ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు : IAEA
ఇరాన్ వద్ద అణు గ్రేడ్ యురేనియం నిల్వ ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమని IAEA స్పష్టం

Published : March 4, 2026 at 1:39 PM IST
Iran Nuclear Weapons Program : ఇరాన్ అణు ఆయుధాలను నిర్మిస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) కీలక ప్రకటన చేసింది. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ వెల్లడించారు. అయితే, ఇరాన్ వద్ద అణు గ్రేడ్ యురేనియం నిల్వ ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయమని స్పష్టం చేశారు.
"ఇరాన్ అణు కార్యక్రమంపై నాకు వచ్చిన రిపోర్టుల ఆధారంగా నేను కచ్చితంగా, స్పష్టంగా చెప్పగలను. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేస్తుందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, దాని దగ్గర సుసంపన్నమైన భారీ యురేనియం నిల్వలు ఉన్నాయి. అయితే, వీటిని పరిశీలించేందుకు మా సంస్థ ఇన్స్పెక్టర్లకు అనుమతి ఇవ్వకపోవడం ఆందోళనను రేకేత్తిస్తోంది.ఈ భద్రతా సమస్యలను పరిష్కరించడంలో IAEAకి ఇరాన్ సహాయం చేయకపోతే అణు కార్యక్రమం శాంతియుతంగా ఉందని ఏజెన్సీ హామీ ఇవ్వలేదు."
--రాఫెల్ గ్రోస్సీ, IAEA డైరెక్టర్ జనరల్
I have been very clear and consistent in my reports on Iran’s nuclear programme: while there has been no evidence of Iran building a nuclear bomb, its large stockpile of near-weapons grade enriched uranium and refusal to grant my inspectors full access are cause for serious…
— Rafael Mariano Grossi (@rafaelmgrossi) March 3, 2026
అంతకుముందు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మాణ కార్యక్రమం గురించి IAEAకి ఎటువంటి సమాచారం లేదని డీజీ రాఫెల్ గ్రోస్సీ అన్నారు. "సైనిక సామగ్రిని భారీ మొత్తంలో అన్యాయంగా సేకరించడం, తనిఖీల్లో పారదర్శకత లేకపోవడం వంటి తీవ్రమైన ఆందోళన కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. కానీ, అణ్వాయుధాన్ని నిర్మించడానికి ఒక క్రమబద్ధమైన కార్యక్రమం ఉందని సూచించే సమాచారం మాకు ఎప్పుడూ లేదు. కాబట్టి మనం ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ పనులన్నీ గమనిస్తే అమెరికా, ఇజ్రాయెల్ సహా ఇతర దేశాలకు ఇది నేరుగా అణ్వాయుధ తయారీకి ఉద్దేశించిందనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అయితే, ఈ విషయంలో IAEAకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. కానీ ఆందోళన చెందడానికి మాత్రం కారణాలు కనిపస్తున్నాయి." అని IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ అన్నారు. ఇరాన్‌పై దాడి చేయకపోతే వారి చేతుల్లోకి అణ్వాయుధాలు వచ్చేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో IAEA డీజీ స్పందించారు.
అంతకుముందు ఇస్లామిక్ పాలకులను 'వెర్రి వ్యక్తులు' (క్రేజీ పీపుల్) అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వారికి అణ్వాయుధం అందుబాటులో ఉంటే ఉపయోగించి ఉండేవారన్నారు. "మనం ప్రస్తుతం చేస్తున్న దాడులు చేయకపోతే మీరు అణు యుద్ధాన్ని ఎదుర్కొని ఉండేవారు. ఇప్పటికే వారు అనేక దేశాలను నాశనం చేసి ఉండేవారు మీకు తెలుసా? ఇప్పుడు వారు మానసిక అనారోగ్యంతో ఉన్నారు. ఇలాంటి క్రేజీ పీపుల్ వద్ద అణ్వాయుధం ఉంటే, వారు దానిని ఉపయోగించి ఉండేవారు" అని ట్రంప్ అన్నారు.
మరోవైపు రాడికల్స్‌కు విధ్వంసక ఆయుధాలు అందుబాటులో లేనప్పుడు ప్రపంచం మెరుగ్గా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. "ఇరాన్‌ను మతపరమైన పిచ్చివాళ్లు నడుపుతున్నారు. వారికి అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశయం ఉంది. క్షిపణులు, డ్రోన్లు, ఉగ్రవాదం పేరిట వారు అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆ విషయాలకు భయపడి ప్రపంచం వారిని ఏం చేయదని వారి ఆలోచన. అందుకే ఇప్పుడు వారి పని పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వారి నౌకాదళాన్ని, క్షిపణులు, డ్రోన్లు, వాటిని తయారు చేసే సామర్థ్యాన్ని నాశానం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వారు ఎప్పటికీ అణ్వాయుధాన్ని పొందే అవకాశం ఉండదు. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సరైన నిర్ణయం. ఈ రాడికల్ మతాధికారులకు ఇలాంటి ఆయుధాలు అందుబాటులో లేనప్పుడే ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా ఉంటుంది. వారు ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో మీరు చూస్తారు. వారు వీటిని ఎక్కువగా కలిగి ఉంటే ఒక సంవత్సరం తర్వాత వాటిని ఎలా ఉపయోగిస్తారో ఊహించుకోండి," అని ఆయన అన్నారు.

