ETV Bharat / international

ఈద్ బలి నుంచి 'ట్రంప్' దున్నపోతుకు విముక్తి- ఇకపై దానికి ప్రత్యేక షెడ్డు, కేర్​టేకర్!

ట్రంప్‌ పేరుతో బతికిపోయిన దున్నపోతు- బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎంట్రీతో!

Bangladesh's 'Trump' buffalo spared from Eid sacrifice
Bangladesh's 'Trump' buffalo spared from Eid sacrifice (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2026 at 7:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Buffalo Eid Sacrifice : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉందంటూ సోషల్‌ మీడియాలో ఫేమస్‌గా మారిన ఓ అరుదైన తెల్లదున్నపోతుకు అనూహ్యంగా ప్రాణదానం లభించింది. ప్రజల్లో పెరిగిన ఆసక్తి, భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో జోక్యం చేసుకొని దీన్ని బలి ఇవ్వకుండా కాపాడింది. ఇంతకీ ఈ దున్నపోతు కథేంటి? డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న పోలికలేంటి? ఈ కథనంలో చూద్దాం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనగానే అందరికీ ఆయన విలక్షణమైన 'బంగారు రంగు జుట్టు' గుర్తుకొస్తుంది. అయితే సరిగ్గా అలాంటి జుట్టుతోనే బంగ్లాదేశ్‌లో ఓ దున్నపోతు ప్రత్యక్షమైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్‌గంజ్ నగరానికి చెందిన జియావుద్దీన్ మృధా అనే రైతు వద్ద ఉన్న ఒక అరుదైన అల్బినో దున్నపోతు ఇప్పుడు అంతర్జాతీయ సెలబ్రిటీగా మారిపోయింది. దాదాపు 700 కిలోల బరువుండే ఈ తెల్లటి దున్నపోతు తలపై ఉండే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడి హెయిర్‌స్టైల్‌ను పోలి ఉంటుంది. దీంతో ఈ దున్నపోతుకు "డొనాల్డ్ ట్రంప్‌" అనే పేరు వచ్చింది. ఈ దున్నపోతు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దీన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో ఫామ్‌హౌస్‌కు తరలి వస్తున్నారు. ఆ దున్నపోతుతో సెల్ఫీలు దిగుతున్నారు.

అంతర్జాతీయంగా వైరల్‌గా మారిన ఈ "డొనాల్డ్‌ ట్రంప్‌" దున్నపోతు సాధారణ పశువుల్లా కాకుండా చాలా సున్నితమైనదని, దీనికి తరుచుగా స్నానం చేయిస్తూ ఉంటామని యజమాని జియావుద్దీన్ మృధా తెలిపారు. ఈ దున్నపోతుకు ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఎంతో గారాబంగా పెంచామని చెప్పారు. ఈ దున్నపోతుకు "డొనాల్డ్‌ ట్రంప్‌" అనే పేరు తన తమ్ముడు సరదాగా పెట్టాడని, అయితే అనుకోకుండా ఈ దున్నపోతుకు ఊహించని రీతిలోగుర్తింపు వచ్చిందన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా బలివ్వడం కోసం ఈ దున్నపోతును ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. దీంతో ఈ దున్నపోతు కథ విషాదంగా ముగియనుందని చర్చ జరిగింది. కానీ సోషల్‌ మీడియాలో ఈ జంతువుపై పెరిగిన ఆసక్తి, భారీ ప్రజాదారణతో పాటు శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా బంగ్లాదేశ్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ దున్నపోతును బలి ఇవ్వడానికి వీల్లేదని బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్‌ పండుగ కోసం ఈ దున్నపోతును కొనుగోలు చేసిన వ్యక్తికి ప్రభుత్వం తరుఫున పూర్తి డబ్బును చెల్లించారు. ప్రజల నుంచి వస్తున్న అసాధారణ స్పందన వల్లే చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ దున్నపోతును ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. అక్కడ ఓ ప్రత్యేకమైన షెడ్డు, కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ పుణ్యమా అని ఈ మూగజీవికి బక్రీద్ వేళ పునర్జన్మ లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

'ట్రంప్‌తో పోల్చడంతో దున్నపోతు అప్సెట్'
ఇంతకు ముందు ఇరాన్​ ఈ దున్నపోతును ఆసరాగా చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై సెటైర్ వేసింది. "పాపం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చడం వల్ల బంగ్లాదేశ్ బర్రె (దున్నపోతు) అప్సెట్ అయింది" అంటూ రష్యాలోని ఇరాన్ రాయబార కార్యాలయం వ్యంగ్యమైన ట్వీట్ చేసింది. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ 'ఆర్​టీ' (రష్యా టుడే) ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని జత చేస్తూ ఇరాన్ ఎంబసీ ఈ కామెంట్స్ చేసింది. ఆ కథనం ప్రకారం, బంగ్లాదేశ్‌లో ట్రంప్ లాంటి హెయిర్ స్టైల్‌, ముఖ కవళికలతో ఉన్న దున్నపోతును చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ మూగజీవి ఒత్తిడికి గురై మేత తినడం మానేసింది.

హర్మూజ్‌లో అమెరికా దాడులు- ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్- అలా పని పూర్తి చేస్తామంటూ!

లెబనాన్​పై ఇజ్రాయెల్ భీకర దాడులు- 'అక్టోబరు 7' సూత్రధారి హతం