ETV Bharat / international

మా లక్ష్యాలన్నీ సాధించే వరకు ఇరాన్​పై ఆపరేషన్ కొనసాగుతోంది : ట్రంప్

ఇరాన్​పై ఆపరేషన్​ కొనసాగిస్తామని ట్రంప్ వ్యాఖ్యలు- సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడి- ట్రెహాన్​పై మరింత దాడిని పెంచామని సైనిక దళాలకు ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశం

Trump on Iran Operation
US President Donald Trump (AP file Photo)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 7:07 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump on Iran Operation : తమ లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్​పై అమెరికా చేపట్టిన ఆపరేషన్​ను కొనసాగిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్​ ఫ్యూరీని పూర్తి శక్తితో కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్​ మీడియా ట్రూత్​లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరోవైపు ఇజ్రాయెల్​ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఇరాన్​పై నిర్ణయాత్మక దెబ్బ కొడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ మేరకు ట్రెహాన్​పై దాడిని మరింత పెంచాలని తమ దళాలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

వందలాది లక్ష్యాలపై దాడులు : ట్రంప్
గత 36 గంటల్లో అమెరికా, మిత్ర దేశాలు కలిసి ప్రపచంలో ఎప్పుడూ చూడని స్థాయిలో భారీ సైనిక దాడిని ప్రారంభించాయని ట్రంప్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇంతటి ఆపరేషన్‌ను ఎవరూ చూడలేదని తెలిపారు. అమెరికా దళాలు ఇరాన్‌లో వందలాది లక్ష్యాలపై దాడులు జరిపాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్​ (ఐఆర్​జీసీ) కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్పారు. కొన్ని నిమిషాల్లోనే తొమ్మిది నౌకలను, వాటి నౌకా నిర్మాణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని ట్రంప్ తెలిపారు.

'ఇరాన్ సైనిక వ్యవస్థ కూల్చివేత'
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యంత దుర్శార్గుడుగా విమర్శిస్తూ, అనేక మంది అమెరికన్ల రక్తం ఖమేనీ చేతుల్లో ఉందని ట్రంప్ అన్నారు. ఖమేనీ మరణ వార్త వెలువడిన తర్వాత ఇరాన్ అంతటా ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారని ట్రంప్ అన్నారు. ఇరాన్​ మొత్తం సైనిక కమాండ్ వ్యవస్థను నిర్వీర్యం చేశామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్, పోలీసులకు లొంగిపోవాలని పిలుపునిస్తూ, లొంగిపోతే రక్షణ, లేదంటే కచ్చితంగా మరణం తప్పదని హెచ్చరించారు. ఇరాన్ నేతలు చాలా మంది లొంగిపోవాలని కోరుకుంటున్నారని, వేల సంఖ్యలో కాల్స్​ వస్తున్నాయని పేర్కొన్నారు.

'సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటాం'
అలాగే అమెరికా సైనిక సిబ్బంది మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల్ని స్మరించుకుంటున్నామని అన్నారు. ఇరాన్​ వివాదం ముగిసే లోపు ఇంకా ప్రాణ నష్టాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారి మరణాలకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పౌరులపై యుద్ధం చేసిన ఉగ్రవాదులను దెబ్బ తీస్తామని తెలిపారు. ఇరాన్ వద్ద దీర్ఘశ్రేణి క్షిపణులు, అణ్వస్త్రాలతో ఉంటే ప్రపంచానికి ముప్పు అని ట్రంప్ అన్నారు. ఉగ్రవాద సైన్యాలను పెంచే దేశానికి ఇలాంటి ఆయుధాలు ఉండనివ్వమని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి, స్వేచ్ఛ కోసం ధైర్యంగా ముందుకు వచ్చి మీ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, అమెరికా మీకు అండగా ఉంటుందని తెలిపారు.

ఇరాన్​పై దాడిని పెంచుతాం : ఇజ్రాయెల్
ఇరాన్​పై మరింత దాడిని పెంచేలా తమ సైనిక దళాలను ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రక్షణ ప్రధాన కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేశారు. 'శనివారం మేము నియంత ఖమేనిని అంతమొందించాం. ఆయనతో పాటు అణచివేత పాలనకు చెందిన డజన్ల కొద్దీ ఉన్నతాధికారులను కూడా తొలగించాం. ఇప్పుడు మా దళాలు టెహ్రాన్​పై మరింత తీవ్రంగా దాడులు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుంది అని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా నేను కోరుకున్న లక్ష్యాన్ని ఇప్పుడు సాధించే అవకాశం వచ్చింది. ఉగ్ర పాలనను సమూలంగా దెబ్బతీస్తాం. ఇదే నేను ఇచ్చిన హామీ. ఇదే మేము చేస్తాం. మన ఉనికిని, భవిష్యత్తును రక్షించుకోవడానికి ఐడీఎఫ్ పూర్తి శక్తితో యుద్ధరంగంలో ఉంది. ఈ ఆపరేషన్‌లో మా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా సైన్యం మాకు సహకరిస్తున్నాయి' అని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం సంభవించిందని నెతన్యాహు తెలిపారు. ఇవి బాధాకరమైన రోజులని, టెల్ అవీవ్, బీట్ షెమెష్ ప్రాంతాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గాయపడిన ఇజ్రాయెల్ పౌరులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.