ETV Bharat / international

దిల్లీలో AI సమ్మిట్​- భారత్​కు రానున్న మెక్రాన్​- ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపిరి!

ఫిబ్రవరిలో భారత్‌కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు- న్యూదిల్లీలో జరిగే ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొననున్న మెక్రాన్​- గ్లోబల్ సౌత్‌లో తొలి అంతర్జాతీయ AI సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం

India France Relations
India France Relations (Photo/ X@DrSJaishankar)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 8:12 AM IST

3 Min Read
Choose ETV Bharat

India France Relations : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ వచ్చే నెలలో భారత్‌ను సందర్శించనున్నట్లు ప్రకటించారు. న్యూదిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నట్లు స్పష్టం చేశారు. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) ఫ్రాన్స్‌లోని డిప్లొమాటిక్ కార్ప్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన మెక్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రకటనను ఫ్రాన్స్ 24 ప్రసారం చేసింది.

2025లో ఫ్రెంచ్ దౌత్య విధానంలో సాధించిన విజయాలపై మాట్లాడిన మెక్రాన్, కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ దేశాలను ఒక వేదికపైకి తీసుకురావడంలో ఫ్రాన్స్ కీలక పాత్ర పోషించిందన్నారు. పారిస్‌లో నిర్వహించిన AI సమ్మిట్‌కు ప్రపంచ దేశాలన్నీ హాజరయ్యాయని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తాను సహాధ్యక్షత వహించానని గుర్తు చేశారు. ఆ సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణనాలకు కొనసాగింపుగా వచ్చే నెలలో భారత్‌కు వస్తున్నట్లు తెలిపారు.

"AI సమ్మిట్ ద్వారా ప్రపంచం పారిస్‌కు వచ్చింది. ఈ అంశంపై మేం గణనీయమైన పురోగతి సాధించాం. ప్రధాని మోదీతో కలిసి ఆ సమ్మిట్‌కు సహాధ్యక్షులుగా వ్యవహరించాం. ఆ చర్చలకు కొనసాగింపుగా వచ్చే నెలలో నేను భారత్‌లో ఉంటాను" అని మెక్రాన్ వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 19–20న AI ఇంపాక్ట్ సమ్మిట్
ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ AI యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ఇండియా–AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను అధికారికంగా ప్రకటించారు. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 19, 20 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది. గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ AI సమ్మిట్‌గా ఇది చరిత్రలో నిలవనుంది. AI అభివృద్ధి, దాని సామాజిక ప్రభావం, నియంత్రణ, నైతికత, అభివృద్ధి చెందుతున్న దేశాలకు దక్కే అవకాశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.

మెక్రాన్​ రాకపై ముందుగానే సంకేతాలు
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్–నోయెల్ బారోతో సమావేశంలో, అధ్యక్షుడు మెక్రాన్​ త్వరలోనే భారత్‌కు రానున్నారని పేర్కొన్నారు. భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్న తీరును ఆయన వివరించారు. "మేమిద్దరం అంతర్జాతీయ రంగంలో చాలా చురుకుగా ఉన్నాం. ఈ ఏడాది BRICSకు భారత్ అధ్యక్షత వహించగా, G7కు ఫ్రాన్స్ నేతృత్వం వహించింది. మేమిద్దరం G20 సభ్యులం కూడా. బహుళ ధ్రువ ప్రపంచాన్ని (మల్టీ పోలారిటీ) విశ్వసించే రెండు దేశాలుగా కలిసి పనిచేయడం ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా, గ్లోబల్ రాజకీయ స్థిరత్వానికి కూడా అవసరం" అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

మెక్రాన్​కు మోదీ శుభాకాంక్షలు
గురువారం జైశంకర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్​ను కలుసుకుని ప్రధాని నరేంద్ర మోదీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సమకాలీన గ్లోబల్ పరిణామాలపై మాక్రోన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను జైశంకర్ అభినందించారు. భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు వ్యక్తం చేసిన సానుకూల దృక్పథాన్ని ప్రశంసించారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ సోషల్ మీడియా వేదిక Xలో పంచుకున్నారు. "ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌ను కలవడం ఆనందంగా ఉంది. గ్లోబల్ పరిణామాలపై ఆయన అభిప్రాయాలు, భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన సానుకూల దృక్పథం ఎంతో అభినందనీయం" అని పేర్కొన్నారు.

అంబాసిడర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు
అంతకుముందు పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ అంబాసిడర్ల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. వాణిజ్యం, ఫైనాన్స్, సాంకేతికత, ఇంధనం, వనరులు, కనెక్టివిటీ వంటి అంశాలే ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు కారణమవుతున్నాయని చెప్పారు. ఈ మార్పుల్లో ఆలోచనా విధానాలే కీలకమని పేర్కొన్నారు. మల్టీ పోలారిటీ, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రోత్సహించడంలో భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపిరి
మెక్రాన్ భారత్ పర్యటనతో AI, రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం, ఇంధనం వంటి రంగాల్లో భారత్–ఫ్రాన్స్ సహకారం మరింత బలపడనుంది. ముఖ్యంగా AI ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా గ్లోబల్ సౌత్ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.