పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం- ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్
అవసరమైతే భూతల పోరాటానికి దిగుతామని ట్రంప్ స్పష్టీకరణ- ఇరాన్‌పై దాడుల్లో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయన్న ట్రంప్

Published : March 3, 2026 at 6:56 AM IST
Iran US War Current Situation : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు సోమవారం మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉద్ధృతంగా సాగుతోంది. లెబనాన్ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బొల్లాపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇరాన్, దాని మిత్రదేశాలు, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్ధం నుంచి బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ సోమవారం 250కిపైగా బాంబులను ప్రయోగించి, అక్కడి భద్రతా వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్‌కు మద్దతుగా దాడులకు దిగిన హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్‌తో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 52కు చేరింది. మరో 154 మంది గాయపడ్డారు.హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి హుస్సేన్ మొకలెద్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 70కి పైగా ఆయుధ గిడ్డంగులు, క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. లెబనాన్‌లో భూతల దాడులూ చేపట్టే అవకాశం ఉందనే సంకేతాలిచ్చింది. దాడుల భయంతో వేలాది మంది ప్రజలు దక్షిణ లెబనాన్ నుంచి రాజధాని బీరూట్‌కు తరలివెళ్లారు. మరోవైపు హెజ్బొల్లా గ్రూపు తమతో సంప్రదించకుండా ఇజ్రాయెల్‌పై దాడులు చేయడాన్ని లెబనాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హెజ్బొల్లా సైనిక కార్యకలాపాలను లెబనాన్ ప్రభుత్వం నిషేధించింది.
ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్
ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేయకుండా అడ్డుకొని తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్న ఆయన, అవసరమైతే భూతల దాడులూ చేస్తామని తెలిపారు. ఇరాన్‌పై దాడుల విషయంలో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయని పేర్కొన్నారు.
"అమెరికాకు పొంచి ఉన్న తీవ్రమైన ముప్పులను తొలగించేందుకు, ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం ఇరాన్‌లో భారీ ఎత్తున పోరాటాలను కొనసాగిస్తోంది. ఈ భయంకరమైన, దుర్మార్గపు పాలన నుంచి పొంచి ఉన్న భరించలేని ముప్పులను తొలగించడానికి మాకు దొరికిన చివరి, ఉత్తమ అవకాశం ఇదే, ఇప్పుడు మేం చేస్తున్నది అదే. మా లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, కొత్త క్షిపణులను తయారు చేసే వారి శక్తిని మేం నాశనం చేస్తున్నాము, ఇది ప్రతి గంటకు జరుగుతుండటాన్ని మీరు చూడవచ్చు. రెండోది వారి నౌకాదళాన్ని మేము సమూలంగా తుడిచిపెడుతున్నాం. ఇప్పటికే 10 నౌకలను సముద్ర గర్భంలో కలిపేశాం. మూడోది, ప్రపంచంలోనే ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్ అయిన ఈ దేశం ఎన్నటికీ అణు ఆయుధాన్ని పొందకుండా నిర్ధారిస్తున్నాం. చివరగా ఇరాన్ పాలన తన సరిహద్దుల బయట ఉన్న ఉగ్రవాద సైన్యాలకు ఆయుధాలు అందించడం, నిధులు సమకూర్చడం, వారిని నడిపించడం వంటి పనులను ఇకపై కొనసాగించకుండా మేం నిర్ధారిస్తున్నాం. అమెరికా ప్రజలకు ఈ ఉగ్రవాద పాలన వల్ల పొంచి ఉన్న ముప్పును అణిచివేసేందుకు మేం అత్యంత ఉద్ధృతమైన, అచంచలమైన సంకల్పంతో ఈ మిషన్ కొనసాగిస్తున్నాం. ఏది ఏమైనా మేము దీనికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుందని అంచనా వేశాం. కానీ, అంతకంటే చాలా ఎక్కువ కాలం కొనసాగించే సామర్థ్యం మాకు ఉంది. మేము దానిని చేసి తీరుతాం."
--డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ప్రతీకార దాడులను తీవ్రతరం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. గల్ఫ్‌లోని చమురుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను సంధించింది. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ఆరామ్‌కోపై దాడి జరగ్గా తాత్కాలికంగా మూసివేశారు. ఖతార్‌లోని చమురుశుద్ధి కేంద్రాలపైనా ఇరాన్ దాడులకు యత్నించగా ఖతార్ ఎనర్జీ తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన రెండు విమానాలు, ఏడు క్షిపణులు, ఐదు డ్రోన్లను కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇల్లు, కార్యాలయంపైనా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆయన ఎలా ఉన్నారో తెలియదంటూ ప్రచారం చేసింది.
అనంతరం బయటకొచ్చిన నెతన్యాహూ ఆదివారం ఇరాన్ క్షిపణి దాడిలో తొమ్మిది మంది ఇజ్రాయెలీలు మరణించిన ప్రాంతాన్ని సందర్శించారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధిస్తే అది మానవాళికే ముప్పు అని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య ద్వారా తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచ భద్రతను కాపాడడమే లక్ష్యమని పేర్కొన్నారు.

