అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే ఇబ్బందులేనా? పెంటగాన్ నివేదిక వైరల్
అధిక ధర, తగ్గుతున్న ఆయుధాలు - ఇరాన్‌తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం - హెచ్చరించిన పెంటగాన్

Published : March 4, 2026 at 12:27 PM IST
Pentagon Report On US Missile Stockpiles : ఇరాన్‌తో సైనిక ఘర్షణ వేళ అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు కీలక హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొంది.

రాబోయే 24 గంటల్లో ఇరాన్‌పై దాడులకు అమెరికా పెద్ద సంఖ్యలో మిస్సైళ్లు, ఇంటర్‌సెప్టర్లను వినియోగించే అవకాశం ఉందని ఆ పెంటగాన్ అధికారి తెలిపారు. దీంతో అమెరికా సైన్యం వద్దనున్న ఆయుధ నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోతాయన్నారు. మరో నాలుగైదు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగొచ్చనే సంకేతాలు ఇచ్చేలా ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అమెరికా పెంటగాన్ అధికార వర్గాల నుంచి ఆయుధాల కొరతతో ముడిపడిన వార్త బయటకి రావడం గమనార్హం.
ఏ ఆయుధ నిల్వలు తగ్గిపోతాయి ?
సీఎన్ఎస్, ఖతర్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీరా, అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి. దీర్ఘకాలం పాటు ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా కీలక ఆయుధ నిల్వలన్నీ తగ్గిపోయే ముప్పు ఉంటుందని దేశాధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించామని పెంటగాన్ అధికార వర్గాలు, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డ్యాన్ కైనీ చెప్పారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లకు ఎడతెరిపి లేకుండా సైనిక సాయం చేస్తున్నందున అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయాయని తెలిపాయి. 2025 జూన్‌లో ఇరాన్ - ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ అమెరికా తన దగ్గరున్న థాడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని వాడేసిందని పేర్కొన్నాయి. ఆ టైంలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ సంధించిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని నిర్వీర్యం చేయడానికి దాదాపు 150 థాడ్ ఇంటర్‌సెప్టర్లను అమెరికా వినియోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
అవి స్వల్పకాలిక యుద్ధ అవసరాల కోసమే
గతేడాది యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన డ్రోన్, మిస్సైల్ దాడులను అడ్డుకోవడానికీ ఎస్‌ఎం- 3 ఇంటర్‌సెప్టర్లను పెద్దసంఖ్యలో అమెరికా వినియోగించిందని గుర్తుచేసింది. యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల కొరతను కూడా అమెరికా ఎదుర్కొంటోందని పేర్కొంది. అత్యంత కచ్చితత్వంతో భూతల లక్ష్యాలపై దాడులు చేసేందుకు వినియోగించే జాయింట్ డైరెక్ట్ ఎటాక్ మ్యూనిషన్స్ (జేడీఏఎం) వంటి ఆయుధాల కొరతను కూడా అమెరికా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది. వాస్తవానికి ఈ ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలను స్వల్పకాలిక యుద్ధ అవసరాల కోసమే డిజైన్ చేశారని, దీర్ఘకాలిక యుద్ధాలకు ఇవి ప్రభావవంతంగా ఉపయోగపడవని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా ఇంటర్ సెప్టర్ల కంటే ఇరాన్ మిస్సైళ్ల సంఖ్యే ఎక్కువ : రూబియో
‘‘అమెరికా తయారు చేస్తున్న ఇంటర్‌సెప్టర్ల సంఖ్య కంటే, ఇరాన్ తయారుచేస్తున్న మిస్సైళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇరాన్ ప్రతినెలా 100కుపైగా మిస్సైళ్లను తయారు చేస్తోంది. కానీ ప్రతినెలా కేవలం ఆరు నుంచి ఏడు ఇంటర్ సెప్టర్లు మాత్రమే తయారవుతాయి’’ అని ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
ఇరాన్‌తో అమెరికా యుద్ధం ఖరీదు
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం ఖర్చు భారీగా ఉంటుందంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఉదయం ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి తొలి 24 గంటల్లోగా అమెరికాకు దాదాపు రూ.7186 కోట్ల ఖర్చు వచ్చిందని పేర్కొన్నాయి. గల్ఫ్ సముద్ర జలాల్లో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఒక విమాన వాహక యుద్ధ నౌకను, అందులోని సైనికులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఒకరోజుకు రూ.59 కోట్ల దాకా ఖర్చు వస్తుందని అంచనా వేశారు. వాస్తవానికి ఇరాన్‌పై దాడులు చేయడానికి, దాదాపు నెల రోజుల ముందు నుంచే గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల మోహరింపును అమెరికా మొదలుపెట్టింది. ఆ ఖర్చు దాదాపు రూ.5,800 కోట్లు ఉంటుందని అమెరికా మీడియా అంచనా వేసింది.
ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే, అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అమెరికా రక్షణ రంగ అధ్యయన సంస్థ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌కు చెందిన నిపుణుడు కెంట్ స్మెట్టర్స్ తెలిపారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రూ.2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. ఈ వ్యవధిలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి అమెరికా సొంతంగా దాదాపు రూ.1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టింది.
ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు : ట్రంప్
‘‘అమెరికా ఆయుధ సప్లైలు బలమైన స్థితిలో ఉన్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు అమెరికా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయి. అన్ లిమిటెడ్‌గా ఆయుధాలను సప్లై చేసే సత్తా అమెరికాకు ఉంది. ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు’’ అని పేర్కొంటూ ఇటీవలే ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టడం గమనార్హం.

