ETV Bharat / international

పాక్ కోస్ట్ గార్డ్స్ క్యాంపుపై భారీ దాడి- 30 మందికిపైగా మృతి చెందినట్లు బలూచిస్థాన్ ప్రకటన

గ్వాదర్ జిల్లాలోని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ క్యాంపుపై దాడి- పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దాడి చేసినట్లు బీఎల్ఏ ప్రకటన- 30 మందికిపైగా భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు రెబల్ గ్రూప్ వెల్లడి

Baloch Rebels Pakistan
Baloch Rebels Pakistan (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : July 4, 2026 at 1:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Baloch Rebels Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మరో భారీ దాడి జరిగినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. గ్వాదర్ జిల్లాలోని జీవానీ పరిధిలో ఉన్న పన్వాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలో 30 మందికిపైగా భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరికొందరు గాయపడ్డారని పేర్కొంది. అయితే బీఎల్ఏ చేసిన ఈ ప్రకటనపై పాకిస్థాన్ సైన్యం లేదా కోస్ట్ గార్డ్స్ నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదు.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జులై 3న సాయంత్రం 6.32 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. తమ మజీద్ బ్రిగేడ్‌కు చెందిన సభ్యుడు పేలుడు పదార్థాలతో నింపిన మాజ్డా వాహనాన్ని కోస్ట్ గార్డ్స్ క్యాంపులోకి తీసుకెళ్లి పేల్చినట్లు బీఎల్ఏ పేర్కొంది. ఈ భారీ పేలుడు కారణంగా కోస్ట్ గార్డ్స్ క్యాంపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. పేలుడు అనంతరం తమ ఫతేహ్ స్క్వాడ్‌కు చెందిన సభ్యులు క్యాంపుపై దాడి చేసినట్లు వెల్లడించింది. పేలుడు నుంచి బయటపడిన భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించినట్లు పేర్కొంది.

ఈ ఘటనలో 30 మందికిపైగా పాకిస్థాన్ భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు బీఎల్ఏ ప్రకటించింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే పాకిస్థాన్ సైన్యం లేదా కోస్ట్ గార్డ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాడిలో ఎంత మంది మరణించారు? ఎంత మంది గాయపడ్డారు? క్యాంపునకు ఎంత మేర నష్టం జరిగింది? అనే వివరాలపై స్పష్టత రాలేదు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలను కూడా బీఎల్ఏ తన ప్రకటనలో వెల్లడించింది. అతడిని అత్తావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్‌గా పేర్కొంది. తమ మజీద్ బ్రిగేడ్‌లో అతడు సభ్యుడని తెలిపింది. ఈ విభాగం గతంలోనూ పలు దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు వీడియోను విడుదల చేస్తామని బీఎల్ఏ పేర్కొంది.

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న వేర్పాటువాద గ్రూపుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటి. భద్రతా బలగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన పలు దాడులకు ఈ సంస్థ బాధ్యత ప్రకటించింది. ముఖ్యంగా బలూచిస్థాన్‌లోని తీర ప్రాంతాలు, సహజ వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీఎల్ఏ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్వాదర్ ప్రాంతంలోనూ గత కొన్నేళ్లుగా భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి.

పాకిస్థాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్టు ఈ జిల్లాలోనే ఉంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌లో గ్వాదర్ కీలక ప్రాంతంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని వేర్పాటువాద గ్రూపులు గతంలోనూ పలు దాడులకు పాల్పడ్డాయి. బలూచిస్థాన్‌కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చే వరకు తమ కార్యకలాపాలు కొనసాగుతాయని బీఎల్ఏ తన తాజా ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ భద్రతా బలగాలపై తమ దాడులు కొనసాగుతాయని తెలిపింది.

అయితే ఇలాంటి దాడులు జరిగిన వెంటనే రెబల్ గ్రూపులు ప్రకటించే మృతుల సంఖ్యకు, ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు వెల్లడించే వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండే సందర్భాలు ఉన్నాయి. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లోకి స్వతంత్ర మీడియాకు పరిమితమైన అవకాశం ఉండటం వల్ల దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను ధ్రువీకరించడం కష్టంగా మారుతోంది. తాజా ఘటనపై పాకిస్థాన్ అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. బీఎల్ఏ చేసిన ప్రకటనలోని వివరాలు ధ్రువీకరణ అయితే ఇటీవలి కాలంలో గ్వాదర్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా బలగాలపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

'ఇరాన్ ప్రతినిధుల హత్యకు కుట్ర'- ఆ కథనాన్ని ఖండించిన ఇజ్రాయెల్ ​

ఖమేనీ అంత్యక్రియలు : ఇరాన్ స్పీకర్, విదేశాంగ మంత్రి కన్నీటిపర్యంతం- హాజరైన భారత బృందం