ETV Bharat / international

అప్పుడు ఉక్రెయిన్​లో విధ్వంసం- ఇప్పుడు గల్ఫ్​ దేశాలకు గుబులు - 'చీప్' డ్రోన్స్​తో ఇరాన్​ ఖరీదైన యుద్ధం

అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ సూసైడ్ డ్రోన్ల వరుస దాడులు- 16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు 30 కోట్ల పాట్రియాట్ క్షిపణి వినియోగం- దీర్ఘకాల యుద్ధంలో గల్ఫ్ రక్షణ నిల్వలు ఖాళీ అయ్యే ప్రమాదం

Iran Shahed Drones
Iran Shahed Drones (EENADU FILE IMAGE)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 3:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Shahed Drones : ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధంతో గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్‌ ప్రయోగిస్తున్న డ్రోన్లు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో తయారయ్యే షాహెద్ సూసైడ్ డ్రోన్లు గల్ఫ్​ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఫలితంగా ఆయా దేశాలకు తీవ్ర ఆ‌ర్థిక నష్టాన్ని కలిగిస్తు‌న్నాయి. గత కొన్నేళ్లుగా డ్రోన్ల శబ్దం ఉక్రెయిన్ యుద్ధంలో వినిపిస్తుండటం వార్తల్లో అందరం చూశాం. చాలా చౌకైన ఆ డ్రోన్లను మిత్రదేశమైన రష్యాకు ఇరాన్ అందించింది. ఆ డ్రోన్లతో రష్యా అక్కడ విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు అదే డ్రోన్లను గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, అగ్రరాజ్య మిత్రదేసాల బేస్​లపై ప్రయోగిస్తోంది. తద్వారా గల్ఫ్ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.

లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే!
అమెరికా- ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తక్కువ ధరలో పెద్దఎత్తున డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇరాన్ తయారు చేస్తున్న షాహెద్-136 వన్‌వే అటాక్ డ్రోన్లు చిన్న క్రూయిజ్ మిస్సైళ్లలా పనిచేస్తాయి. ఇవి లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. అమెరికా సైనిక స్థావరాలు, చమురు నిల్వలు, మౌలిక వసతులు, పౌర భవనాలపై దాడులు చేస్తున్నాయి. గల్ఫ్‌ దేశాలు అప్రమత్తమవుతున్నప్పటికీ, నిరంతర దాడులు వాటి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.

షాహెద్ డ్రోన్ల ఖర్చు హాట్ టాపిక్​!
ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన తర్వాత పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీనికి ప్రతీకారంగా అమెరికా మిత్ర దేశాలపై దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. అయితే యుద్ధంలో ప్రధానంగా చర్చనీయాంశమవుతున్నది షాహెద్ డ్రోన్ల ఖర్చు. ఒక్కొక్కటి తయారీకి సుమారు 20 వేల డాలర్లు, అంటే సుమారు 16 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతుంది. కానీ దానిని అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు, అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు కోట్లు దాటుతోంది.

16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు 30 కోట్ల క్షిపణి
ఉదాహరణకు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్వహించే ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర. 35- 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్‌వైండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువ. ఇక అమెరికా ఉపయోగిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆర్మీకి చెందిన పాట్రియాట్ మిస్సైల్ సిస్టమ్లో ఒక్క ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే 16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు 30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి.

ఆయుధాలు తగ్గిపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం
ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం సాగితే ఖరీదైన మిస్సైళ్ల నిల్వలు త్వరగా ఖాళీ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్‌లోని కొన్ని దేశాల్లో నిల్వలు తగ్గుతున్నాయని అంతర్గత అంచనాలు చెబుతున్నాయి. ఒకవైపు డ్రోన్లు భారీ సంఖ్యలో వస్తుండగా, మరోవైపు వాటిని అడ్డుకునే ఆయుధాలు తగ్గిపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది.

యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి?
సైనిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది అట్రిషన్ వార్ వ్యూహం. అంటే శత్రువును ఖర్చులతో అలిసిపోయేలా చేయడం. ఇరాన్ తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు తయారు చేసి ప్రయోగిస్తే, అమెరికా–ఇజ్రాయెల్‌లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని వారు భావిస్తున్నారు.

ఆధునిక యుద్ధాల్లో గేమ్‌చేంజర్‌లుగా!
గల్ఫ్ దేశాలు కూడా దౌత్యపరంగా పరిష్కారం కోరుతున్నట్లు సమాచారం. దీర్ఘకాల యుద్ధం తమ భద్రతకే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పు అని అవి భావిస్తున్నాయి. చమురు సరఫరాలపై ప్రభావం పడితే ప్రపంచ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి, తక్కువ ధరలో తయారయ్యే ఈ షాహెద్ డ్రోన్లు ఇప్పుడు ఆధునిక యుద్ధాల్లో గేమ్‌చేంజర్‌లుగా మారాయి. ఖరీదైన క్షిపణి వ్యవస్థలకే సవాల్ విసురుతున్నాయి. సాంకేతికత కంటే వ్యూహమే గెలుస్తుందనే సందేశాన్ని ఇరాన్ ఇస్తోంది.

పశ్చిమాసియా పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా, ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాలు తక్షణమే ప్రత్యామ్నాయ రక్షణ పద్ధతులు, దౌత్య మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే చవక డ్రోన్లు ఖరీదైన యుద్ధాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వార్​ ఎఫెక్ట్ : హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్- నిలిచిపోయిన 700కు పైగా నౌకలు

రగులుతున్న పశ్చిమాసియా: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు- కీలక స్థావరాలు ధ్వంసం