ETV Bharat / international

రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం సుంకాలు : ట్రంప్

రష్యాతో వ్యాపారం చేస్తే అతి తీవ్ర ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్- సెనెట్‌ పరిశీలనలోని బిల్లుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు- టార్గెట్‌లో భారత్, చైనా, బ్రెజిల్

Trump Tariffs On Russia Partners
US Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : November 17, 2025 at 10:10 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Tariffs On Russia Partners :రష్యాతో వ్యాపార,వాణిజ్యాలు చేస్తున్న అన్ని దేశాలపై అతి తీవ్ర ఆంక్షలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. రష్యా నుంచి ముడి చమురును కొనే, దాన్ని రీసేల్ చేసే దేశాలపై 500 శాతం దాకా సుంకాలను విధిస్తామని ఆయన వెల్లడించారు. ఈమేరకు కఠిన ప్రతిపాదనలతో కూడిన ఓ బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఒకవేళ ఆ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోద ముద్ర లభిస్తే, తాను స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు. 500 శాతం సుంకాలను ఎదుర్కొనే దేశాల జాబితాలో ఇరాన్‌ను చేర్చాలని తాను సూచించానని, తప్పకుండా ఆ దేశాన్ని జాబితాలో చేరుస్తారని పేర్కొన్నారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025'
రష్యా వాణిజ్య భాగస్వాములపై 500 శాతం సుంకాలను విధించే ప్రతిపాదనతో కూడిన బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ సెనెటర్ లిండ్సే గ్రాహం, విపక్ష డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ కలిసి అమెరికా సెనెట్‌లో ప్రవేశపెట్టారు.ఈ బిల్లు పేరు 'శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025'. 85 మంది సెనెటర్ల కనీస మద్దతుతో ఈ బిల్లును సెనెట్‌లో చర్చకు పెట్టారు. దీనికి సెనెట్‌లోని అత్యంత కీలకమైన 'విదేశీ సంబంధాల కమిటీ' ఏకగ్రీవ మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభిస్తే, రష్యా వాణిజ్య భాగస్వాములపై 500 శాతం సుంకాలను విధించే అధికారం ప్రెసిడెంట్ ట్రంప్ చేతికొస్తుంది. ఈ అధికారంతో ప్రధానంగా చైనా, భారత్‌లను ట్రంప్ లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇరాన్, ఉత్తర కొరియాలాంటి దేశాలు ఎలాగూ ఆ జాబితాలో ఉంటాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని చాలా భూభాగాన్ని రష్యా ఆర్మీ ఆక్రమించుకుంది. ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్‌లోని కీలకమైన రైల్వే హబ్ 'పొక్రో‌వ్‌స్క్'ను స్వాధీనం చేసుకోవడంపై పుతిన్ సేనలు ఫోకస్ పెట్టాయి. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై భీకర వైమానిక దాడులను రష్యా చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాలోని ముడి చమురు రిఫైనరీలపై దాడులు మొదలుపెట్టింది. ఈ యుద్ధం తీవ్రరూపు దాలుస్తున్న తరుణంలో రష్యా మిత్రదేశాలపై 500 శాతం సుంకాలను విధించే అధికార దండాన్ని సిద్ధం చేసుకోవడంపై ట్రంప్ ఫోకస్ చేస్తుండటం గమనార్హం.

అలస్కా భేటీ తర్వాత కూడా ఆగని యుద్ధం
కొన్ని నెలల క్రితమే అమెరికాలోని అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, శాంతిని నెలకొల్పాలని సూచించారు. ఈ భేటీ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తీవ్రత మరింత పెరిగింది. దీంతో రష్యాతో, రష్యా మిత్రదేశాలతో కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు అదుపులోకి వస్తాయనే అభిప్రాయానికి ట్రంప్ వచ్చారని పరిశీలకులు అంటున్నారు. ఈక్రమంలోనే రష్యాను ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలను వేగవంతం చేశారని చెబుతున్నారు. 500 శాతం సుంకాల అంశాన్ని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

చైనా, భారత్, బ్రెజిల్‌లపై భారీ సుంకాలు
ఈ ఏడాది జులైలో సెనెటర్లు లిండ్సే గ్రాహం(రిపబ్లికన్ పార్టీ), రిచర్డ్ బ్లూమెంథాల్ (డెమొక్రటిక్ పార్టీ) ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. రష్యా వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, భారత్, బ్రెజిల్‌లపై భారీ సుంకాలను విధిస్తేనే, రష్యా -ఉక్రెయిన్ యుద్దం ఆగుతుందని వారు అభిప్రాయపడ్డారు. రష్యా మిత్రదేశాలను సుంకాలతో కట్టడి చేస్తేనే, ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా సైన్యానికి ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందన్నారు. రష్యా ఆర్థిక మూలాలను బలహీనపరిస్తేనే ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రత తగ్గుతుందనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం పలు దేశాలు వాణిజ్యం ద్వారా రష్యాకు ఆర్థిక వనరులను సమకూరుస్తూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధంలో భాగస్వామ్యం అవుతున్నాయని అమెరికా సర్కారు ఆరోపిస్తోంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధిస్తోంది. ఇందులో 25 శాతం సుంకాన్ని, కేవలం రష్యా నుంచి ఆయిల్‌ను కొంటున్నందుకే విధిస్తోంది. అయితే ఈ ఏడాది అక్టోబరులో ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును భారత్ చాలావరకు తగ్గించిందని ఆయన చెప్పారు. ఆ మేరకు భారత్‌పై విధించిన సుంకాలను తగ్గిస్తామన్నారు.

ఓవైపు అమెరికా, మరోవైపు ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులను రష్యా ఆపడం లేదు. ఆసియాలోని పలు పెద్ద దేశాలతో వాణిజ్య సంబంధాల వల్లే రష్యా ఆర్థిక మూలాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఆ వాణిజ్య సంబంధాలను అడ్డుకునే ప్రయత్నాల్లో అమెరికా ఉంది. ఈ దిశగా అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయో, కావో వేచిచూడాలి.

భారత్​కు పుతిన్- ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న రష్యా

ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్- అణు పరీక్షలకు ఆదేశించిన రష్యా అధ్యక్షుడు పుతిన్!