ఒక్క నిమిషంలోనే ఖమేనీ హతం- అమెరికా Vs ఇరాన్- టాప్ 10 కీలక ఘటనలు ఇవే!
అమెరికా, ఇరాన్ చర్చల్లో పురోగతంటూ ఫిబ్రవరి 27న ఒమన్ ప్రకటన- ఫిబ్రవరి 28న ఖమేనీ సమావేశం నిర్వహించే ప్రదేశంపై నిర్దిష్ట సమాచారం- ఆకస్మిక దాడి కోసం నెలల కిందే సంయుక్త ప్లాన్!
AMERICA ISRAEL VS IRAN TOP 10 POINTS (AP)

Published : March 1, 2026 at 4:11 PM IST
America Israel Vs Iran Top 10 Points : అణ్వస్త్ర కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరోక్ష చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుందంటూ ఫిబ్రవరి 27న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ బద్ర్ అల్ బుసైదీ కీలక ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే (ఫిబ్రవరి 28న) అకస్మాత్తుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఈ ఎటాక్స్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న పలు కీలక సంఘటనల సమాచారాన్ని 10 టాప్ పాయింట్లలో తెలుసుకుందాం.
- ఇరాన్‌పై తమ తొలి దాడిలో దేశ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు 40 మంది సీనియర్ కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. "ఈ ఆపరేషన్ మొదటి అడుగు ఖమేనీతో సహా 40 మంది సీనియర్ కమాండర్లను పట్టపగలు ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రెండు వేర్వేరు ప్రదేశాలలో ఒక నిమిషంలో హతమార్చడం" అని సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషాని తెలిపారు.
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి సంతాపం తెలిపేందుకు వేలాది మంది ఇరానియన్లు వీధులు, కూడళ్లలో గుమిగూడారు. వారంతా ఖమేనీ ఫొటోలను చేతిలో పట్టుకొని అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ హత్య జరిగిన అనంతరం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ వెలుపల పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో దాదాపు ఆరుగురు చనిపోగా, పలువురు గాయపడ్డారు.
- తమ దాడుల్లో ఖమేనీ చనిపోయారని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత, దీనిపై ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు సన్నిహిత సలహాదారు అలీ షంఖానీ, జనరల్ అబ్దుల్ రహీం మౌసావి, రక్షణ మంత్రి జనరల్ అజీజ్ నాసిర్జాదే, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ మొహమ్మద్ పక్‌పూర్ చనిపోయారని ఆ వార్తలలో ప్రస్తావించారు.
- ఈ అంశంపై ప్రధాన ప్రపంచ దేశాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. కెనడా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌లకు మద్దతుగా ప్రకటనలు విడుదల చేశాయి. రష్యా, చైనా, స్పెయిన్ ఈ దాడిని ఖండించాయి. ఇది ఒక అసంకల్పిత సాయుధ దురాక్రమణ చర్య అని అవి విమర్శించాయి.
- గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మళ్లీ దాడులను ప్రారంభించింది. దీనివల్ల ఆయా సైనిక స్థావరాలకు భారీ నష్టం జరుగుతోంది. ఆయా సైనిక స్థావరాలున్న నగరాల్లోని ఎయిర్ పోర్టులపైనా ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లోని చాలా దేశాల్లో పౌర విమానయాన సేవలు నిలిచిపోయాయి. కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఆ మార్గంలో ముడి చమురు ట్యాంకర్ల రాకపోకలు స్తంభించాయి.
- ఇరాన్‌పై భారీ సైనిక ఆపరేషన్‌ను మొదలుపెట్టామని శనివారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అక్కడి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
- ఇరాన్‌లోని రివల్యూషనరీ గార్డ్ కమాండ్ యూనిట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్‌లను లాంచ్ చేసే ప్రదేశాలు, సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని అమెరికా సైన్యం వెల్లడించింది.
- ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమయ్యాక ఇరాన్‌పై భీకర దాడులు చేయాలనే స్కెచ్‌ను చాలా నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ రెడీ చేస్తున్నాయని నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకించి అయతుల్లా అలీ ఖమేనీ సమావేశాలను నిర్వహించే నిర్దిష్ట ప్రదేశాల సమాచారాన్ని గత కొన్ని నెలలుగా ఇరాన్‌లోని అమెరికా నిఘా వర్గాలు సేకరిస్తున్నాయని తెలుస్తోంది. శనివారం (ఫిబ్రవరి 28న) ఉదయం ఖమేనీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ప్రదేశంపై కచ్చితమైన సమాచారం అందాకే ఇజ్రాయెల్, అమెరికా ఎటాక్స్ చేశాయని అంటున్నారు.
- ఇజ్రాయెల్‌ను, మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈక్రమంలో బహ్రెయిన్, కువైట్, ఖతర్, యూఏఈ, సౌదీ అరేబియాలలోని అమెరికా సైనిక స్థావరాలపై ఎటాక్స్‌కు పాల్పడింది.
- ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ బద్ర్ అల్ బుసైదీ, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మూడో రౌండ్ చర్చల తర్వాత కీలక ప్రకటన చేశారు. అమెరికా - ఇరాన్ చర్చల్లో గణనీయమైన పురోగతి జరిగిందని ఫిబ్రవరి 27న ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే అకస్మాత్తుగా టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ను అంతం చేశాయి.

