ETV Bharat / international

స్టాండింగ్ ఒవేషన్​ నుంచి క్నెస్సెట్ మెడల్ వరకు- మోదీ ఇజ్రాయెల్ పర్యటన విశేషాలు ఇవే!

ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో మోదీ ట్రెండింగ్​- బలపడుతున్న భారత్​-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలు- మోదీకి స్టాండింగ్ ఒవేషన్​ నుంచి క్నెస్సెట్ మెడల్ బహూకరణ వరకు అన్నీ స్పెషలే!

Israel MPs with Modi
Israel MPs with Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 3:30 PM IST

4 Min Read
Choose ETV Bharat

Modi Israel Visit Highlights : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసింది. క్నెస్సెట్ ప్రత్యేక ప్లీనరీలో ఇజ్రాయెల్ చట్టసభ సభ్యులందరూ లేచి మోదీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. గౌరవ వందనం సమర్పించారు. తరువాత ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం 'స్పీకర్ ఆఫ్​ ది క్నెస్సెట్​ను' భారత ప్రధానికి ప్రదానం చేశారు. వ్యక్తిగతంగా భారత్​-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన అసాధారణ కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా మోదీ నిలిచారు.

మోదీ మేనియా
క్నెస్సెట్​ లోపల వాతావరణం ఏదో అధికారిక కార్యక్రమంలా కాకుండా, వ్యక్తిగత ఆత్మీయతతో నిండిపోయినట్లు కనిపించింది. మోదీ ప్రసంగం ముగిసిన తరువాత ఇజ్రాయెల్ ఎంపీలు, ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేసి, సెల్ఫీలు దిగుతూ, ఆయనతో ముచ్చటించారు. ఇది రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించాయి. 2017లో మోదీ మొదటిసారి ఇజ్రాయెల్​లో పర్యటించినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది.

మోదీకి స్వీట్ సర్​ప్రైజ్​
మోదీకి 'స్పీకర్ ఆఫ్​ ది క్నెస్సెట్​ను' ప్రదానం చేసిన తర్వాత, జాయింట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారతీయ వస్త్రాలు ధరించి, మోదీని ఆశ్చర్యపరిచారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్​ చేశారు.

వేల ఏళ్లనాటి బంధం!
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తుత భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదు. ఈ రెండు దేశాలకు నాగరికతలకు రెండు వేల ఏళ్ల నాటి నుంచే అనుబంధం ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. 'బుక్ ఆఫ్ ఎస్తేర్'​ అనే గ్రంథం భారతదేశాన్ని 'హోడు'గా పేర్కొందని, పురాతన కాలంతో భారత్​, ఇజ్రాయెల్ మధ్య జరిగిన వాణిజ్యాన్ని తాల్ముడు రికార్డులు చెబుతున్నాయని అన్నారు. యూదులు భారత్​లో ఎలాంటి వివక్షకు, హింసకు గురికాకుండా తమ విశ్వాసాలను కాపాడుకుంటూ జీవించారని, ఇది తమకు గర్వకారణమని చెప్పారు. స్వాతంత్ర్యం తరువాత ఈ ఎడారి ప్రాంతాలను వ్యవసాయ క్షేత్రాలుగు మార్చిన ఇజ్రాయెల్ పట్ల భారత పార్లమెంటరీ చర్చల్లో ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయెల్​లో జరిగిన 'కిబ్బట్జ్​ ఉద్యమం' ఆచార్య వినోబా భావే, లోక్​నాయక్ జయప్రకాశ్ నారాయణ్​ లాంటి నేతలను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.

నూతన ఆవిష్కరణలకు పవర్​హౌస్​
ప్రస్తుత అనిశ్చిత ప్రపంచంలో ఇరుదేశాల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ స్పష్టం చేశారు. భారత్​ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రపంచంలోని మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతిక నాయకత్వానికి పవర్​హౌస్​గా ఉందని పేర్కొన్నారు. 'మేము వాణిజ్యాన్ని విస్తరించడానికి, పెట్టుబడులను మరింత పెంచడానికి, ఉమ్మడి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని' పేర్కొన్నారు.

