ETV Bharat / international

మదురోలా అమెరికాకు కొలంబియా అధ్యక్షుడు సవాల్​- సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్

మాతృభూమి కోసం అవసరమైతే ఆయుధాలు చేతపడతానన్నా కొలంబియా అధ్యక్షుడు పెట్రో

colombian president gustavo petro
colombian president gustavo petro (associated press)
author img

By ETV Bharat Telugu Team

Published : January 6, 2026 at 8:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Colombian President Warns US : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్​ మదురోను నిర్బంధంచిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ చేసిన వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఘాటుగా స్పందించారు. తమ దేశంపై అమెరికా సైనిక చర్య చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను ఆయుధాన్ని పట్టుకోనని గతంలో ప్రమాణం చేశానని, కానీ మాతృభూమి కోసం అవసరమైతే వాటిని మళ్లీ చేతపడతానన్నారు. 'నన్ను తీసుకెళ్లండి. ఇక్కడే మీ కోసం ఎదురు చూస్తున్నా' అని గతంలో మదురో సవాల్‌ చేసినట్లుగానే వ్యాఖ్యానించారు. లాటిన్‌ అమెరికాలోని మెక్సికో, క్యూబా, కొలంబియాలను ఉద్దేశిస్తూ పద్ధతి మార్చుకోకపోతే వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్​ హెచ్చరించిన నేపథ్యంలో పెట్రో ఈ విధంగా స్పందించారు.

గెరిల్లా పోరాటంలో పాల్గొన్న కొలంబియా అధ్యక్షుడు!
మరోవైపు వెనెజువెలాపై దాడిని తీవ్రంగా ఖండించిన కొలంబియా అధ్యక్షుడు పెట్రో తమ రైతులపై (అమెరికా) బాంబులు వేస్తే, పర్వత ప్రాంతాల్లో వేలాది మంది గెరిల్లాలు ఉద్యమిస్తారని వ్యాఖ్యానించారు. దేశంలో అనేక మంది అభిమానించే అధ్యక్షుడిని నిర్బంధిస్తే, ప్రజల ఊరుకోరని, ఆగ్రహానికి గురవుతారని పేర్కొన్నారు. 1990కి ముందు పెట్రో గెరిల్లా పోరాటంలో పనిచేశారు. ఇదిలా ఉండగా, బెదిరింపులు, బలప్రయోగం అనేవి అంతర్జాతీయ సంబంధాల్లో ఆమోదయోగ్యం కాదని కొలంబియా విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. హింస, బలప్రయోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది.

ధైర్యముంటే అధ్యక్ష భవనానికి వచ్చి నన్ను తీసుకెళ్లండి!
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా బలగాలు నిర్బందించే కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ మదురో చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. 'ధైర్యముంటే అధ్యక్ష భవనానికి వచ్చి తనను తీసుకెళ్లండి' అని మదురో అందులో సవాల్‌ విసిరినట్లు వీడియోలో ఉంది. అయితే అలాగే చేసిన అమెరికా సైన్యం వెనెజువెలా అధ్యక్ష భవనంలోకి వెళ్లి ఆయన్ను అరెస్టు చేసి తీసుకుపోవడం గమనార్హం.

అంతకుముందు వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే ఇదివరకు ప్రకటించిన నజరానాను 50 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.450 కోట్లు)కు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మదురో, అమెరికాను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వచ్చి నన్ను తీసుకెళ్లండి. మీకోసం నేను మిరాఫ్లోర్‌లోనే (వెనెజువెలా అధ్యక్ష భవనం) ఎదురు చూస్తున్నా. ఆలస్యం చేయొద్దు' అని ఉద్వేగ ప్రసంగంలో సవాల్‌ విసిరారు.

ఆపరేషన్‌ 'ఆబ్జల్యూట్‌ రిజాల్వ్‌' ఎలా చేశారో తెలుసా?
వెనెజువెలా అధ్యక్షుడు మదురో వ్యాఖ్యలతో పాటు అమెరికా ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను వైట్‌హౌస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఆయనకు ఆ అవకాశం వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రం విసిరింది. దేశీయ, విదేశ బెదిరింపుల నుంచి అమెరికా పౌరులను ట్రంప్‌ యంత్రాంగం ఎప్పుడూ రక్షిస్తుందని పేర్కొంది. అంతకుముందు కూడా ఇటువంటి వీడియోను ట్రంప్‌ కూడా తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు.

అంతకుముందు, వెనెజువెలా అధ్యక్షుడు మదురోను, అతని భార్యను అమెరికా బంధించడాన్ని క్యూబా, కొలంబియా, మెక్సికో తీవ్రంగా ఖండించాయి. వెనెజువెలాపై అమెరికా నిర్వహించిన దాడులు కచ్చితంగా దురాక్రమణ కిందకే వస్తాయన్నాయని పేర్కొన్నాయి. ట్రంప్ చర్యలతో తాము కూడా అప్రమత్తమయ్యామని, వెనెజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఇదివరకే పేర్కొన్నారు. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితి, ఓఏఎస్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌) వెంటనే సమావేశం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

టారిఫ్​ వార్​లో ట్రంప్​దే విక్టరీ!- వలసదారుల విమానాలకు కొలంబియా అనుమతి

'వెనెజువెలా అయిపోయింది- నెక్స్ట్ మీరే'- కొలంబియా అధ్యక్షుడికి ట్రంప్ వార్నింగ్​!