ETV Bharat / international

నిజ్జర్ హత్య కేసులో కొత్త మలుపు- లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై అమెరికాలో కేసు- 50వేల అమెరికన్ డాలర్ల రివార్డు

నిజ్జర్ హత్యకు ఆదేశాలు ఇచ్చారంటూ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌బీఐ అభియోగాలు- 'ఆపరేషన్ హార్డ్‌బాల్'లో అమెరికా, కెనడా, ఐరోపాలో 24 మంది అనుమానితుల అరెస్టు

File photo of Lawrence Bishnoi
File photo of Lawrence Bishnoi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 8, 2026 at 9:35 AM IST

3 Min Read
Choose ETV Bharat

US Charges Lawrence Bishnoi : భారత్-కెనడా దౌత్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి అనుచరుడు గోల్డీ బ్రార్‌పై అమెరికాలో కేసు నమోదైంది. నిజ్జర్ హత్యకు వీరిద్దరూ ఆదేశాలు జారీ చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలు ఛార్జిషీట్‌లో పేర్కొన్నాయి.

ఎఫ్‌బీఐ 'ఆపరేషన్ హార్డ్‌బాల్'
ఈ కేసు దర్యాప్తులో భాగంగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్​బీఐ) 'ఆపరేషన్ హార్డ్‌బాల్' పేరుతో అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది అనుమానితులను అధికారులు అరెస్టు చేశారు. వారిలో 11 మంది కాలిఫోర్నియాకు చెందినవారు. ఇదే దర్యాప్తు ఆధారంగా లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు.

గోల్డీ బ్రార్‌కు 50 వేల డాలర్ల రివార్డు
లారెన్స్ బిష్ణోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్‌లో కీలక సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అరెస్టుకు దారితీసే సమాచారం అందించిన వారికి 50 వేల అమెరికన్ డాలర్ల వరకు రివార్డు ప్రకటిస్తున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ప్రకటన విడుదల చేసింది. దక్షిణ కాలిఫోర్నియాతో పాటు అమెరికా, కెనడా ప్రాంతాల్లో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో గోల్డీ బ్రార్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఎఫ్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం అతడు అమెరికాలోనే ఉంటున్నాడని, ఉత్తర అమెరికాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నాడని ఆరోపించింది.

Satinderjeet Singh
సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ (ANI)

ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ
రాకెటీరింగ్ కుట్ర, బెదిరింపుల ద్వారా వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నియంత్రిత పదార్థాల పంపిణీకి కుట్ర వంటి అభియోగాలపై కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ ఫెడరల్ కోర్టు జూలై 1న గోల్డీ బ్రార్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతనికి అమెరికాలోని శాక్రమెంటో, ఫ్రెస్నో నగరాలతో పాటు కెనడా, భారత్, మెక్సికో దేశాలతో సంబంధాలు ఉన్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.

నిజ్జర్ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్?
2023 జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం సర్రేలోని గురుద్వారా బయట హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఆదేశాలు ఇచ్చారని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ కేసులో జగ్గు భగవాన్‌పురియా, రవీందర్ సింగ్ ధండా తదితరుల పేర్లను కూడా అభియోగపత్రంలో చేర్చారు. ధండా అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడని, భగవాన్‌పురియా గ్యాంగ్ అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు విస్తరించిన నేర ముఠాగా పనిచేస్తోందని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఆపరేషన్‌లో ఆయుధాలు, కొకైన్ స్వాధీనం
'ఆపరేషన్ హార్డ్‌బాల్' సందర్భంగా పెద్ద ఎత్తున కొకైన్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 37 మందిపై మూడు ఫెడరల్ అభియోగపత్రాలు దాఖలు చేసినట్లు వెల్లడించారు. అయితే అభియోగాలు నమోదు కావడం మాత్రమే నేరం రుజువైనట్లు కాదని, కోర్టులో నేరం నిరూపితమయ్యే వరకు నిందితులందరూ నిర్దోషులేనని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది.

భారత్-కెనడా సంబంధాల్లో ఉద్రిక్తత
నిజ్జర్ హత్య అనంతరం అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండిస్తూ, వాటికి ఆధారాలు సమర్పించాలని పలుమార్లు డిమాండ్ చేసింది.

భారత్ ఖండన, దౌత్యవేత్తల ఉపసంహరణ
ట్రూడో ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది. ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని, ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అయినప్పటికీ కెనడా తన వైఖరిని మార్చలేదు. అంతేకాకుండా ఈ కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కూడా చేర్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అనంతరం భారత్, కెనడా పరస్పరం తమ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించుకున్నాయి.

భారత్​కు లారెన్స్‌ బిష్ణోయ్‌ తమ్ముడు అన్మోల్‌- అప్పగించనున్న అమెరికా సర్కార్​

లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన కెనడా