ETV Bharat / international

'యుద్ధం మానవాళిని వెనక్కి నెడుతోంది- దానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది'- పుతిన్‌కు స్పష్టం చేసిన మోదీ

షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ భేటీ- యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని స్పష్టీకరణ- భారత్ శాంతివైపే ఉంటుందని కీలక వ్యాఖ్యలు

Modi Putin Meeting At SCO
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ భేటీ (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 31, 2026 at 8:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Modi Putin Meeting At SCO : ఉక్రెయిన్‌‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి శాంతి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా సోమవారం రోజు మోదీ, పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తొలుత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం భారత్- రష్యా సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం సహా పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్‌తో భేటీలో ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి భారత్ వైఖరిని మోదీ వివరించారు. 'యుద్ధం గడిపే ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెడుతోంది. అదే శాంతి దిశగా వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశ, ఉత్సాహాన్ని నింపుతుంది. అంతులేని యుద్ధం నుంచి బయటపడి, యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. మానవాళి సంక్షేమానికి ఇదెంతో అవసరం.' అని మోదీ పుతిన్‌కు స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ సమస్యపై ఇంతకుముందు కూడా తామిద్దరం చర్చించుకున్నామని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్ అన్ని శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని, ఇకపైనా అదే కొనసాగుతుందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని అన్ని సమస్యలకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలన్నదే మానవాళి ఆకాంక్ష అని మోదీ పేర్కొన్నారు. 'ఇదే భారత్ సందేశం. గాంధీ, బుద్ధుడు నడిచిన భారత భూమి ఎల్లప్పుడూ శాంతి మార్గాన్నే ప్రబోధిస్తుంది.' అని మోదీ అన్నారు. 2022 లో సమర్‌కండ్‌లో జరిగిన SCO సమిట్ సందర్భంగా కూడా మోదీ 'ఇది యుద్ధాల యుగం కాదు.' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దిల్లీ బ్రిక్స్ సదస్సుకు పుతిన్‌కు ఆహ్వానం
ఈ భేటీలో మోదీ- రష్యా అధ్యక్షుడిని భారత్‌లో జరగనున్న తదుపరి బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించారు. 'ఈ సెప్టెంబరులో న్యూదిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు మిమ్మల్ని భారత్‌కు స్వాగతించేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మీ పర్యటన భారత్- రష్యా సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది.' అని మోదీ పుతిన్‌తో అన్నారు. దీనికి బదులుగా పుతిన్ కూడా ఇరు దేశాల సంబంధాలపై మోదీ చూపిస్తున్న ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్- రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు.

భారత్- రష్యా సంబంధాలపై చర్చ
ఇక భారత్‌కు రష్యా రక్షణ, ఇంధన రంగాల్లో కీలక వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. తాజా భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు, ప్రాంతీయ పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం. 2025 డిసెంబరులో పుతిన్, భారత పర్యటన సందర్భంగా జరిగిన భారత్- రష్యా వార్షిక సదస్సులో 16 అవగాహనా ఒప్పందాలు సహా మొత్తం 21 ప్రకటనలు వచ్చాయి. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య 23 వార్షిక సదస్సులు జరిగాయి.

ఇటీవల ఉజ్బెకిస్థాన్ పర్యటనను ముగించుకున్న మోదీ, ఆదివారం రోజు SCO సదస్సు కోసం బిష్కెక్‌కు చేరుకున్నారు. కిర్గిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు. ఈ సదస్సు సందర్భంగా మోదీ మొదట ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ను కూడా కలిశారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత మోదీ, ఇరాన్ అధ్యక్షుడిని కలవడం ఇదే తొలిసారి. సమావేశంలో యుద్ధం ముగింపు సహా హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇక SCO సదస్సులో సభ్య దేశాల నేతలు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చించనున్నారు. చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ కలిసి 2001లో SCO ను ఏర్పాటు చేశాయి. భారత్, పాకిస్థాన్ 2017లో ఇందులో పూర్తి స్థాయి సభ్యులుగా చేరాయి. 2023లో ఇరాన్, 2024లో బెలారస్ కూడా భాగమయ్యాయి.

మానవ తప్పిదాల వల్లే వాతావరణ మార్పులు- గత 40 ఏళ్లలో లేనంత తీవ్రంగా ఎల్​నినో!

పాకిస్థాన్‌లో శతాబ్దాల నాటి హిందూ దేవాలయం కూల్చివేత- మదర్సా కోసం ఆక్రమణ!