మరణశిక్ష తీర్పు మోసపూరితమంటూ హసీనా ఆగ్రహం- ఆమెను అప్పగించాలని భారత్‌కు బంగ్లా వినతి
మరణశిక్ష మోసపూరితం తీర్పుపై హసీనా స్పందన

Published : November 17, 2025 at 6:39 PM IST
Sheikh Hasina on Tribunal Verdict : ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు మరణ శిక్ష విధించడాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని హసీనా అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి విషయాల్లో తన హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. 2010లో బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరేలా తమ ప్రభుత్వం నడిపించిందని హసీనా గుర్తు చేశారు. మయన్మార్‌లో హింస చెలరేగడంతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామన్నారు. మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామని హసీనా ప్రశ్నించారు. మరోవైపు హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ బంద్ ప్రకటించింది. అటు ఆమెను అప్పగించాలని భారత్‌కు బంగ్లా విజ్ఞప్తి చేసింది.
"మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో బంగ్లాదేశ్‌లోని లక్షలాది మంది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకే యూనస్ ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ న్యాయం అందించడానికి విచారణ చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేవలం అవామీ లీగ్‌ను అంతం చేసి తాత్కాలిక ప్రధాని యూనస్ ఆయన మంత్రులు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పాలనలో ప్రజా సేవలు అస్తవ్యస్థమయ్యాయి. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా మహిళల హక్కులను అణచివేస్తున్నారు. ఇస్లాం మతతత్వ వాదులు ప్రభుత్వ పరిపాలనలో జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌కు ఉన్న సెక్యూలర్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేస్తున్నారు. జర్నలిస్టులను బంధించి హింసిస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధి క్షీణించింది."
--షేక్ హసీనా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
హసీనాను అప్పగించాలని భారత్‌కు బంగ్లా వినతి
మరోవైపు షేక్ హసీనాను తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను విజ్ఞప్తి చేసింది. ఆమెతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను వెంటనే అప్పగించాలని కోరింది. భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ప్రకారం ఇద్దరు దోషులను తిరిగి అప్పగించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని తెలిపింది. దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు ఆశ్రయం కల్పించడం న్యాయాన్ని అందించకపోగా స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది.
హసీనా తీర్పుపై భారత్ స్పందన
షేక్ హసీనాపై వెలువడిన తీర్పుకు సంబంధించి భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. షేక్ హసీనాపై ట్రైబ్యునల్ తీర్పును భారత్ పరిగణనలోకి తీసుకుందని వెల్లడించింది. పొరుగు దేశంగా బంగ్లా ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపింది. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉందని చెప్పింది. అన్ని వర్గాలతోనూ ఎల్లప్పుడూ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని వివరించింది.
కాగా అంతకుముందు ఢాకా అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. అప్పటి పోలీస్ చీఫ్ చౌధురి అబ్దుల్లా అప్రూవర్‌గా మారడంతో ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను చంపేయాలని పోలీసులు, సైన్యాన్ని హసీనా ఆదేశించారని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. నిరసనకారులపై దాడుల చేసేలా అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘాలను హసీనా ఉసిగొల్పారని తెలిపారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు ఆమె నిరాకరించారని వెల్లడించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను రజాకార్లుగా పేర్కొంటూ హసీనా వారిని రెచ్చగొట్టారని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులపై అవామీ లీగ్ పార్టీకి చెందిన అనుబంధ విభాగాలు దాడి చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆధారాలను సమర్పించిందని త్రిసభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను పునరుద్ధరించడాన్ని నిరసిస్తూ గతేడాది జులైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మృతిచెందారు. పరిస్థితి హద్దు దాటడంతో చివరకు హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. అప్పట్నుంచి ఆమె దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తూన్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వాటిపై న్యాయ విచారణకు ఆదేశించింది. దాదాపు ఏడాదికిపైగా విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.

