ETV Bharat / international

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు- 82 మంది మృతి

ఉత్తర చైనాలోని ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు- ప్రమాద సమయంలో గని లోపల మొత్తం 247 మంది కార్మికులు

Accident In China Coal Mine
Accident In China Coal Mine (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2026 at 11:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

Accident In China Coal Mine : చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో సుమారు 82 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. పలువురు ఇంకా భూగర్భంలో చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల కాలంలో చైనాలో జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదొకటిగా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

షాన్సీ ప్రావిన్స్‌లోని టోంగౌజ్ గ్రూప్‌కు చెందిన లియుషెన్యు బొగ్గు గనిలో శుక్రవారం(మే 22వ తేదీ) రాత్రి 7:29 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నట్లు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు, అక్కడ చిక్కుకున్న చాలా మందిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ 82 మంది మృతిచెందినట్లు అధికారులు ధృవీకరించారు.

గల్లంతైన వారి కోసం గాలింపు
ఇదిలా ఉండగా మరో తొమ్మిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని అన్నారు. సంఘటనా స్థలంలో భారీ సంఖ్యలో అంబులెన్స్‌లు, రెస్క్యూ సిబ్బంది మోహరించాయి. ప్రభుత్వ ప్రసార సంస్థ, సీసీటీవీ విడుదల చేసిన వీడియోల్లో హెల్మెట్లు ధరించిన సహాయక సిబ్బంది స్ట్రెచర్‌లపై గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. గాయపడిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశాలు
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పంధించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. "అన్ని ప్రాంతాలు, విభాగాలు ఈ ప్రమాదం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పని ప్రదేశ భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి భారీ ప్రమాదాలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి" అని పేర్కొన్నారు.

కార్బన్ మోనాక్సైడ్ లీక్
ప్రాథమిక దర్యాప్తులో గనిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు స్థాయులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ వాయువు అత్యంత విషపూరితమైనది అలాగే ఎటువంటి వాసన లేనిదిగా పరిగణిస్తారు. పేలుడుకు కారణమైన కంపెనీకి బాధ్యత వహిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

ప్రమాద ఘటనపై స్పందించిన భారత ప్రధాని
మరోవైపు, ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. "చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన గనుల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత ప్రజల తరపున, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు, చైనా ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గల్లంతైన మిగిలిన వారందరూ త్వరగా, సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ ఎక్స్​ పోస్టులో పేర్కొన్నారు.

గతంలోనూ గని ప్రమాదాలు
చైనాలోని పేద ప్రావిన్సుల్లో ఒకటైన షాన్సీ దేశ బొగ్గు గనుల కేంద్రంగా పరిగణిస్తారు. ఇటీవలి కాలంలో భద్రతా ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ, గనుల రంగంలో ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 2023లో అంతర్గత మంగోలియాలో జరిగిన గని ప్రమాదంలో 53 మంది మృతిచెందగా, 2009లో హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన పేలుడులో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, చైనా ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును వినియోగించే దేశంగా కొనసాగుతోంది. అదే సమయంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే దేశంగా కూడా చైనా నిలుస్తోంది.

షాన్సీ ప్రావిన్స్​లో గతంలోనూ ప్రమాదం
గతంలోనూ ఉత్తర చైనా షాన్సీ ప్రావిన్స్​లోని బొగ్గు గనుల కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంభవించింది. అందులో 26 మంది మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఆ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. లియులియాంగ్​ నగరంలో ఉన్న ప్రైవేట్ యోంగ్జు బొగ్గు గని కంపెనీకి చెందిన భవనంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భవనంలోని రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిపారు.

బొగ్గు గని కంపెనీ ఆఫీస్​లో భారీ అగ్నిప్రమాదం- 26మంది మృతి

మేఘాలయ బొగ్గు గనిలో పేలుడు- 18 మంది మృతి