ETV Bharat / international

'ప్రమాదకర స్థాయిలో ఉద్రిక్తతలను పెంచుతోంది'- ఇరాన్‌ దాడులను ఖండించిన గల్ఫ్‌ దేశాలు, అమెరికా

ఇరాన్​ దాడులపై స్పందించిన అమెరికా, గల్ఫ్​ దేశాలు- పౌరుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టాయని వెల్లడి- సంయుక్త ప్రకటనను విడుదల చేసిన ఏడు దేశాలు

Joint Statement On Iran Attack
Joint Statement On Iran Attack (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 9:26 AM IST

3 Min Read
Choose ETV Bharat

Joint Statement On Iran Attack : పశ్చిమాసియాలో ఇరాన్ చేస్తున్న దాడులను అమెరికా, గల్ఫ్​ దేశాలు ఖండించాయి. ప్రమాదకర స్థాయిలో ఉద్రిక్తతలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు అమెరికా, బహ్రెయిన్‌, జోర్డాన్‌, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ చాలా దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించాయి.

'సార్వభౌమ దేశాల భూభాగాలపై ఇరాన్ చేసిన దాడులు విచక్షణారహిత, నిర్లక్ష్యమైనవి. ఈ క్షిపణి, డ్రోన్ దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. బహ్రెయిన్, ఇరాక్ (ఇరాకీ కుర్దిస్తాన్ ప్రాంతం సహా), జోర్డాన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపై జరిగిన ఈ దాడులు సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయి. పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయి. పౌర మౌలిక వసతులను ధ్వంసం చేశాయి. ఈ చర్యలు ప్రాంతీయ శాంతి, భద్రతలకు ప్రమాదకరంగా మారాయి. యుద్ధంలో నేరుగా పాల్గొనని దేశాలు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమకు ఉన్న స్వీయరక్షణ హక్కును ఈ ఏడు దేశాలు పునరుద్ఘాటించాయి. 'మా పౌరులు, సార్వభౌమాధికారాన్ని, భూభాగాన్ని రక్షించడంలో మేమంతా ఐక్యంగా నిలుస్తాం. అదేవిధంగా గగనతల, క్షిపణి రక్షణ వ్యవస్థల సమన్వయం వల్ల మరింత ప్రాణనష్టం, విధ్వంసం నిరోధించింది' అని తెలిపాయి.

బహ్రెయిన్, ఇజ్రాయెల్, యూఏఈ నాయకులతో మాట్లాడిన ట్రంప్
ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా బహ్రెయిన్, యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ఇజ్రాయెల్, బహ్రెయిన్ యూఏఈ నాయకులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లు వైట్​ హౌస్ వెల్లడించింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడుల సమయంలో ఈ చర్చలు జరిగినట్లు వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలివ్ లీవిట్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ నాయకులతో ఫోన్​లో మాట్లాడారని చెప్పారు. అలాగే ఆస్టిన్, టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై వివరాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు.

ఐఆర్​జీసీ ప్రధాన కార్యాలయం ధ్వంసం
ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (ఐఆర్​జీసీ)కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో ఐర్​జీసీ దళాలు వెయ్యి మందికిపైగా అమెరికన్లను హతమార్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసింది. పాము తలను నరికామని రాసుకొచ్చింది. ఇప్పుడు ఐర్​జీసీకి ప్రధాన కార్యాలయం లేదని వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సహా యుద్ధవిమానాలను ధ్వంసం చేశామని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్‌లో అప్‌లోడ్ చేసింది.

యూఏఈ రక్షణ శాఖ ప్రకటన
ఇరాన్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించిన భారీ దాడుల నేపథ్యంలో యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఇరాన్​ నుంచి వచ్చిన 165 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 541 ఇరాన్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని వెల్లడించింది. ఈ ప్రకటనను అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం కూడా పునఃప్రచురించింది.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ కలిసి ఇరాన్​పై దాడులు చేశాయి. టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా ఆయన కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించారని ఇరాన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలపై దాడులు చేసింది.