ETV Bharat / international

బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి- ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని నిప్పంటించిన నిందితులు

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల వేళ - మరో హిందువుపై దాడి

Hindu Attacked in Bangladesh
Hindu Attacked in Bangladesh (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : January 1, 2026 at 8:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hindu Attacked in Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. షరియత్‌పుర్ జిల్లాలో 50 ఏళ్ల ఖోకోన్ దాస్ అనే వ్యక్తిపై ఆందోళనకారులు దాడి చేశారు. పదునైన ఆయుధంతో గాయపరిచి నిప్పంటించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇంటికి వెళ్తుండగా నిందితులు అడ్డుకుని దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల దీపూ చంద్ర దాస్‌, అమృత్‌ మండల్‌, బజేంద్ర బిశ్వాస్ అనే హిందువులు హత్యకు గురయ్యారు.

స్థానిక మీడియా 'ప్రోథమ్ అలో' కథనం ప్రకారం
ఖోకన్ చంద్ర దాస్ (50) షరియత్‌పుర్ జిల్లా, దాముద్యా ప్రాంతంలోని కోనేశ్వర్ యూనియన్, తిలోయ్ గ్రామానికి చెందినవాడు. ఖోకన్ దాస్ క్యూర్ బంగా బజార్‌లో ఒక ఫార్మసీని, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే పని ముగించుకుని, రోజువారీ కలెక్షన్ డబ్బులతో అతడు ఆటో రిక్షాలో ఇంటికి బయలుదేరాడు. దాముద్యా-షరియత్‌పుర్ రోడ్డులోని క్యూర్ భంగా బజార్ సమీపంలోకి రాగానే కొందరు దుండగులు ఆటోను అడ్డగించారు.

పెట్రోల్ పోసి, నిప్పు పెట్టి
దుండగులు ఒక్కసారిగా ఖోకన్ దాస్‌పై విరుచుకుపడ్డారు. పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. కత్తులతో నరికారు. తీవ్రంగా గాయపడిన ఖోకన్‌పై వెంటనే పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మంటలు చెలరేగడంతో ఖోకన్ గట్టిగా ఆర్తనాదాలు చేశాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటనే పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు. అతని కేకలు విని స్థానికులు అక్కడకు పరిగెత్తుకు వచ్చారు. జనం రావడాన్ని గమనించిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు.

పరిస్థితి విషమం
స్థానికులు వెంటనే స్పందించి ఖోకన్‌ను కాపాడారు. హుటాహుటిన అతన్ని షరియత్‌పుర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ప్రాథమిక చికిత్స అందించారు. డాక్టర్ నజ్రుల్ ఇస్లాం వైద్య పరీక్షలు చేశారు. ఖోకన్ కడుపు భాగంలో తీవ్రమైన గాయం అయినట్లు గుర్తించారు. అలాగే తల వెనుక భాగం, ముఖం, చేతులపై తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజధాని ఢాకాకు తరలించారు.

బాధితుడి భార్య సీమా దాస్ మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. "నా భర్త ప్రతి రోజూ షాపులో వచ్చిన డబ్బుతో రాత్రి ఇంటికి వస్తారు. బుధవారం రాత్రి కొందరు ఆయనను అడ్డగించారు. ఆయనపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. మాకు ఈ ప్రాంతంలో శత్రువులు ఎవరూ లేరు. ఎవరితోనూ గొడవలు లేవు. అయినా నా భర్తను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు నిందితుల గుర్తింపు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాముద్యా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ మహమ్మద్ రబియుల్ హక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారు స్థానికంగా ఉండే రబ్బీ, సోహాగ్ అని తేలింది. వారిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడిలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

వరుస హత్యలతో వణుకుతున్న మైనారిటీలు
బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. డిసెంబర్ 18న మైమెన్‌సింగ్ జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే యువకుడిని ఒక మూక కొట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని వేలాడదీసి నిప్పు పెట్టింది. రాజ్‌బారి ప్రాంతంలో అమృత్ మండల్ అనే మరో యువకుడిని దోపిడీ దొంగ అనే అనుమానంతో కొట్టి చంపారు. బజేంద్ర బిశ్వాస్ అనే వ్యక్తి తన సహోద్యోగి తుపాకీ పేలడంతో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య తర్వాత జరిగిన ఘర్షణల్లోనూ హిందువులు బలయ్యారు.