ETV Bharat / international

హెచ్​-1బీ ఫీజు పెంపు- అమెరికా ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయే ప్రమాదం!

హెచ్​-1బీ వీసాలపై అదనంగా 1,03,265 డాలర్ల ఫీజు ప్రతిపాదన- కొత్త ఫీజుతో అమెరికాలో నియామకాలు ఖరీదుగా మారే అవకాశం-ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లలో తాత్కాలిక మార్పులు

H1B Fees US Jobs
ప్రతీకాత్మక చిత్రం (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : August 26, 2026 at 8:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

H1B Fees US Jobs : అమెరికాలో హెచ్-1బీ వీసాల ఫీజులను భారీగా పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని నైపుణ్యంతో కూడిన ఉన్నత ఉద్యోగాలు విదేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఇండియన్-అమెరికన్ సంస్థ 'ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ' (ఫీడ్స్) హెచ్చరించింది. అదనంగా ప్రతిపాదించిన 1,03,265 డాలర్ల ఫీజుతో స్టార్టప్‌లు, భారీగా ఉద్యోగులను నియమించుకునే సంస్థలపై వందల మిలియన్ల డాలర్ల ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

హెచ్​-1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యవంతులైన ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్​ఎస్) ప్రతిపాదించిన ఈ అదనపు ఫీజు హెచ్​-1బీ వీసా పరిమితికి లోబడే దరఖాస్తులకు వర్తించే అవకాశం ఉంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ మినహాయింపుకు అర్హత ఉన్న దరఖాస్తులు కూడా ఇందులో ఉంటాయని ఫీడ్స్​ తెలిపిందిఅయితే ఒక్కో దరఖాస్తుపై లక్ష డాలర్లకుపైగా అదనపు ఫీజు విధిస్తే, ముఖ్యంగా ఆర్థికంగా పరిమిత వనరులు ఉన్న స్టార్టప్‌లకు నియామకాలు దాదాపు అసాధ్యంగా మారవచ్చని ఫీడ్స్​ చీఫ్‌ ఆఫ్‌ పాలసీ అండ్‌ స్ట్రాటజీ ఖండేరావ్‌ కాండ్‌ పేర్కొన్నారు. వేలాది హెచ్​-1బీ ఉద్యోగులను నియమించుకునే పెద్ద కంపెనీలపైనా భారీ ఆర్థిక భారం పడుతుందని అన్నారు. కొన్ని సంస్థలకు అదనపు వ్యయం వందల మిలియన్ల డాలర్లకు చేరుకోవచ్చని, కొన్ని సందర్భాల్లో బిలియన్‌ డాలర్‌కు దగ్గరయ్యే అవకాశం కూడా ఉందని వివరించారు.

విద్యార్థుల నుంచి ఉద్యోగాల వరకు మరింత ఖర్చు?
ఓపీటీ ఫీజు కింద ప్రతిపాదించిన మరో లక్ష డాలర్లు కూడా తోడైతే, ఈ మొత్తం ఫీజు భారం రెండు లక్షల డాలర్లు దాటుతుందని, దీంతో అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు ఆ అవకాశాలు దాదాపు అసాధ్యంగా మారుతాయని ఫీడ్స్ అభిప్రాయపడింది. ఇప్పటికే అమెరికాలో విదేశీ విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గుతోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గణాంకాలను ఉదహరించింది. 2025లో ఈ నమోదు 17 శాతం మేర తగ్గగా, 2026 నాటికి మరో లక్షా 11 వేల మంది విద్యార్థులు తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.

తగ్గుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు సుమారు 3.4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఫీడ్స్ అంచనా వేసింది. యూఎస్​సీఐఎస్​కు ఇప్పటికే 96 శాతం నిధులు దరఖాస్తుదారులు చెల్లించే ఫీజుల ద్వారానే అందుతున్నాయని గుర్తుచేసింది. అమెరికా తన సాంకేతిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్నా, స్థానిక అమెరికన్ కార్మికులను రక్షించుకోవాలన్నా రెండింటినీ సమతుల్యం చేస్తూ నైపుణ్యమున్న విదేశీ ప్రతిభను ఆకట్టుకునేలా ఫీజుల విధానం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది.

'ప్రత్యామ్నాయ నిధుల విధానం కావాలి'
డీహెచ్​ఎస్​, యూఎస్​సీఐఎస్​కు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు, జాతీయ భద్రతను కాపాడేందుకు, మోసాలను అరికట్టేందుకు తగిన వనరులు అవసరమని ఫీడ్స్ అంచనా వేసింది. అయితే ఆ అవసరాలను తీర్చేందుకు ఇంత భారీ ఫీజును విధించడం సముచితం కాదని అభిప్రాయపడింది. మరింత సమతుల్యమైన నిధుల విధానాన్ని రూపొందించాలని డీహెచ్​ఎస్​, యూఎస్​సీఐఎస్​ను ఫీడ్స్ కోరింది. సంబంధిత సంస్థలకు తగిన నిధులు కేటాయించేలా కాంగ్రెస్‌ చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో అమెరికా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతులైన మానవ వనరులపై పరిశ్రమ వర్గాలు స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కోరింది. ఇదిలా ఉండగా, అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్​సీఐఎస్)కు ఇప్పటికే దాదాపు 96 శాతం నిధులు దరఖాస్తుదారులు, పిటిషన్‌దారులు చెల్లించే ఫీజుల ద్వారానే సమకూరుతున్నాయని ఫీడ్స్ పేర్కొంది.

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్‌
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్​మెంట్లను అమెరికా నిలిపివేసిందని ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం వీసా సేవలను పూర్తిగా నిలిపివేశామని కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి అనుగుణంగా అపాయింట్‌మెంట్లలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో పనిచేస్తున్న కాన్సులర్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బుక్‌ చేసుకున్న అపాయింట్‌మెంట్లు రద్దు చేసినట్లు వారికి ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందిందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది.తర్వాత కొత్త తేదీ, సమయాన్ని తెలియజేస్తామని దరఖాస్తుదారులకు అధికారులు వెల్లడించినట్లు తెలిపింది. అయితే వీసా ఇంటర్వ్యూలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి? కొత్త అపాయింట్‌మెంట్లు ఎప్పటి నుంచి కేటాయిస్తారు? అనే విషయాలపై అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించలేదు.

'మోదీ వ్యతిరేకులతో ఒక ర్యాలీ నిర్వహించుకో'- న్యూయార్క్​ మేయర్​పై అమెరికన్ సింగర్​ ఫైర్​

కీలక సముద్ర మార్గాల పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలి: UNSCలో భారత్