ETV Bharat / international

వెనెజువెలా ప్రజల శ్రేయస్సును భారత్​ కోరుకుంటోంది- అక్కడి పరిణామాలు ఆందోళనకరం: జైశంకర్

'అమెరికా, వెనెజువెలా ప్రభుత్వాలు చర్చించాలి- ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'- జైశంకర్ సూచన

EAM Jaishankar
EAM Jaishankar (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 10:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

EAM Jaishankar About Venezuela : వెనెజువెలాలో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అమెరికా, వెనెజువెలా ప్రభుత్వాలు చర్చించి ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టంచేశారు. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య చేపట్టిన అనంతరం భారత్​ నుంచి వచ్చిన మొదటి ప్రకటన ఇదే కావడం గమనార్హం.

లక్సెంబర్గ్‌ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి అయిన జేవియర్ బెట్టెల్‌తో జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై ఇద్దరు నేతలు మాట్లాడారు. భారత్‌, లక్సెంబర్గ్ 78 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నట్లు జైశంకర్‌ తెలిపారు. ఐరోపా సమాఖ్యలో లక్సెంబర్గ్‌ను కీలక భాగస్వామిగా భారత్‌ చూస్తుందని అన్నారు. అనంతరం విలేకరులోతో మాట్లాడుతూ, వెనుజువెలాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు.

"వెనెజువెలాలో జరుగుతున్న పరిణామాలపై మేము ఆందోళన చెందుతున్నాం. అక్కడి ప్రజల సంక్షేమం, భద్రత దృష్ట్యా, అన్ని పక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మేము కోరుతున్నాం. వెనెజువెలాతో భారత్​కు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ ప్రజలు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి క్షేమంగా బయటపడాలని మేము ఆకాంక్షిస్తున్నాము." - జై శంకర్​, భారత విదేశాంగ మంత్రి

అంతకు ముందు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) కూడా వెనెజువెలా పరిస్థితుల స్పందిస్తూ 'శాంతియుత చర్చల ద్వారా అమెరికా, వెనెజువెలాలు సమస్యలను పరిష్కరించుకోవాలి' అని సూచించింది. "వెనెజువెలాలోని తాజా పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నాం. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ప్రాంతీయ శాంతి, సుస్థిరత కోసం అందరూ సంయమనం పాటించాలని భారత్ కోరుతోంది" అని ఆదివారం ఎంఈఏ ప్రకటించింది. కారకాస్​లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారికి అన్ని విధాలా అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.

భారతీయలకు హెచ్చరిక
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అత్యవసరమైతే తప్ప వెనెజువెలాకు ప్రయాణం చేయవద్దని భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కారకాస్​లోని భారత రాయబార కార్యాలయంతో (Email: cons.caracas@mea.gov.in, Ph: +58-412-9584288) టచ్‌లో ఉండాలని కోరింది.

మాజీ రాయబారి ఏమంటున్నారంటే?
వెనెజువెలా మాజీ భారత రాయబారి వై.కె.సిన్హా మాట్లాడుతూ, వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి పట్ల, భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా (very measured) స్పందించిందని అన్నారు. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనాలు చాలా తీవ్రంగా అమెరికా దాడిని తీవ్రం ఖండించగా, భారత్​ మాత్రం చాలా సంయమనంతో కూడిన ప్రకటన చేసిందని ఆయన గుర్తు చేశారు. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ సమాజం కూడా అమెరికా చర్యలను మద్దతు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్​, అర్జెంటీనా లాంటి కొన్ని దేశాలు మాత్రమే అమెరికాకు మద్దతుగా నిలిచాయన్నారు.

అమెరికా దురాక్రమణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆజ్ఞతో, యూఎస్​ దళాలు వెనెజువెలాపై దాడులు చేసి, ఆ దేశాధ్యక్షుడైన నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్​ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ నార్కో-టెర్రరిస్టులుగా పేర్కొంటూ, న్యూయార్క్​లోని బ్రూక్లిన్ జైలులో ఉంచారు. అయితే తమపై మోపిన డ్రగ్స్​, ఆయుధాల అక్రమ రవాణా కేసులను మదురో దంపతులు ఖండించారు. తాము నిర్దోషులమని అమెరికన్ కోర్టులో వాదించారు. అమెరికా నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల సరఫరా లాంటి కారణాలు చెబుతున్నప్పటికీ, వెనెజువెలాలోని అపారమైన చమురు నిక్షేపాలను దోచుకోవడానికే ఈ దాడికి పాల్పడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యకూ వెనుకాడబోం - అమెరికా సంచలన కామెంట్స్

మోదీ నాపట్ల సంతోషంగా లేరు : డొనాల్డ్ ట్రంప్