ETV Bharat / international

వామ్మో! ఖమేనీకి అంత సంపద ఉందా? ట్రంప్, నెతన్యాహూల కంటే సంపన్నుడా?

ఖమేనీ నికర సంపద విలువ రూ.8.65 లక్షల కోట్లు?- ఖమేనీ కుమారులకూ విదేశాల్లో వ్యాపారాలు- షెల్ కంపెనీల పేరిట ఫారిన్‌లో బిజినెస్‌ల నిర్వహణ- ఐరోపా దేశాల బ్యాంకుల్లో భారీ డిపాజిట్లు

Trump and Ayatollah Ali Khamenei and Netanyahu
Trump and Ayatollah Ali Khamenei and Netanyahu (File/AFP And AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 2:43 PM IST

5 Min Read
Choose ETV Bharat

Ayatollah Ali Khamenei Net Worth : అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్‌ను 36 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. చివరకు దేశ ప్రజలు ఎన్నుకునే దేశాధ్యక్షుడు కూడా ఆయన కనుసన్నల్లోనే పనిచేసేవాడు. ఇరాన్ ప్రభుత్వ ఖజానా సైతం ఖమేనీ కంట్రోల్‌లోనే ఉండేది. ఒక్క చమురు పరిశ్రమ ద్వారానే ఏటా రూ.6 లక్షల కోట్ల ఆదాయం ఇరాన్ ఖజానాలోకి వచ్చేది! అయినా ఖమేనీ నడిపే ఫౌండేషన్ల ద్వారానే ఇరాన్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులను మంజూరు చేసేవారు.

మరి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అత్యధిక కాలం పాటు ఒక దేశాన్ని ఏలిన అయతుల్లా అలీ ఖమేనీ ఆస్తుల విలువ ఎంత? ఆయన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూల కంటే సంపన్నుడా? ఖమేనీ భార్యాపిల్లలు, సోదరులు, సోదరీమణులు ఎవరు? వారికి ఎన్ని ఆస్తిపాస్తులున్నాయి? వాళ్లు రాజకీయాల్లో ఉన్నారా? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఖమేనీ భార్య ఎవరు?
శనివారం (ఫిబ్రవరి 28న) ఉదయం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ వివరాలను అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ధ్రువీకరించాయి. ఖమేనీ భార్య పేరు మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే. ఆమె చాలా అరుదుగా బయట కనిపించేవారు. మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే తండ్రి పేరు మహ్మద్ ఇస్మాయిల్ ఖోజస్తే బగెర్జాదే. ఖమేనీ సొంతూరు మషాద్‌లో ఈయన వ్యాపారాలు చేసేవారు. మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే సోదరుడు హసన్ గతంలో ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీకి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఖమేనీ నలుగురు కుమారులు ఎవరిని పెళ్లాడారు?

  • అయతుల్లా అలీ ఖమేనీ, మన్సౌరే దంపతులకు మొత్తం ఆరుగురు పిల్లలు. వీరిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల పేర్లు ముస్తఫా, ముజ్తబా, మసౌద్, మేసమ్. కుమార్తెల పేర్లు బుష్రా, హోడా.
  • పెద్ద కుమారుడు ముస్తఫా షియా మత ప్రబోధకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఇరానియన్ తత్వవేత్త అజీజుల్లా ఖోష్వాగ్ట్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ పర్యవేక్షణలో పనిచేసే ఐఆర్‌జీసీ దళాలకు నైతిక అంశాలను బోధించే మత ప్రబోధకుడిగా కీలక పాత్రను అజీజుల్లా ఖోష్వాగ్ట్ పోషిస్తున్నారు. ఇరాన్- ఇరాక్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ట్రాక్ రికార్డు ముస్తఫాకు ఉంది.
  • ఖమేనీ మరో కుమారుడు మసౌద్, రాజకీయ నాయకుడు మొహ్సేన్ ఖరాజీ కుమార్తెను పెళ్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే మతపెద్దల కమిటీలో మొహ్సేన్ ఖరాజీ సభ్యుడిగా ఉన్నారు. మొహ్సేన్ ఖరాజీ సోదరుడు కమాల్ ఖరాజీ గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు.
  • ఖమేనీ ఇంకో కుమారుడు ముజ్తబా, రాజకీయ నాయకుడు గులాం అలీ హద్దాద్ ఆదెల్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. గతంలో ఇరాన్ పార్లమెంటు స్పీకర్‌గా గులాం అలీ హద్దాద్ ఆదెల్ వ్యవహరించారు.
  • ఖమేనీ మరొక కుమారుడు మేసమ్, అత్యంత సంపన్న వ్యాపారవేత్త మహమూద్ లోలాచియన్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మహమూద్ లోలాచియన్ ఓ వైపు వ్యాపారాలను విస్తరిస్తూనే, మరోవైపు ఇరాన్ వ్యాప్తంగా తన సొంత ఇస్లామిక్ స్కూళ్ల నెట్‌వర్క్‌ను వ్యాప్తి చేస్తున్నారు.
  • ఖమేనీకి చాలామంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయితే, మహ్మద్ బాగర్ ఖమేనీ అనే ఒకే ఒక్క మనవడి పేరు బయటికి వినిపిస్తుంటుంది.
  • కొంతమంది ఖమేనీ మేనల్లుళ్లు, మనవళ్లు ఫ్రాన్స్ సహా పలు విదేశాల్లో నివసిస్తున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.

