రెండో రోజుకు చేరిన ఖమేనీ అంతిమయాత్ర- ప్రార్థనలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు- ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు- ప్రార్థనలతో హోరెత్తిన రాజధాని నగరం టెహ్రాన్- భారీగా ఖమేనీ అభిమానులు హాజరు

Published : July 5, 2026 at 3:46 PM IST
Ayatollah Ali Khamenei Funeral Prayers : ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన పాటు మృతి చెందిన నలుగురు సభ్యుల అంతిమ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల శవపేటికల వద్ద ఆదివారం ప్రార్థనలు జరిగాయి. ఖమేనీ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ ముసల్లాలో ఉంచారు. అక్కడే ప్రార్థనలు జరిగాయి. ఈ సామూహిక ప్రార్థన ప్రారంభానికి కొన్ని గంటల ముందే ముసల్లాలోని ప్రధాన ప్రాంగణం నిండిపోయింది. ఈ మేరకు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
ఇరాక్‌కు కూడా ఖమేనీ పార్థీవదేహం
అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల పార్థీవదేహాల వద్ద ఆదివారం ప్రార్థనలు చేసిన అనంతరం సోమవారం టెహ్రాన్ తరలించనున్నారు. మంగళవారం పవిత్ర నగరమైన ఖోమ్‌లో అంత్యక్రియల ఊరేగింపు జరుగుతుంది. అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాక్‌లోని నజఫ్, కర్బలా నగరాలకు విమానంలో తరలిస్తారు. గురువారం ఇరాన్‌లోని మషద్ నగరంలో అలీ ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేయనున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మండిపాటు
మరోవైపు, ఖమేనీ అంత్యక్రియల సమయంలో కాల్పులు జరపబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. ఒక వ్యక్తిని చంపడం ద్వారా వారి ఆదర్శాలను తొలగించలేమని పేర్కొంది. "ప్రజలను చంపవచ్చు. కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు (అమెరికా, ట్రంప్‌ను ఉద్దేశించి) ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపారు. కానీ వాస్తవానికి మీరు ఒక పరిమళ ద్రవ్యం సీసాను పగలగొట్టారు. దాని సువాసన నలుదిక్కులా వ్యాపించింది. మీకు నాగరికత, చరిత్ర, గౌరవం ఏవీ లేవు కాబట్టి మీకు ఈ విషయాలు అర్థం కావు. " అని అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది.
తండ్రి అంత్యక్రియలకు కుమారుడు గైర్హాజరు
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయారు. అనంతరం సుదీర్ఘ కాలం పాటు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగడం వల్ల ఖమేనీ అంత్యక్రియలు చాలా కాలం ఆలస్యం అయ్యాయి. అయితే, ఖమేనీ అంతక్రియల్లో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పాల్గొనట్లేదు. మొజ్తబా ఖమేనీని హత్య చేస్తామని ఇజ్రాయెల్ బెదిరిస్తున్న నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో తన తండ్రి అంత్యక్రియలకు మొజ్తబా హాజరుకావట్లేదు.
ఖమేనీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాను : ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ శనివారం మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి నివాళులర్పించారు. అలీ ఖమేనీ వారసత్వం ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. ఖమేనీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు విప్లవ అమరవీరుడైన అలీ ఖమేనీ మార్గదర్శకత్వంలో దయ, ఐక్యత, గౌరవం, స్వాతంత్ర్య సందేశం అన్ని దేశాలలో ప్రతిధ్వనిస్తోందని అన్నారు. తాను అమరవీరుడైన నాయకుడికి వీడ్కోలు పలకలేదని, ఎప్పటికీ పలకబోనని చెప్పారు. అలీ ఖమేనీ తన మనసులో, హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
కాగా, ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర అధికారికంగా శనివారం ప్రారంభం అయ్యింది. ఇరాన్, ఇరాక్‌లోని ఐదు నగరాల్లో ఏడు రోజులు పాటు ఈ అంత్యక్రియలు జరుగుతాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్‌లోని మషహద్‌లో జులై 9న ఖననం చేస్తారు. శనివారం ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాదిమంది రావడం గమనార్హం. వారంతా ప్రతీకారానికి గుర్తుగా ఎర్రజెండాలను పట్టుకొన్నారు. డెత్ ఆఫ్ అమెరికా అంటూ నినాదాలు చేశారు. కాగా, ఖమేనీ అంతక్రియల కార్యక్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలీబఫ్, రివల్యూషనరీ గార్డ్ అధిపతి జనరల్ అహ్మద్ వహిదీతో పాటు తదితరులు హాజరయ్యారు.
'ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడు ఇంకా ఎందుకు బతికి ఉన్నాడు'- ట్రంప్ మరణాన్ని కోరిన ఇరానీయన్లు
ఖమేనీ అంత్యక్రియలు : ఇరాన్ స్పీకర్, విదేశాంగ మంత్రి కన్నీటిపర్యంతం- హాజరైన భారత బృందం

