ETV Bharat / international

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి తప్పిన పెను ప్రమాదం- మెక్రాన్‌ బసచేసిన హోటల్ వద్ద భారీ పేలుడు

ప్రస్తుతం సిరియా పర్యటనలో ఉన్న మెక్రాన్- ఒక హోటల్‌లో బస చేసిన సమయంలో పేలుడు- ఘటనలో మెక్రాన్​ సురక్షితం- చెత్తబుట్టలో, పార్క్ చేసిన కారులో బాంబులను అమర్చి!

French President Emmanuel Macron
French President Emmanuel Macron (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : July 7, 2026 at 2:38 PM IST

3 Min Read
Choose ETV Bharat

Syria Damascus Explosion : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సిరియా పర్యటనలో ఉండగా ఆ దేశ రాజధాని డమాస్కస్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్- షరాతో సమావేశం కోసం అధ్యక్ష భవనంలోకి మెక్రాన్ ప్రవేశించిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. మెక్రాన్ బస చేసిన ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలోనే పేలుళ్లు జరిగాయి. ఈ మేరకు సిరియా మీడియా నివేదించింది. అయితే మెక్రాన్ సురక్షితంగా ఉన్నారని, ఇరు దేశాధినేతల చర్చలు కొనసాగుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.

రాజధాని నగర నడిబొడ్డున జరిగిన ఈ ఘటనకు పేలుడు పరికరాలే కారణమని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. డమాస్కస్‌లో రద్దీగా ఉండే వీధిలోని ఒక చెత్తబుట్టలో, అలాగే పార్క్ చేసిన కారులో బాంబులను అమర్చి దుండగులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపాయి. ఈ దాడిలో పలువురు పోలీసు అధికారులతో సహా నలుగురు గాయపడ్డారని, ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రదేశంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదస్థలిలో దట్టమైన పొగ అలుముకుంది. అలాగే, ఘటనా స్థలిలో ఒక వ్యాన్, మోటార్‌సైకిల్ మంటల్లో కాలిపోవడం వంటి దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.

అల్​ షరా ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారిన పేలుళ్లు
2024లో బషర్ అల్-అసద్ పాలనను తిరుగుబాటు ద్వారా కూలదోసి అహ్మద్ అల్-షరా అధికారంలోకి వచ్చారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి ఆయన ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పేలుళ్లు ఆయన ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. అల్-షరా గతంలో అల్-ఖైదాతో సంబంధాలున్న 'హయత్ తహ్రీర్ అల్-షమ్' ఉగ్రవాద ముఠాకు నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆయన తన ఇస్లామిక్ ప్రభుత్వ విధానాలను మార్చుకుని, మైనారిటీల నమ్మకాన్ని చూరగొనడానికి, పాశ్చాత్య దేశాల మద్దతును పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఆంక్షలు తొలగించడంలో మెక్రాన్​ది కీలక పాత్ర
ఇదిలా ఉండగా, సిరియాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను చాలా వరకు తొలగించేలా యూరప్, అమెరికాలపై ఒత్తిడి తీసుకురావడంలో మెక్రాన్ కీలక పాత్ర పోషించారు. ఆయన సోమవారం రాత్రి ఒక ఆర్థిక ప్రతినిధి బృందంతో ఆ దేశానికి చేరుకున్నారు. 2024లో తిరుగుబాటు ద్వారా బషర్ అస్సాద్‌ను గద్దె దించి అల్-షరా అధికారంలోకి వచ్చిన తర్వాత, సిరియాలో తొలిసారిగా పాశ్చాత్య దేశాధినేత మెక్రాన్ పర్యటిస్తున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధంతో అతలాకుతలమైన సిరియా పునర్నిర్మాణానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటన అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. కొన్ని రోజుల క్రితమే డమాస్కస్‌లోని జస్టిస్ ప్యాలెస్ సమీపంలోని ఒక కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది మరణించారు. తాజాగా జరిగిన ఈ దాడులు సిరియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి.

ఇక, సిరియాలోని అల్- షరా ప్రభుత్వం దేశంపై పూర్తి నియంత్రణను సాధించడానికి, వివిధ తిరుగుబాటు ముఠాలు, సాయుధ సమూహాల మధ్య జరుగుతున్న అంతర్గత హింసను అణచివేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సుదీర్ఘ అశాంతి, గందరగోళ పరిస్థితుల్లోనూ, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాజధాని నగరమైన డమాస్కస్​లో ఇప్పటివరకు చాలా వరకు ప్రశాంతంగానే ఉంది. అయితే, ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన వేళ జరిగిన ఈ తాజా పరిణామం అక్కడి శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి.

సిరియాలో గత 14 ఏళ్లుగా జరిగిన అంతర్యుద్ధం కారణంగా దాదాపు 5 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు వెలువడ్డాయి. అలాగే లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపాయి. దేశంలోని రోడ్లు, ఆసుపత్రులు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాయి. అయితే, సిరియా పునర్నిర్మాణానికి ఇతర దేశాలు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు భారీగా పెట్టుబడులు పెడతామని హామీలు ఇచ్చినప్పటికీ, దేశాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి, కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి రక్షించడానికి ఇంకా వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని నివేదికలు చెబుతున్నాయి.

చైనాలో భారీ వర్షాలు- విరిగిపడిన కొండచరియలు- 11మంది మృతి

మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం- బ్రహ్మోస్​తో సహా 20 కీలక ఒప్పందాలు ఖరారు