ఖమేనీ సోదరులు, సోదరీమణులు
అయతుల్లా అలీ ఖమేనీకి మహ్మద్ ఖమేనీ, హాది ఖమేనీ, హసన్ ఖమేనీ అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. నలుగురు సోదరీమణులు ఉన్నారు. వీరిలో బద్రీ ఖమేనీ అనే సోదరీమణి 1980వ దశకంలోనే ఇరాన్‌ను విడిచిపెట్టి ప్రవాసంలోకి వెళ్లిపోయారు. బద్రీ ఖమేనీ భర్త పేరు షేక్ అలీ తెహ్రానీ, ఆయన కూడా షియా మత ప్రబోధకుడే. అయతుల్లా అలీ ఖమేనీ మొదటి నుంచీ అతివాద ఇస్లామిక్ భావజాలాన్ని కలిగి ఉండేవారు. 1979లో ఇరాన్ అధ్యక్షుడు అయ్యాక కూడా ఆయన అదే వైఖరిని కొనసాగించారు. షియా మత ప్రబోధకుడైన షేక్ అలీ తెహ్రానీ, అప్పట్లో దీనిపై బహిరంగ విమర్శలు చేశారు.

దీంతో ఇరాన్ ప్రభుత్వం వైపు నుంచి షేక్ అలీ తెహ్రానీకి వేధింపులు జరిగాయి. వీటికి తాళలేక ఆయన పొరుగున ఉన్న ఇరాక్‌కు పారిపోయారు. తన భర్త దగ్గరికి వెళ్లేందుకు పాస్‌పోర్టును మంజూరు చేయమని నాడు దేశాధ్యక్షుడిగా ఉన్న తన సోదరుడు అలీ ఖమేనీని బద్రీ ఖమేనీ కోరారు. కానీ అందుకు అలీ ఖమేనీ నో చెప్పారు. దీంతో ఆమె పాస్‌పోర్టు లేకుండానే రోడ్డుమార్గంలో తన ఐదుగురు పిల్లలతో కలిసి ఇరాక్‌కు వెళ్లిపోయారు.

అయతుల్లా అలీ ఖమేనీ ఆస్తిపాస్తులు
అయతుల్లా అలీ ఖమేనీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.8.65 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఖమేనీ జప్తు చేసిన ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, ఖమేనీ ఏర్పాటుచేసిన సెటాడ్ విభాగం పరిధిలోని ఇరాన్ ప్రభుత్వ ఆస్తులను లెక్కేస్తే వాటి విలువ రూ.18 లక్షల కోట్లకుపైనే ఉంటుందనే మరొక విశ్లేషణ కూడా ఉంది. యూకే, యూఏఈ, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో ఖమేనీ కుమారులకు రియల్ ఎస్టేట్, నిర్మాణరంగ వ్యాపారాలు ఉన్నాయనే టాక్ ఉంది.

తమ పేర్లతో కాకుండా షెల్ కంపెనీల ద్వారా ఆయా వ్యాపారాలను నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఆస్తుల విలువ రూ.27వేల కోట్ల దాకా ఉంటుందని సమాచారం. మరో కుమారుడు మసూద్ ఖమేనీ ఆస్తుల విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ డబ్బులన్నీ ఐరోపా దేశాల బ్యాంకుల్లో ఉన్నాయనే కథనాలు గతంలో పశ్చిమదేశాల మీడియాలో ప్రచురితం అయ్యాయి.

ఖమేనీ పుస్తకాలు
ఇస్లామిక్ ఆలోచన, రాజకీయాలపై ఖమేనీ పలు రచనలు రాశారు. పాలస్తీనా అండ్ యాన్ ఔట్ లైన్ ఆఫ్ ఇస్లామిక్ థాట్ ఇన్ ది ఖురాన్ అనేది ఆయన ప్రసిద్ధ పుస్తకం.

ట్రంప్, నెతన్యాహూ కంటే ఖమేనీయే సంపన్నుడా?
2025 నాటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నికర ఆస్తుల విలువ రూ.66వేల కోట్లు. వాస్తవానికి 2024 నాటికి ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.35వేల కోట్లే. కానీ 2025లో అమెరికా ప్రెసిడెంట్ కావడంతో ఆయన ఆస్తుల విలువ దాదాపు డబుల్ అయింది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నికర ఆస్తుల విలువ రూ.118 కోట్లు. ఖమేనీ ఆస్తుల విలువ రూ.8.65 లక్షల కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కల ప్రకారం ట్రంప్, నెతన్యాహూల కంటే ఖమేనీయే సంపన్నుడు.

ఖమేనీ మృతి వేళ పాకిస్థాన్​లో ఉద్రిక్తతలు- 9మంది నిరసనకారులు మృతి

తదుపరి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎవరు? రేసులో ఉన్నదెవరు? నియామకం ఎలా జరుగుతుంది?