షేక్ హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ ఆగ్రహం- షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
షేక్ హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం- మీడియా సమావేశంలో పాల్గొన్న షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

Published : August 6, 2026 at 8:41 AM IST
Bangladesh On Hasina Press Conference : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం రెండు దేశాల మధ్య మరోసారి దౌత్యపరమైన చర్చకు దారితీసింది. భారత్‌లో ఉండి హసీనా ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడేందుకు అవకాశం కల్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఆ మీడియా సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఎంపీ షకీబ్ అల్ హసన్ స్వగ్రామంలోని ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది.
హసీనా వ్యాఖ్యలపై ఢాకా అభ్యంతరం
దేశం నుంచి పారిపోయిన, న్యాయస్థానం దోషిగా తేల్చిన షేక్ హసీనాకు దిల్లీలో మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. హసీనా, ఆమె అనుచరులు బంగ్లాదేశ్ ప్రభుత్వం, ప్రజలపై విషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఈ కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ముందుగానే భారత్‌కు తెలియజేసినట్లు తెలిపింది. అయినా సమావేశాన్ని నిర్వహించేందుకు అనుమతించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. జులై విప్లవం రెండో వార్షికోత్సవాన్ని బంగ్లాదేశ్ ప్రజలు నిర్వహిస్తున్న రోజునే ఈ కార్యక్రమం జరగడం తమ దేశ సార్వభౌమత్వానికి అవమానమని పేర్కొంది. 2024 జులై-ఆగస్టు ఆందోళనల సమయంలో అమాయక పౌరులు, చిన్నారుల మరణాలపై ఐక్యరాజ్యసమితి పేర్కొన్న అంశాలను హసీనా తిరస్కరించడం చరిత్రను మార్చే విఫలయత్నమని వ్యాఖ్యానించింది.
Bangladesh Foreign Affairs Ministry expresses outrage over the virtual interaction of former Bangladesh PM Sheikh Hasina with the media in Delhi
— ANI (@ANI) August 5, 2026
The Ministry tweets, "Bangladesh is outraged that the absconding convicted genocider Sheikh Hasina was allowed this evening to engage… pic.twitter.com/gWsXn1ULiT
భారత్‌కు అప్పగించాలని మరోసారి విజ్ఞప్తి
2013లో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన అప్పగింత (ఎక్స్‌ట్రడిషన్) ఒప్పందం ప్రకారం హసీనాను తమకు అప్పగించాలని పలుమార్లు కోరినా ఇప్పటివరకు స్పందన రాలేదని ఢాకా తెలిపింది. అయితే భారత్‌తో పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగే సత్సంబంధాలను కొనసాగించాలనే అభిలాష తమకు ఉందని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
షకీబ్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
ఇదిలా ఉండగా షేక్ హసీనా మీడియా సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న కొద్ది గంటల్లోనే బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ అవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ స్వగ్రామమైన మగురా పట్టణంలోని పూర్వీకుల ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. బుధవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం సుమారు 8.45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఇంటి దక్షిణ భాగంలోని ఇనుప గేటుపై పెట్రోల్ బాంబు విసిరినట్లు పోలీసులు తెలిపారు. కొందరు దుండగులు ఇంటిని ధ్వంసం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే ఇది నిజంగా పెట్రోల్ బాంబు దాడేనా? దాడికి పాల్పడింది ఎవరు? అనే విషయాలు దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టమవుతాయని మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
అవామీ లీగ్ ఆరోపణలు
ఈ దాడిపై అవామీ లీగ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించింది. పార్టీ మీడియా సమావేశంలో పాల్గొన్నందుకే షకీబ్ నివాసంపై దాడి జరిగిందని ఆరోపించింది. దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో తమ పార్టీ కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయని, ఈ దాడి కూడా అదే క్రమంలో జరిగిందని పేర్కొంది.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో షేక్ హసీనా మాట్లాడుతూ, తాను ఈ ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. అధికారాల కోసం కాదని దేశంలో అభివృద్ధి, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే తిరిగి వస్తున్నానని చెప్పారు. తనను అరెస్ట్ చేయవచ్చని, హత్య చేసే ప్రమాదం కూడా ఉందని తెలిసినా, ప్రజల మధ్యకే వెళ్తానని స్పష్టం చేశారు. 2024 ఆగస్టు 5న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో హసీనా ఢాకా విడిచి భారత్‌కు వచ్చారు. అనంతరం 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఆమెకు మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమెను భారత్ నుంచి అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదేపదే కోరుతోంది.
అది విద్యార్థుల శాంతియుత ఉద్యమం కాదు- ఏదేమైనా డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా
హర్ముజ్ తెరుచుకునే దిశగా కీలక అడుగు- తుది దశలో 'ఇరాన్-ఒమన్' ఒప్పందం

