదు
అమెరికా–ఇ జ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన వైమానిక దాడుల నేపథ్యంలో ఈ నష్టం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నతాంజ్‌లోని భూగర్భ యురేనియం శుద్ధి కేంద్రానికి వెళ్లే ప్రవేశ భవనాలకే ప్రధానంగా దెబ్బ తగిలిందని ఐఏఈఏ తెలిపింది. అసలు అణు శుద్ధి సదుపాయాలకు అదనపు నష్టం జరగలేదని పేర్కొంది. "తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం నతాంజ్ భూగర్భ ఫ్యూయల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్ ప్రవేశ ద్వారాలకు మాత్రమే నష్టం ఉంది. రేడియోలాజికల్ ప్రభావం ఉండే అవకాశం లేదు" అని ఐఏఈఏ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
Based on the latest available satellite imagery, IAEA can now confirm some recent damage to entrance buildings of Iran’s underground Natanz Fuel Enrichment Plant (FEP). No radiological consequence expected and no additional impact detected at FEP itself, which was severely… pic.twitter.com/7CS7BRZo1s
— IAEA - International Atomic Energy Agency ⚛️ (@iaeaorg) March 3, 2026
గత ఏడాది అక్కడే!
ఇదే కేంద్రం గత ఏడాది జూన్‌లో జరిగిన 12 రోజుల ఘర్షణల్లో తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పట్లో అమెరికా బలగాలు యురేనియం శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబుదాడులు జరిపాయి. ఆ తర్వాత అక్కడికి ఐఏఈఏ పరిశీలకుల ప్రవేశం కూడా నిలిచిపోయింది. ఇక ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమని నెతన్యాహు స్పందిస్తూ, ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని ఆరోపించారు.
తక్షణ చర్యలు అందుకే!
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఇరాన్ కొత్త భూగర్భ బంకర్లను నిర్మిస్తోంది. వాటి ద్వారా క్షిపణి, అణు కార్యక్రమాలు దాదాపు దాడులకు అందకుండా మారే ప్రమాదం ఉంది. అందుకే తక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది" అని అన్నారు. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అవకాశం ఉండేది కాదంటూ ఇరాన్‌పై దాడులను సమర్థించారు.
ప్రపంచ భద్రతకు ప్రమాదకరం?
మరోవైపు, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసీ కూడా తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో ఐఏఈఏ పరిశీలకులు ఎవరూ లేరని, టెహ్రాన్‌తో చర్చలు చాలా పరిమితంగా సాగుతున్నాయని వెల్లడించారు. అణు కేంద్రాలపై పారదర్శకత లేకపోవడం ప్రపంచ భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఇరాన్ ప్రతినిధి రేజా నజాఫీ మాత్రం అమెరికా ఆరోపణలను ఖండించారు. అణుబాంబు తయారీ ఆరోపణలు దాడులకు సాకులేనని విమర్శించారు. నటాంజ్ కేంద్రం రక్షిత స్థావరం అయినప్పటికీ దాడులకు గురైందని తెలిపారు.
ఇప్పటికే 11 అణు బాంబులకు సరిపడా!
ఇదిలా ఉండగా, ఇరాన్ అణు సామర్థ్యాలపై అమెరికా నుంచి మరో కీలక సమాచారం వెలువడింది. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఇప్పటికే 11 అణు బాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన చర్చల సమయంలో ఇరాన్ అధికారులు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని తెలిపారు. "ఇరాన్ దగ్గర 60 శాతం శుద్ధి చేసిన దాదాపు 460 కిలోల యురేనియం ఉంది. దాంతో కేవలం పది రోజుల్లోనే బాంబులు తయారు చేసే సామర్థ్యం ఉంటుంది" అని విట్కాఫ్ వెల్లడించారు.
ఇరాన్‌తో చర్చలు జరపడానికి తనను, జారెడ్ కుష్నీర్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపారని చెప్పారు. న్యాయమైన ఒప్పందానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. చివరికి దాడుల మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే, గత ఏడాది జరిగిన దాడుల్లో ఇరాన్ బాంబుల తయారీకి అవసరమైన కొన్ని సదుపాయాలు ధ్వంసమయ్యాయని కూడా వివరించారు. అయినప్పటికీ నిల్వలో ఉన్న యురేనియం ప్రపంచానికి ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించారు.

