ETV Bharat / international

మత ప్రబోధకుడు - ఇరాన్ సుప్రీం లీడర్: అణ్వస్త్ర స్వప్నం నెరవేరకుండానే ముగిసిన ఖమేనీ ప్రస్థానం

సాధారణ కుటుంబంలో జన్మించిన ఖమేనీ- షియా మత ప్రబోధకుడిగా మొదలైన కెరీర్- రూహుల్లా ఖమేనీ మరణానంతరం ఇరాన్​ సుప్రీం లీడర్​గా అలీ ఖమేనీ

Iran Supreme Leader Khamenei Biography
Iran Supreme Leader Ayatollah Ali Khamenei (AP File Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 10:53 AM IST

7 Min Read
Choose ETV Bharat

Iran Supreme Leader Khamenei Biography : ఇరాన్ సుప్రీం లీడర్‌ 86 ఏళ్ల అయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల సంయుక్త దాడిలో శనివారం (ఫిబ్రవరి 28న) ఆయన చనిపోయారు. ఈవిషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ఉదయం ధ్రువీకరించింది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఖమేనీ, అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. సాధారణ షియా మత ప్రబోధకుడిగా ఆయన కెరీర్ మొదలైంది. ఇరాన్‌లో రాజు మహ్మద్ రజా షా పహల్వీ పాలన జరుగుతుండగానే రహస్యంగా ఇస్లామిక్ విప్లవానికి క్షేత్రస్థాయిలో పునాదులు వేసిన కీలక వ్యక్తుల్లో ఖమేనీ ఒకరు. 1979 ఫిబ్రవరిలో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చాక, రాజు పాలన అంతమైంది. ఆ తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఎలా సాగింది? మత ప్రబోధకుడిగా ఉన్న ఖమేనీకి సుప్రీం లీడర్‌ అయ్యే అవకాశం ఎలా లభించింది ? పాలనా కాలంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు, విధానాలు ఏమిటి ? ఈ కథనంలో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఖమేనీ జీవితాన్ని మార్చేసిన ఒక ప్రయాణం
ఇరాన్‌లోని మషద్ పట్టణంలో 1939 ఏప్రిల్ 19న అయతుల్లా అలీ ఖమేనీ జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ(1895–1986) కూడా మత ప్రబోధకుడే. 11 ఏళ్ల వయసులో అలీ ఖమేనీ మదర్సాకు వెళ్లి మత విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. 1950వ దశకం చివరినాళ్లలో మతపరమైన ఉన్నత విద్య కోసం సొంతూరు మషద్ నుంచి ఖోమ్ సిటీకి అలీ ఖమేనీ వెళ్తారు. ఈ ప్రయాణం ఆయన జీవితాన్ని మార్చేస్తుంది. ఖోమ్ సిటీలో ఖమేనీ కలిసిన విశిష్ట వ్యక్తి పేరు అయతుల్లా రూహుల్లా ఖమేనీ. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయింది ఆయనే. రూహుల్లా ఖమేనీ దగ్గర మతపరమైన విద్యను అలీ ఖమేనీ అభ్యసిస్తారు. ఆయనకు బాాగా సన్నిహితం అవుతారు. రూహుల్లా ఖమేనీ గొప్ప శిష్యులలో ఒకరిగా అలీ ఖమేనీ పేరు ఫేమస్ అవుతుంది.

Iran Supreme Leader Khamenei Biography
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (AP File Photo)

ఇస్లామిక్ విప్లవంలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం
1960 - 1979 మధ్యకాలంలో ఇరాన్ రాజు మహ్మద్ రజా షా పహల్వీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు బీజాలు పడింది ఖోమ్ సిటీలోనే. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవాన్ని తేవాలనే బలమైన పట్టుదలతో రూహుల్లా ఖమేనీ శ్రమించారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలకు ఇరాన్ రాజు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించేవారు. దీంతో రాజుకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు పెరగసాగాయి. ఈ నిరసనల్లో ఒక సాధారణ కార్యకర్తలా అలీ ఖమేనీ పాల్గొనేవారు. ఇస్లామిక్ విప్లవం, రాజు అరాచక పాలనతో ముడిపడిన కరపత్రాలను అందరికీ పంపిణీ చేసేవారు. సభలు, సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చేవారు. ఈక్రమంలో చాలాసార్లు ఆయతుల్లా అలీ ఖమేనీ అరెస్టయి జైలుకు వెళ్లారు.

