వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్తత- అధ్యక్ష భవనం వద్ద కాల్పుల శబ్దాలు
వెనెజువెలా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు- డ్రోన్‌లు ఎగరడాన్ని గుర్తించిన భద్రతా దళాలు

Published : January 6, 2026 at 10:04 AM IST
Gunfire Near Venezuelan Palace : వెనెజువెలాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ, రాజధాని కారకాస్‌లోని మిరాఫ్లోరెస్ అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించడం ఆందోళనకు దారితీసింది. ఇటీవలే అమెరికా బలగాల చేతుల్లో అరెస్టైన మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఘటన నేపథ్యంలో ఆ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కారకాస్ సెంట్రల్ ప్రాంతంలో ఉన్న మిరాఫ్లోరెస్ ప్యాలెస్ పరిసరాల్లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో అధ్యక్ష భవనం మీదుగా గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. డ్రోన్లను భద్రతా ముప్పుగా భావించిన సైన్యం, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. దాదాపు ఒక నిమిషం పాటు కాల్పులు కొనసాగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
🚨 BREAKING: Intense gunfire reported across Caracas, Venezuela’s capital.
— 𝔉🅰𝒏 Karoline Leavitt (@WHLeavitt) January 6, 2026
Situation unclear—possibly the regime putting on a show of force.
Do you support Trump’s arresting Maduro?
A. Yes
B. No pic.twitter.com/kSQe5drQPQ
అదుపులోనే పరిస్థితి
ఈ ఘటన జరిగిన వెంటనే వెనెజువెలా ప్రభుత్వం స్పందించింది. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, భవనానికి నష్టం వాటిల్లలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే డ్రోన్లు ఎవరు పంపించారు? వాటి ఉద్దేశ్యం ఏమిటి? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకునే కొద్ది గంటల ముందే కీలక రాజకీయ పరిణామం జరిగింది. అమెరికా బలగాలు ఇటీవల మదురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ సోమవారం అంతరిమ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన కొద్ది గంటల్లోనే మిరాఫ్లోరెస్ ప్యాలెస్ వద్ద కాల్పుల ఘటన జరగడం దేశ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెంచింది.
🚨🚨🚨🚨 HEAVY GUNFIRE NEAR VENEZUELA’S PRESIDENTIAL PALACE 🚨🚨🚨🚨🚨
— George Michael (@RGeorgeMichael) January 6, 2026
SOMETHING BIG IS GOING DOWN RIGHT NOW ⚠️⚠️⚠️
I put together this compilation of footage so you can see every angle.
TURN THE NOTIFICATIONS ON TO STAY UPDATED!!! pic.twitter.com/bAIRMt4HIx
మాకేం సంబంధం లేదు: అమెరికా
ఈ ఘటనపై అమెరికా కూడా స్పందించింది. వెనెజువెలాలో జరిగిన కాల్పుల ఘటనలో తమకు ఎలాంటి పాత్ర లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, మీడియాలో వస్తున్న కథనాలపై సమాచారం సేకరిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. సీఎన్‌ఎన్ కథనం ప్రకారం, అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహిస్తున్న వేర్వేరు భద్రతా బృందాల మధ్య ఏర్పడిన అపోహ వల్లే కాల్పులు జరిగి ఉండవచ్చని పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ ఇంకా రాలేదు.
ఇదిలా ఉండగా, అమెరికాలో మదురోపై విచారణ కొనసాగుతోంది. శనివారం రాత్రి అమెరికా బలగాలు నిర్వహించిన సంచలన ఆపరేషన్‌లో మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను కారకాస్‌లోని ఓ సైనిక స్థావరంలో నుంచి అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించారు. ఈ చర్యను మదురో వర్గాలు సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించాయి. మదురో దంపతులపై నార్కో-టెర్రరిజం కుట్రకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో తొలిసారి హాజరైన మదురో, తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు.
"నేను నిర్దోషిని. నేను ఇంకా నా దేశ అధ్యక్షుడినే" అంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేశారు. కోర్టు బయట మదురోకు అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద సంఖ్యలో నిరసనలు చేపట్టాయి. ఇక కారకాస్‌లో డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, అమెరికా చర్యలకు ప్రతిగా ఎలాంటి ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శించలేదు. అయితే జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా తిరిగి నియమితులైన ఆమె సోదరుడు జార్జ్ రోడ్రిగ్జ్ మాత్రం మదురోను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అన్ని అంతర్జాతీయ వేదికల్లో పోరాడతామని ప్రకటించారు.
గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటే ‘నాటో’ సమాప్తమైనట్టే : డెన్మార్క్ ప్రధాని
వెనెజువెలా అధ్యక్షురాలిగా డెల్సీ బాధ్యతలు- మదురోను కిడ్నాప్ చేశారన్న కొడుకు

