డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా- అమెరికాలో 'నో కింగ్స్' నిరసనలు
ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు- దేశవ్యాప్తంగా ఆందోళనలు- 50 రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు!

Published : October 18, 2025 at 10:12 PM IST
US Protests Against Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ, వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. దీనితో ఆయన పాలనాతీరుపై ప్రపంచ దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో 'నో కింగ్స్' నిరసనలు చేపట్టిన అమెరికన్లు, ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. 50 రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలకు చేపట్టనుండగా, పలు ఐరోపా దేశాల్లో వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
'నో కింగ్స్' పేరుతో ఆందోళనలు!
పాలనా సంస్కరణల ఉద్దేశంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్‌ను ఏర్పాటు చేశారు ట్రంప్. దీని ద్వారా వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. జన్మతః పౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కీలక మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో వలసదారులపై అధికారుల సోదాలు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై స్థానికంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాలను మోహరించింది ట్రంప్ యంత్రాంగం. ఈ పరిణామం ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. మొత్తంగా ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపిస్తున్న అమెరికన్లు, అధ్యక్షుడికి వ్యతిరేకంగా 'నో కింగ్స్' పేరుతో నిరసనలు ప్రారంభించారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ ప్రత్యేక వెబ్‌సైట్‌లో నిరసనల నిర్వాహకులు పేర్కొన్నారు.
వీధుల్లో చేరి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జూన్‌లో మిలిటరీ పరేడ్‌కు హాజరైన వేళ దేశవ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ అజెండాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సెనెట్ నేత చక్ షుమెర్, మరో చట్టసభ సభ్యుడు బెర్నీ సాండెర్న్స్ కూడా ఆ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇటీవల అమెరికా షట్‌డౌన్ అయ్యింది. దీనితో మూడు వారాలుగా అనేక సేవలు నిలిచిపోయాయి. ఇది లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులన్నీ అమెరికన్లలో మరింత ఆగ్రహానికి రేకెత్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్తంగా 'నో కింగ్స్' ఆందోళనలకు సిద్ధమయ్యారు.
రంగంలోకి దిగిన జాతీయ బలగాలు!
ఈ నిరసనలను శ్వేతసౌధంతో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీల్లో పాల్గొనేవారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని, ఇవి 'హేట్ అమెరికా' నిరసనలని పేర్కొన్నారు. అయితే తాజాగా జరుగుతున్న ఆందోళనలపై ఇటీవల ట్రంప్ ఓ కార్యక్రమంలో స్పందించారు. వాళ్లు చెబుతున్నట్లుగా తాను రాజును కాదన్నారు. మరోవైపు తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు.
కిమ్‌లో ట్రంప్ భేటీ!
మరోవైపు, ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఏపీఈసీ సదస్సులో పాల్గొననున్న ఆయన, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని సమచాారం. దీనిపై ట్రంప్ యంత్రాంగం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ పూర్తి ప్రణాళిక ప్రస్తుతానికి సిద్ధం కాలేదని తెలుస్తోంది.
'ఇక రక్తపాతం ఆగాల్సిందే'- రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది- తక్కువే కొంటోంది: ట్రంప్