Iran Supreme Leader Khamenei Biography
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (AP File Photo)

తొలి పదవి : ఇరాన్ రహస్య విప్లవ మండలి సభ్యుడు
అయతుల్లా రూహుల్లా ఖమేనీని ఇరాన్ రాజు మహ్మద్ రజా షా పహల్వీ తన శత్రువుగా భావించాడు. ఇరాన్‌లో నిరసనలను ఆపేందుకు రూహుల్లా ఖమేనీని అరెస్టు చేసి 1964-1965లో టర్కీకి, 1965-1978లో ఇరాక్‌కు, 1978 - 1979లో ఫ్రాన్స్‌కు ప్రవాసానికి పంపాడు. ఈ వ్యవధిలోనే రూహుల్లా ఖమేనీ కీలక శిష్యుడైన అలీ ఖమేనీకి ఫాలోయింగ్ భారీగా పెరిగింది. రూహుల్లా ఖమేనీ కీలకమైన మనిషిగా ఆయనకు పేరొచ్చింది. 1979 ఫిబ్రవరిలో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చాక ఈ ఇమేజ్ అలీ ఖమేనీకి పనికొచ్చింది. ఇరాన్ తొలి సుప్రీం లీడర్‌గా రూహుల్లా ఖమేనీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన శిష్యుడైన అలీ ఖమేనీకి కీలక పదవిని కేటాయించారు. ఇరాన్ రహస్య విప్లవ మండలి సభ్యుడిగా నియమించారు.

వివాదాస్పద రీతిలో ఖమేనీకి సుప్రీం లీడర్ పదవి
1981లో ఇరాన్‌లో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా అయతుల్లా అలీ ఖమేనీ ఎన్నికయ్యారు. అదే ఏడాది కొందరు ప్రత్యర్ధులు చేసిన ఎటాక్‌లో ఖమేనీ కుడి చేయిలోని రక్తనాళాలు దెబ్బతిన్నాయి. దీంతో అది పక్షవాతం బారినపడింది. 1989 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. ఆ సమయానికి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతుల్లా రూహుల్లా ఖమేనీ వయసు 89 ఏళ్లు. రూహుల్లా ఖమేనీ 1989 జూన్ 3న గుండెపోటుతో చనిపోయారు. రూహుల్లా ఖమేనీ జీవించి ఉండగా, కీలకమైన వీలునామా రాస్తారు.

Iran Supreme Leader Khamenei Biography
1981లో ఖమేనీ (AP File Photo)

తన తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా హుస్సేన్ అలీ ముంతజరీని నియమించాలని సూచిస్తారు. రూహుల్లా ఖమేనీ చనిపోయే సమయానికి ఇరాన్ డిప్యూటీ సుప్రీం లీడర్ పదవిలో అయతుల్లా హుస్సేన్ అలీ ముంతజరీ ఉంటారు. అయితే అలీ ఖమేనీ దేశ అధ్యక్షుడిగా తన పవర్స్‌ను ఉపయోగించి, ఆ పదవి నుంచి హుస్సేన్ అలీ ముంతజరీని తప్పించి ఏళ్ల తరబడి హౌజ్ అరెస్టులో ఉంచుతారు. ఈవిధంగా 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని అయతుల్లా అలీ ఖమేనీ దక్కించుకుంటారు.

