బంగ్లాలో మరో హిందువు దారుణ హత్య- కాల్చి చంపిన దుండగులు
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య- తాత్కాలిక జర్నలిస్టుని కాల్చి చంపిన దుండగులు

Published : January 5, 2026 at 10:51 PM IST
Bangladesh Hindu Man Killed : పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా అక్కడ హిందూ వితంతువుపై జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కలిగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఆ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మహిళపై అత్యాచారం చేసి, ఆపై డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా చెట్టుకు కట్టి జుట్టును కత్తిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకార, సుమారు రెండున్నరేళ్ల క్రితం ఆమె షహిన్, అతడి తమ్ముడి వద్ద నుంచి కొంత భూమి, ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచే షహిన్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ వేధింపులపై పలుమార్లు నోరు విప్పాలనుకున్నప్పటికీ, సమాజంలో పరువు పోతుందనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.
శనివారం సాయంత్రం బాధిత మహిళ ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. అదే సమయంలో షహిన్‌తో పాటు అతడి అనుచరుడు హసన్ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. బంధువులను బలవంతంగా బయటకు తరిమికొట్టి, ఇంట్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మరింత క్రూరంగా వ్యవహరించారు.
ఆమెను ఇంటి బయట ఉన్న చెట్టుకు కట్టేసి, జుట్టును కత్తిరించారు. ఈ మొత్తం దృశ్యాన్ని వీడియోగా రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కలిగంజ్ ఆస్పత్రిలో ఆమె ఇద్దరు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతుండటంతో మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా కాల్చి చంపిన ఘటన కూడా కలకలం రేపుతోంది. స్థానికంగా ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ, ఓ బంగ్లా డైలీకి తాత్కాలిక ఎడిటర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ బైరాగి (38) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి హత్య చేశారు. సోమవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఏఎస్పీ అబుల్ బసర్ వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ వరుస ఘటనలు బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా హిందువులు సహా ఇతర మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నప్పటికీ, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న ఈ దాడులు ఎక్కడికి దారి తీస్తాయన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
మతోన్మాదం
బంగ్లాదేశ్‌లో గత ఏడాది (2024) ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలడంతో పరిస్థితులు అన్నీ మారిపోయాయి. మతోన్మాదంతో మైనారిటీలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. దీనితో వారి పరిస్థితి దారుణంగా మారింది. బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ (BHBCUC) ప్రకారం, 2025 తొలి 11 నెలల్లో ఏకంగా 90 మంది మైనారిటీలు (ప్రధానంగా హిందువులు) హత్యకు గురయ్యారు లేదా అనుమానాస్పద స్థితిలో మరణించారు. కానీ వీటి గురించి ప్రపంచానికి తెలియకుండా పోయింది.
2025 జనవరి నుంచి మార్చి మధ్యలో మైనారిటీలపై 142 దాడులు జరగ్గా, జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో కేవలం "దైవదూషణ" ఆరోపణలతోనే సుమారు 71 దాడి ఘటనలు నమోదయ్యాయి. మతపరమైన ఉద్రిక్తతలు, అపోహలు హింసకు దారితీస్తున్నాయని బహిరంగ రహస్యం. దీనితో మైనారిటీలకు చెందిన ముఖ్యంగా హిందువులకు చెందిన ఆస్తులు, వనరులపై వివాదాలు కూడా ఈ దాడులకు దారితీస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ మార్పులు, అస్థిరత మైనారిటీలపై దాడులకు మరింత అవకాశాన్ని సృష్టిస్తున్నాయి. యూనస్ సర్కార్ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. దీనితో బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంఘాలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ అంశంపై తన ఆందోళనను వ్యక్తం చేసింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది

