ETV Bharat / international

మళ్లీ 'తుస్సుమన్న' చైనా ఆయుధాలు- ఇరాన్​ను ముంచిన డ్రాగన్!

ఇరాన్​పై అమెరికా- ఇజ్రాయెల్ భీకర దాడులు- 700కు పైగా పౌరులు మృత్యువాత- పూర్తిగా ఫెయిలైన చైనా ఆయుధాలు!

Tehran, Iran
Tehran, Iran (Source : AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 9:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

China Made Weapons : చైనా ఇటీవల కాలంలో ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. అయితే చైనా తయారీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు మాత్రం అనేక యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. కానీ, ప్రతీ యుద్ధంలోనూ అవి తేలిపోతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడుల నుంచి పాక్‌ వాయు స్థావరాలను చైనా డిఫెన్స్‌ సిస్టమ్‌లు కాపాడలేకపోయాయి. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోనూ అమెరికా ఎత్తుకెళ్లిపోకుండా రక్షించలేకపోయాయి. తాజాగా ఇరాన్‌లో మరోసారి చైనా తయారీ హెచ్‌క్యూ- 9బీ (HQ-9B) వ్యవస్థలు విఫలమయ్యాయి. అవే గనక సరిగ్గా పనిచేసి ఉంటే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలతో ఉండేవారన్న విమర్శలు వ్యక్తవుతున్నాయి.

కంప్లీట్ ఫెయిల్
అమెరికా- ఇజ్రాయెల్‌ మూడు రోజుల క్రితం చేసిన దాడుల్లో ఇరాన్‌ మోహరించిన చైనా తయారీ హెచ్‌క్యూ- 9బీ గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ దుర్మరణం చెందారు. గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్‌- అమెరికా దాడులు చేసిన తర్వాత తమ గగనతల రక్షణను బలోపేతం చేసుకోవాలని ఇరాన్‌ నిర్ణయించుకుంది. చైనా నుంచి హెచ్‌క్యూ-9బీ వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. అందుకు బదులుగా చైనాకు భారీగా చమురును ముట్టజెప్పింది. జులైలో ఆ వ్యవస్థలను రాజధాని టెహ్రాన్‌తో పాటు నటంజ్‌, ఫొర్డో వంటి అణుమౌళిక సదుపాయాలకు ఇరాన్‌ సైన్యం తరలించింది.

యుద్ధంలో తేలిపోతున్న ఆయుధాలు!
తాము సొంతంగా తయారు చేసుకున్న బవార్‌-373, ఖొర్డాడ్‌-15, పంట్సర్‌-S1 గగనతల రక్షణ వ్యవస్థలతో కలిపి హెచ్‌క్యూ 9బీలను ఇరాన్‌ మోహరించింది. వాటన్నిటినీ యుద్ధం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే అమెరికా- ఇజ్రాయెల్‌లు ధ్వంసం చేశాయి. అవన్నీ అలా విఫలమవడం చైనా ఆయుధాలు వాస్తవ యుద్ధాలలో ఎలా పనిచేస్తాయో మరోసారి కళ్లకు కట్టింది. 31 ప్రావిన్సుల్లోని 20కి పైగా ప్రాంతాల్లో అనేక ఇరాన్‌ మౌళిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 700కు పైగా పౌరులు మృత్యువాతపడ్డారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది మేలో పాకిస్థాన్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించింది. అప్పుడు కూడా భారత వైమానిక దళం దాడుల నుంచి హెచ్‌క్యూ- 9బీ గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్థాన్‌ను రక్షించలేకపోయింది. డజన్‌ పాకిస్థాన్‌ వాయుసేన స్థావరాలతో పాటు, నిలిపి ఉంచిన యుద్ధ విమానాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలాలో అమెరికా ఆపరేషన్‌ చేపట్టింది. చమురు అమ్మకాలతో చైనా నుంచి భారీగా గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాలను వెనెజువెలా సేకరించి రాజధాని కరాకస్‌ సహా పలు ప్రాంతాల్లో మోహరించింది. అవన్నీ అమెరికా ఆపరేషన్‌లో విఫలమయ్యాయి. ఫలితంగా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా డెల్టా ఫోర్స్‌ సేనలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సునాయాసంగా తమ దేశానికి ఎత్తుకెళ్లిపోయాయి.

బయటపడ్డ డొల్లతనం
అమెరికా పేట్రియాట్‌, రష్యా S300లను స్ఫూర్తిగా తీసుకుని చైనా హెచ్‌క్యూ- 9బీ గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇది 260కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల ఫైటర్లు, డ్రోన్లను గుర్తించగలదు, 50 కిలోమీటర్ల ఎత్తులో వాటిని ధ్వంసం చేయగలదు. ఒకేసారి 100కుపైగా లక్ష్యాలను ట్రాక్‌ చేయడమే కాక ఎనిమిది పరికరాలను కూల్చేయగలదని చైనా తెలిపింది. కానీ అదంతా ఉత్తి డొల్లేనని తాజాగా మరోసారి రుజువైంది.

ఇరాన్​కు చైనా మద్ధతు!
కాగా, ఈ యుద్ధంలో ఇరాన్‌కు మద్దతిస్తామని చైనా చెబుతోంది. అయితే ఏ రూపంలో అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక సీఎమ్- 302 (CM-300) సూపర్‌సోనిక్‌ నౌకా విధ్వంసక క్షిపణులను ఇరాన్‌కు విక్రయించేందుకు చైనా అంగీకరించిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను బీజింగ్‌ ఖండించడం గమనార్హం. అలాంటి ఒప్పందం ఏదీ కుదరలేదని తెలిపింది. ఒకవేళ చైనా వాదన గనక అబద్ధమైతే వారిపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్న ఇరాన్‌ను నట్టేట ముంచినట్లే అవుతుంది.