డబ్బును తీసుకెళ్తుండగా హైవేపై కూలిన విమానం- 15 మంది మృతి
బొలీవియా రాజధాని సమీపంలో విమాన ప్రమాదం- 15 మంది మృతి- కార్లు ధ్వంసం

Published : February 28, 2026 at 7:25 AM IST
Cargo Plane Crash : బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. డబ్బును తీసుకెళ్తున్న వైమానిక దళానికి కార్గో విమానం కూలి సుమారు 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో ఈ ప్రమాదం జరిగింది.
సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బొలీవిమా ఎయిర్ఫోన్స్కు చెందిన సీ-130 హెర్క్యలస్ ట్రాన్స్‌ఫోర్ట్ విమానం శాంటాక్రూట్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరింది. ప్రతికూల వాతావరణ కారణంగా ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. విమానం రెక్కలు విరిగిపోయాయి. విమానంలో మంటలు కూడా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల్లో విమాన సిబ్బందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిన సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
రోడ్లుపై కరెన్సీ నోట్లు- ఎగబడ్డ ప్రజలు
అయితే విమానం రెక్కలు విరిగిపోవడంతో అందులోని కొత్త కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లాచెదురగా పడిపోయాయి. అక్కడి ప్రజలు వాటిని తీసుకునేందుకు పోటీపడుతుండగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలు అవుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు బొలీవియా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
కొలంబియా విమాన ప్రమాదంలో 15 మంది మృతి
ఇటీవల కొలంబియాలో విమానం ప్రమాదం జరిగింది. జనవరి 29న విమానం కుప్పకూలి పైలట్ సహా 15 మంది మృతి చెందారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు, ఇద్దు సిబ్బంది ఉన్నారు. కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న విమానం ఈశాన్య కొలంబియాలోని నోర్టే డి శాంటాండర్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పార్లమెంట్ సభ్యుడు ఒకరు ఉన్నారు.
ప్రమాదానికి గురైన విమానం ప్రభుత్వ విమానయాన సంస్థ సటెనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ 1900D చెందినది. HK4709 నెంబర్‌గల ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం జనవరి 29 ఉదయం 11:42 గంటలకు రాజధాని కుకుటాలోని విమానాశ్రయం నుంచి 13 మంది ప్రయాణికులు ఇద్దరు సిబ్బందితో ఒకానాకు బయలుదేరింది. దాదాపు 20- 25 నిమిషాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో కమ్యూనికేషన్ కొనసాగింది. అయితే విమానం కొద్ది నిమిషాల్లో ల్యాడింగ్ అవుతుందనగానే రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన రెస్య్కూ టీమ్, అదృశ్యమైన విమానం కోసం వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా కొలంబియా - వెనిజులా సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 15 మంది కూడా మృతి చెందినట్లు అధికారులు నిర్ధరించారు. ఇందులో పార్లమెంట్ మెంబర్ 36ఏళ్ల డయోజెనెస్ క్వింటెరో ఉన్నారు. ఘటనాస్థలిలో విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కొలంబియా ఏరోస్పేస్ ఫోర్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ఫ్లైట్ డేటా, పర్యావరణ పరిస్థితులను పరిశీలించారు.

