ETV Bharat / international

వేగంగా వ్యాపిస్తున్న హంటా వైరస్​!- ఇది కరోనా కంటే ప్రమాదకరమా?

అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఓ క్రూయిజ్ నౌకలో 'హంటా వైరస్'- అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న వైరస్​- దక్షిణ అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధరణ

Hunta Hantavirus
Representative Images (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2026 at 8:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hunta Hantavirus Latest News : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ నుంచి ప్రజలు కొన్నేళ్ల క్రితమే తేరుకున్న సమయంలో మరో మహమ్మారి భయందోళనలు సృష్టిస్తోంది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఓ క్రూయిజ్ నౌకలో అరుదైన 'హంటా వైరస్' కలకలం రేపుతోంది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పర్యాటక బోటులో ఇటువంటి వైరస్ వ్యాప్తి చెందడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. అయితే, దక్షిణ అమెరికా నుంచి తిరిగి వచ్చి అదే షిప్​లో ప్రయాణించిన ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిందని, అతనికి చికిత్స కూడా అందిస్తున్నారని స్విట్జర్లాండ్ అధికారులు బుధవారం తెలిపారు. షిప్‌లో ప్రయాణించిన తర్వాత ఆ వ్యక్తి స్విట్జర్లాండ్‌కు తిరిగి వచ్చాడని అధికారులు పేర్కొన్నారు. అసలు ఈ హంటా వైరస్ అంటే ఏమిటి? ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? కరోనా కంటే ఇది ప్రమాదకరమా? ఈ కథనంలో చూద్దాం.

150 మంది ప్రయాణికులున్న ఈ నౌకలో వైరస్​ పంజా
సముద్రపు అలల మధ్య ఆహ్లాదంగా సాగాల్సిన ప్రయాణం మృత్యు బాట పట్టింది. అర్జెంటీనా తీరం నుంచి అంటార్కిటికాకు బయలుదేరిన ఎంవీ హోండియస్ నౌకలో హంటా వైరస్ పంజా విసిరింది. 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులున్న ఈ నౌకలో, ఇప్పటికే ముగ్గురు మరణించగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాస్తవంగా అంటార్కిటికా, అట్లాంటిక్‌ మహా సముద్రంలో కొన్ని రోజుల పాటు నౌక ప్రయాణించాల్సి ఉంది. అయితే అంతలోనే హంటా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్‌ దృష్ట్యా ఈ నౌకను అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వెర్డే తీరం వద్ద నిలిపివేశారు.

వైరస్‌పై వివరణ ఇచ్చిన డబ్ల్యూహెచ్​ఓ
మరోవైపు, ఈ వైరస్‌ నౌకలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. ఎంవీ హోండియస్ నౌక ఏప్రిల్‌ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరింది. ఏప్రిల్ 6న ఓ డచ్ పౌరుడు జ్వరం, తలనొప్పి లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి నౌకలోనే ఆయన మరణించారని పేర్కొంది. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మన్ మహిళ కూడా న్యుమోనియా లక్షణాలతో మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

అయితే, మొదటి మరణం సంభవించిన 21 రోజుల తర్వాత ప్రయోగశాల పరీక్షల్లో ఇది 'హంటా వైరస్' అని నిర్ధారణ అయ్యింది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల లాలాజలం, మూత్రం లేదా విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల వ్యర్థాలు ఉన్న చోట గాలిని పీల్చడం వల్ల లేదా కలుషితమైన ప్రదేశాలను తాకడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది. హంటా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి వారం నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుంది. మొదట సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనినే 'హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్' అంటారు. దీనివల్ల మరణాల రేటు దాదాపు 35 శాతంగా ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీలపై ప్రభావం చూపి రక్తస్రావానికి కూడా దారితీస్తుంది. దురదృష్టవశాత్తు ఈ వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదు. వైరస్‌ను ముందుగా గుర్తించి ఆసుపత్రిలో చేరడం వల్ల కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు.

నౌకలో ముగ్గురికి వైరస్​ లక్షణాలు
ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులను కేబిన్లకే పరిమితం చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు వైద్యుల బృందం నౌకలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హంటా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ముగ్గురు ప్రయాణికులను నౌక నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం వారిని నెదర్లాండ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, హంటా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వైద్య బృందాలు పరిశోధన చేస్తున్నాయి. ఈ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదం ఉండటంతో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎలుకలు ఉన్న చోట బ్లీచింగ్ సొల్యూషన్ వాడాలని, వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని కోరారు.

'హర్మూజ్​ను తెరవకపోతే మళ్లీ బాంబు దాడులు చేస్తాం'- ఇరాన్‌కు ట్రంప్ ఘాటు హెచ్చరిక​

భారత్​తో ట్రేడ్​ డీల్​కు చాలా దగ్గరగా ఉన్నాం- చివరి అడ్డంకినే అధిగమించాలి: అమెరికా