ఖమేనీ మృతితో ఇరాన్‌లో సంబురాలు- ముగిసిన ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన అంటూ యువరాజు రెజా వ్యాఖ్య
ఖమేమీ మృతిపై స్పందించిన ఇరాన్ యువరాజు రెజా- చెత్త బుట్టలోకి ఖమేనీ చరిత్ర అంటూ వ్యాఖ్య- సంబురాలు చేసుకుంటున్న ఇరాన్ కార్యకర్తలు

Published : March 1, 2026 at 7:39 AM IST
Iran King On Khamenei Death : సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు పేర్కొంది. ఖమేనీ హతంతో ఇరాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. ప్రభుత్వ మద్దతుదారులు విషాదంలో కూరుకుపోగా, మరికొన్ని చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ మద్దతుదారులు వ్యక్తిగతంగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఖమేనీ మరణ వార్త తెలియగానే ఇరాన్‌లోని ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ యువరాజు రెజా కూడా స్పందించారు. ఖమేనీ పాలన ముగిసిందంటూ పోస్ట్ చేశారు.
'కొత్త ప్రపంచానికి స్వాగతం'
ఇరాన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రముఖ ఇరాన్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ మసిహ్ అలీనెజాద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా అలీనెజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిరోజు ఇరాన్ ప్రజలు ప్రజలు ఖమేనీ చేతిలో మరణించారన్న వార్తలు చూస్తూ నిద్రలేచేదాన్ని. కానీ నా జీవితంలో మొదటిసారి ఒక శుభవార్తతో నిద్రలేచాను. నాకు గట్టిగా అరవాలని, పరిగెత్తాలని అనిపిస్తోంది. నేను కల గంటున్నానా? కొత్త ప్రపంచానికి స్వాగతం' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు
ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్నట్లు సీఎన్ఎస్ పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలతో వీధులు మార్మోగినట్లు రిపోర్టు చేసింది. ఇరాన్ శివారు ప్రాంతమైన బేసత్ టౌన్‌లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోను ఫాక్స్ న్యూస్ పోస్టు చేసింది. ఖమేనీ నియంత మరణించాడని తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లెవీ ఒక వీడియోను పంచుకున్నారు. అయితే ఇరాన్‌లోని రెండో అతిపెద్ద నగరం, షియా ముస్లింల ప్రధాన యాత్రా స్థలం మషద్‌లోని ఇమామ్ రెజా మందిరంపై నల్ల జెండాను ఎగురవేశారు.
ఖమేనీ వారసుడికి తావు లేదు: యువరాజు రెజా పహ్లావీ
ఇరాన్ మాజీ రాజవంశానికి చెందిన వారసుడు, యువరాజు రెజా పహ్లావీ కూడా ఖమేనీ మరణంపై స్పందించారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలు, భద్రతా దళాలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. ఖమేనీ చరిత్ర చెత్తబుట్టలోకి వెళ్లిందని పేర్కొన్నారు. రక్తపిపాసి అలీ ఖమేనీ చరిత్ర నుంచి తుడిచిపెట్టుకుపోయారని యువరాజు రెజా పహ్లావీ పేర్కొన్నారు. ఆయన మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగిసిందన్నారు.
ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ), పోలీసులు, భద్రతా దళాలు ఇకనైనా ప్రజలతో చేతులు కలపాలని ఆయన ప్రిన్స్ పిలుపునిచ్చారు. కూలిపోతున్న వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నించొద్దని హితవు పలికారు. ఇది సైన్యానికి లభించిన చివరి అవకాశంగా ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతమైన ఇరాన్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఖమేనీ స్థానంలో మరొకరిని నియమించే ఏ ప్రయత్నమైనా సఫలీకృతం కాదని, ప్రజలు ఇక ఏ నియంతను అంగీకరించరని పహ్లావీ స్పష్టం చేశారు.
My fellow compatriots,
— Reza Pahlavi (@PahlaviReza) February 28, 2026
Ali Khamenei, the bloodthirsty despot of our time, the murderer of tens of thousands of Iran’s bravest sons and daughters, has been erased from the face of history. With his death, the Islamic Republic has in effect reached its end and will very soon be… https://t.co/pm3ZXY9IYZ
'నిరంకుశ పాలకుడు, పదివేల మంది ఇరాన్ ముద్దుబిడ్డలను బలిగొన్న హంతకుడు అలీ ఖమేనీ చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టుకుపోయాడు. అతని మరణంతో, ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగింపు దశకు చేరుకుంది అతి త్వరలోనే ఇది చరిత్రలోని చెత్తబుట్టలోకి వెళుతుంది. ఖమేనీ వారసుడిని నియమించడానికి ఈ వ్యవస్థలోని మిగిలిన శక్తులు చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. అతని స్థానంలో వారు ఎవరిని ఉంచినా, వారికి చట్టబద్ధత ఉండదు, మనుగడ ఉండదు. వారు కూడా నిస్సందేహంగా ఈ పాలన చేసిన నేరాల్లో భాగస్వాములుగానే ఉంటారు. నేరస్థుడైన ఖమేనీ మరణం ఇరాన్ 'లయన్ అండ్ సన్ నేషనల్ రివల్యూషన్' కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలకు, బాధిత తల్లులకు, గాయపడిన పిల్లల హృదయాలకు ఒక ఓదార్పుగా అవుతుంది'
--రెజా పహ్లావీ, ఇరాన్ యువరాజు
ప్రకటించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్మార్గుల్లో ఒకరైన ఖమేనీ మరణించారని పేర్కొన్నారు. అతని వల్ల ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులకు న్యాయం జరిగిందన్నారు. శనివారం రాత్రి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఖమేనీ లక్ష్యంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఖమేనీ నివసిస్తున్న ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని, శిథిలాల కింద అతని మృతదేహం లభ్యమైందని ఇజ్రాయెల్ మీడియా సంస్థ 'జెరూసలేం పోస్ట్' వెల్లడించింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది.