ఖమేనీ వ్యక్తిగత అస్త్రంగా ఐఆర్‌జీసీ
1989 నుంచి ఇప్పటివరకు దాదాపు 36 ఏళ్ల 6 నెలల పాటు ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ కొనసాగారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఇంత సుదీర్ఘకాలం పాటు పాలనను కొనసాగించిన ఏకైక పాలకుడు ఆయనే. సుప్రీం లీడర్ అయ్యాక ఇరాన్‌ను సైనికంగా బలోపేతం చేయడంపై ఖమేనీ పూర్తి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)ను ఏర్పాటు చేశారు. ఇది నేరుగా ఖమేనీ వ్యక్తిగత నియంత్రణలోనే పనిచేసేది. ఒకవేళ తనకు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరిగినా, ఎదుర్కొనే అస్త్రంగా ఐఆర్‌జీసీని ఆయన మలుచుకున్నారు. అంతేకాదు, ఇరాన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నిధులను అందించే సంస్థలను కూడా ఐఆర్‌జీసీ పర్యవేక్షణలోనే ఉంచారు. ఒక రకంగా చెప్పాలంటే మతం మాటున సైనిక పాలనను ఆయతుల్లా అలీ ఖమేనీ సాగించారు. అందువల్లే ఆయన ఎదురు లేకుండా 36 ఏళ్లపాటు సుప్రీం లీడర్ పదవిలో కొనసాగగలిగారు.

Iran Supreme Leader Khamenei Biography
ఇరాన్ సుప్రీం లీడర్ (AP File Photo)

మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాల్లోకి ఐఆర్‌జీసీ
ఖమేనీ ఇరాన్‌తో సరిపెట్టుకోలేదు. తన ఐఆర్‌జీసీ దళాల ప్రభావాన్ని మిడిల్ ఈస్ట్‌లోని లెబనాన్, గాజా, ఇరాక్, యెమన్, సిరియాలకు విస్తరించారు. ఐఆర్‌జీసీ ద్వారా అక్కడి షియా మిలిటెంట్లకు ఆయుధాలు, డబ్బును చేరవేశారు. వాళ్లను ఇరాన్‌కు తీసుకొచ్చి సైనిక శిక్షణను అందించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీ పనులను నేర్పించారు. ఫలితంగా లెబనాన్‌లో హిజ్బుల్లా, ఇరాక్‌లో ఖతాయబ్ హిజ్బుల్లా, గాజాలో హమాస్, యెమన్‌లో హూతీ అనే మిలిటెంట్ సంస్థలు పురుడుపోసుకున్నాయి. వీటివల్ల ఎక్కువగా ఇబ్బందిపడింది ఇజ్రాయెలే.

మహ్మద్ ఖతామీ సంస్కరణలు : ఖమేనీకి పెద్ద సవాల్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తొలిసారిగా 1997లో పెద్ద రాజకీయ సవాల్ ఎదురైంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో షియా మత ప్రబోధకుడు మహ్మద్ ఖతామీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చాలా సామాజిక సంస్కరణలను ఖతామీ అమల్లోకి తెచ్చారు. ఈక్రమంలో మరిన్ని సంస్కరణలను కోరుతూ ఇరాన్ ప్రజలు ఉద్యమాలు మొదలుపెట్టారు. వాటికి సానుకూలంగా ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ స్పందించసాగారు. ఖతామీ వైఖరిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేకించారు. ఐఆర్‌జీసీ దళాలను ఉపయోగించి నిరసనకారులపై ఉక్కుపాదాన్ని మోపారు. మరోవైపు మహ్మద్ ఖతామీ వరుసగా రెండోసారి కూడా ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005 ఆగస్టు 3 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు. ఇరాన్‌లోని మరిన్ని సామాజిక సంస్కరణలు జరగాలని మహ్మద్ ఖతామీ బహిరంగంగానే చెబుతుండేవారు.

