ETV Bharat / international

'ఇరాన్‌కు స్వేచ్ఛ కావాలి- సాయం చేయడానికి అమెరికా రెడీ'- ట్రంప్ సంచలన ప్రకటన

నిరసనకారులను చంపితే ఊరుకోం- ఇరాన్ పాలకులకు ట్రంప్ వార్నింగ్- 100 నగరాల్లో భగ్గుమన్న ఆందోళనలు

Trump Support For Iran Protests
Trump Support For Iran Protests (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 7:08 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Support For Iran Protests: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. "ఇరాన్ ఇప్పుడు స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆ దేశ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛా పోరాటానికి సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటిన వేళ, ఆయన శనివారం 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ ప్రకటన చేశారు. ఆందోళనకారుల జోలికి వస్తే సహించేది లేదని, వారిపై బుల్లెట్లు పేలితే అమెరికా కూడా రంగంలోకి దిగుతుందని ఇరాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

'మీరు కాలిస్తే, మేం కూడా కాలుస్తాం'
ఇరాన్ పాలకులను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. "ఇరాన్ పాలకులు జాగ్రత్తగా ఉండాలి. నిరసనకారులను సురక్షితంగా ఉండనివ్వండి. గతంలో మాదిరిగా అమాయక ప్రజలను చంపడం మొదలుపెడితే, మేం కచ్చితంగా జోక్యం చేసుకుంటాం. మీరు కాల్పులు జరిపితే, మేం కూడా కాల్చాల్సి వస్తుంది. మా సైనికులు మీ గడ్డపైకి దిగకపోవచ్చు. కానీ మిమ్మల్ని ఎక్కడ కొడితే నొప్పి తెలుస్తుందో మాకు బాగా తెలుసు. అత్యంత కఠినంగా మిమ్మల్ని దెబ్బకొడతాం" అని ట్రంప్ హెచ్చరించారు.

అద్భుతం జరుగుతోంది
ఇరాన్ ప్రజల పోరాటాన్ని ట్రంప్ ప్రశంసించారు. "ఇరాన్‌లో ప్రజలు ఎవరూ ఊహించని విధంగా నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. పాలకులు ప్రజలను చాలా కాలంగా హింసించారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇరాన్ ప్రజలు తిరగబడటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. మేం అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

'ఒబామా పాలన కాదు'
ట్రంప్ వ్యాఖ్యలకు రిపబ్లికన్ పార్టీ నేతలు మద్దతు పలికారు. సెనేటర్ లిండ్సే గ్రాహం ఘాటుగా స్పందించారు. "ఇది ఒబామా ప్రభుత్వం కాదు. ఇరాన్ అయతుల్లా బెదిరింపులకు భయపడం. ఇరాన్ పాలకులు మతపరమైన నాజీలు. వారి క్రూరత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అమెరికా అండగా నిలుస్తుంది. ఇరాన్‌ను మళ్లీ గొప్పగా మారుద్దాం" అని గ్రాహం పోస్ట్ చేశారు.

100 నగరాల్లో మంటలు
ఇరాన్‌లో పరిస్థితులు చేయి దాటిపోయాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలపై మొదలైన చిన్న నిరసనలు, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దాదాపు 100 నగరాలకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. 1979 విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చిన 'ఇస్లామిక్ రిపబ్లిక్' పాలనను అంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా జనం ప్రధాన నగరాలను, వీధులను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

'దేవుడి శత్రువులు మరణశిక్ష తప్పదు'
ప్రజల ఆందోళనలపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవహెదీ ఆజాద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో ఎవరైనా పాల్గొన్నా, వారికి సాయం చేసినా కఠిన చర్యలు ఉంటాయి. వారిని (దేవుడి శత్రువులు)గా పరిగణిస్తాం. ఇరాన్ చట్టాల ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తాం" అని ప్రకటించారు.

ఆయిల్ బంద్, టెహ్రాన్‌ను ఆక్రమించండి
ఈ పరిణామాల మధ్య ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావీ కీలక ప్రకటన చేశారు. 1979 నుంచి ప్రవాసంలో ఉన్న ఆయన, ప్రజలకు పిలుపునిచ్చారు. "కీలకమైన ఆయిల్, గ్యాస్, రవాణా, ఇంధన రంగాల కార్మికులు వెంటనే సమ్మె మొదలుపెట్టాలి. దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయాలి. ప్రజలంతా వారాంతంలో వీధుల్లోకి రావాలి. రాజధాని టెహ్రాన్ ప్రధాన కూడళ్లను ఆక్రమించుకోవాలి" అని ఆయన సందేశం పంపారు.