"నిన్న జెరూసలెంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, నేను టెక్నాలజీ వరల్డ్​లోని ప్రత్యేక ఆవిష్కరణల ప్రదర్శనకు వెళ్లాం. ఏఐ, క్వాంటం, ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, నీటి వనరులు, వ్యవసాయం వివిధ రంగాల్లో ఇజ్రాయెల్ యువత చేసిన ఆవిష్కరణలను చూశాం. తరువాత భారత్​లో పెట్టుబడులు పెట్టాలని, మా ప్రతిభావంతులైన యువతతో కలిపి పనిచేయాలని ఇజ్రాయెల్ కంపెనీలను కోరాను" అని మోదీ అన్నారు.

ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సాంస్కృతిక అనుబంధాన్ని కూడా మోదీ నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్​లో యోగా కేంద్రాల విస్తరణ, ఆయుర్వేదం పట్ల పెరుగుతున్న ఆసక్తి గురించి మాట్లాడారు. భారతీయ సంపూర్ణ ఆరోగ్య సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ యువత ఇండియాకు రావాలని ఆహ్వానించారు. ఇరుదేశాల భాగస్వామ్యానికి ప్రధాన బలం ప్రజల మధ్య ఉన్న సంబంధాలే అని నొక్కి చెప్పారు. పార్లమెంటరీ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఎంపీలను ఆయన భారత్​కు ఆహ్వానించారు. భారత్ పార్లమెంట్ ఇప్పటికే ఇజ్రాయెల్ కోసం 'పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్​ గ్రూప్​'ను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

మోదీ నివాళి
జెరూసలెంలోని ఇజ్రాయెల్ అధికారిక హోలోకాస్ట్ స్మారక చిహ్నం 'యద్​-వాషెమ్'ను సందర్శించిన మోదీ, హోలోకాస్ట్ బాధితులకు గురువారం నివాళులు అర్పించారు. బాధితుల గౌరవార్థం 'కదిష్​' పఠనం జరుగుతుండగా మోదీ, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఇద్దరూ హాల్​ ఆఫ్ రిమెంబరెన్స్​లో మౌనంగా నిల్చున్నారు.

రెండు ప్రపంచ యుద్ధంలో నాజీలు వారి సహచరుల చేతిలో మరణించిన 6 మిలియన్ల మంది యూదుల జ్ఞాపకార్థం 1953లో ఈ యద్​-వాషెమ్ స్మారకాన్ని నిర్మించారు. ఈ స్మారక ప్రదేశంలో హోలోకాస్ట్​ హిస్టరీ మ్యూజియం, హాల్​ ఆఫ్​ నేమ్స్​, చిల్డ్రన్స్ మెమోరియల్ ఉన్నారు. యూదులను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన యూదేయతరులను కూడా యద్ వాషెమ్ గౌరవిస్తుంది.

సోషల్ మీడియాలో మోదీ ట్రెండింగ్​
ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో భారత ప్రధాని మోదీ పేరు ట్రెండింగ్​లో ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంట్​లో ఆయన చేసిన ప్రసంగం డిజిటల్ వేదికల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇజ్రాయెల్​ ట్రెండింగ్ లిస్ట్​లో మోదీ ప్రసంగం, పర్యటన గురించి చర్చలు 2,3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇది మోదీకి ఆదేశంలో ఉన్న ఫాలోయింగ్​ను, ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను తెలియజేస్తోంది.

Social media in Israel buzzes with PM Modi's name as he dominates X trends during his visit
సోషల్ మీడియా 'మోదీ' ట్రెండింగ్ (ANI)

1992లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుంచి రక్షణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతిక రంగాల్లో భారత్-ఇజ్రాయెల్ మధ్య బంధం క్రమంగా పెరిగింది. 2017లో ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ బంధాన్ని మరింత పెంచింది. మోదీ తాజా ప్రసంగం దాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు.

కెనడాలో హింసాత్మక నేరాలతో భారత్‌కు సంబంధం లేదు : కెనడా

'పాకిస్థాన్ ఇంకా​​ కలల్లోనే విహరిస్తోంది'- దాయాది అక్కసుపై ఐరాసలో భారత్ కౌంటర్