Iran Supreme Leader Khamenei Biography
అయతుల్లా అలీ ఖమేనీ (AP File Photo)

అహ్మదీ నెజాద్ vs ఖమేనీ
మహ్మద్ ఖతామీ అనంతరం ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అహ్మదీ నెజాద్ కూడా స్వతంత్రంగా పనిచేసే ప్రయత్నం చేశారు. ఇరాన్ నిఘా విభాగం తన కంట్రోల్‌లో ఉండాలని ఆయన వాదించారు. అప్పట్లో హైదర్ మస్లేహీ అనే వ్యక్తిని ఇరాన్ నిఘా విభాగం మంత్రిగా సుప్రీం లీడర్ ఖమేనీ నియమిస్తారు. అయితే ఖమేనీని సంప్రదించకుండానే, హైదర్ మస్లేహీని ఆ పదవి నుంచి అహ్మదీ నెజాద్ తప్పిస్తారు. దీంతో వెంటనే ఆ పదవిలో మళ్లీ హైదర్ మస్లేహీని నియమిస్తూ ఖమేనీ ఆదేశాలు జారీ చేస్తారు. ఇందుకు నిరసనగా 11 రోజుల పాటు అధ్యక్ష కార్యాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే అహ్మదీ నెజాద్ ఉండిపోతారు. 2017, 2021, 2024 దేశ అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీ నెజాద్‌కు పోటీ చేసే అనుమతిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇవ్వకపోవడం గమనార్హం.

ఇరాక్‌‌లోకి ఇరాన్ ఎంట్రీ
2003లో ఇరాన్ పొరుగునే ఉన్న ఇరాక్‌పై అమెరికా దాడులు చేస్తుంది. దీంతో అక్కడి సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోతుంది.
ఇరాక్‌లో సున్నీ ముస్లింలు సింహభాగం ఉంటారు. అక్కడి మైనారిటీ షియా వర్గం వారిని చేరదీసి మిలిటెంట్ గ్రూపులను ఏర్పాటు చేయమని ఐఆర్‌జీసీకి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలిస్తారు. ఐఆర్‌జీసీ అనుబంధ విభాగం ఖుద్స్ ఫోర్స్‌కు చెందిన అధికారులు ఇరాక్‌కు వెళ్లి ఈ పనులన్నీ చేస్తారు. చివరకు ఖతాయబ్ హిజ్బుల్లా అనే మిలిటెంట్ సంస్థను అక్కడ ఏర్పాటుచేస్తారు. ఇప్పటికీ ఇది ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దీనికి ఆయుధాలు, నిధులను ఇరాన్ సర్కారే అందిస్తోంది. ఇరాక్‌లో అమెరికాకు సైనిక స్థావరం ఉంది. గత కొన్నేళ్లలో దానిపై ఖతాయబ్ హిజ్బుల్లా చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ అమెరికా సైనికులు చనిపోయారు.

ఖమేనీ అణ్వస్త్ర స్వప్నం
1957లో ఇరాన్ రాజుగా మహ్మద్ రజా షా పహల్వీ ఉన్న టైంలో అమెరికా నుంచి ఇరాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ అందింది. 1970 నాటికే ఇరాన్‌లో 23 న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. 1989లో ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక, ఈ న్యూక్లియర్ ప్లాంట్లను అణుబాంబుల తయారీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం చైనా, పాకిస్థాన్, రష్యా లాంటి దేశాల సాయాన్ని కోరారు. చివరకు పాకిస్థాన్ నుంచి కొంత టెక్నాలజీని, సెంట్రీ ఫ్యూజ్‌లను సేకరించి యురేనియాన్ని శుద్ధి చేసే ప్రక్రియను చేపట్టారు. విద్యుత్ తయారీ అవసరాల కోసం తమ నుంచి తీసుకున్న న్యూక్లియర్ టెక్నాలజీతో అణుబాంబులు తయారు చేయకూడదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2016 నుంచే బలంగా వాదిస్తున్నారు. 2019లో ఆయన ఇరాన్‌పై తీవ్రమైన ఆంక్షలను ప్రకటించారు. అయినా ఇరాన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్లలో యురేనియం శుద్ధి ప్రక్రియ ఆగలేదు. ఈనేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యేక సైనిక చర్యను నిర్వహించాయి. ఇందులో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు.