ఖమేనీ మృతి వేళ పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు- 9మంది నిరసనకారులు మృతి
అయతుల్లా అలీ ఖమేనీ మృతికి వ్యతిరేకంగా పాక్‌లో అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత- అమెరికా కాన్సులేట్‌ను ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులు- భద్రతా దళాలపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు- నిరసనకారులను చెదరగొట్టిన భద్రతా దళాలు

Published : March 1, 2026 at 1:30 PM IST
US Consulate Karachi Pakistan : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తతో పాకిస్థాన్ కరాచీలోని అమెరికా కాన్సులెట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు- నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు తొమ్మిది మంది మరణించారు. ఇంకా అనేక మంది గాయపడినట్లు పోలీసుల చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిచించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. హింసాత్మక ఘటనలు తలెత్తకుండా పోలీసులు, రేంజర్లు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
భద్రతా దళాలపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణానికి నిరసనగా షియా సంస్థలు కరాచీలోని అమెరికా కాన్సులేట్ వైపు మార్చ్‌ను చేపట్టాయి. అయితే, శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడ ఎలాంటి ఆందోళనలను చేపట్టకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. అయినా వినకుండా ఖమేనీ మృతికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసనకారులు కాన్సులెట్ ముట్టడించేందుకు యత్నించారు. బలవంతంగా లోపలికి ప్రవేశించి భవనంలో ఉన్న తలుపులు, కిటికీల అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కాన్సులెట్ వెలుపల నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాల్లో బాష్పవాయువు ప్రయోగించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ నిరసనల వల్ల మై కొలాచి, సుల్తానాబాద్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
VIDEO | Thousands take to the streets of Skardu in protest against the killing of Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei following US and Israeli strikes.
— Press Trust of India (@PTI_News) March 1, 2026
Source: AFP/PTI (Only to use in India)
(Full video available on https://t.co/n147TvrpG7) pic.twitter.com/Pe7lgFIa0b
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు
మరోవైపు ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని కరాచీ ఐజీని అదేశించారు సింధ్ అంతర్గత మంత్రి జియావుల్ హసన్. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. సున్నితమైన కార్యాలయాల చుట్టూ భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. నిరసనల నేపథ్యంలో ట్రాఫిక్ స్తంబించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఘటనను భద్రతా దళాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయం వైపు దూసుకొచ్చిన నిరసనకారులు
అటు ఖమేనీ మృతికి నిరసనగా ఇరాక్‌లో కూడా ఆందోళనలు చెలరేగాయి. రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఖమేనీ మరణంతో ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని భావిస్తున్న మద్దతుదారులే ఈ ఆందోళనలు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖమేనీ మృతిపై సంతాపం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించింది.
#WATCH | Karachi, Pakistan | Clashes broke out between Pakistani police and protesters who breached the outer wall of the US Consulate in Karachi. The incident occurred following news of US and Israeli attacks on Iran that killed Supreme Leader Ayatollah Ali Khamenei.
— ANI (@ANI) March 1, 2026
At least… pic.twitter.com/KaOPWtOdtR
ఖమేనీ మృతికి సంతాపంగా 40రోజుల సంతాప దినాలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో మరణించారని ఇరాన్ ధృవీకరించింది. శనివారం తెల్లవారుజామున రాజధాని టెహ్రాన్‌లో ఖమేనీ నివాసంపై జరిగిన వైమానిక దాడిలో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనుమరాలు, ఇతర కుటుంబసభ్యులు కూడా మరణించారని తెలిపింది. ఇదే దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ మొహమ్మద్ పక్‌పూర్, ఖమేనీకి సన్నిహిత సలహాదారుడు అలీ షంఖానీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఖమేనీ నిరంతరం ప్రజల మధ్యే ఉండి, తన బాధ్యతలను నెరవేర్చడంలో ముందు ఉండేవారని పేర్కొంది. ఖమేనీ మృతికి సంతాపంగా 40రోజుల సంతాప దినాలు, 7 రోజుల సెలవును ప్రకటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది

