ETV Bharat / international

అఫ్గాన్​- పాక్​ మధ్య యుద్ధం- పరస్పర దాడుల్లో వందకు పైగా మృతి!

పరస్పరం దాడులకు దిగిన అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్- సైనిక శిబిరాలే లక్ష్యంగా పరస్పర దాడులు చేసుకుంటున్న పాక్‌, అఫ్గాన్‌

afghanistan pakistan war
afghanistan pakistan war (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 7:10 AM IST

3 Min Read
Choose ETV Bharat

Afghanistan Pakistan War : పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు మరోసారి ఘర్షణకు దిగాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 55 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించగా, 133 మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. తమవైపు కేవలం ఇద్దరు మాత్రమే మృతిచెందారని ముగ్గురు గాయపడ్డారని పాక్ తెలిపింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్​ కీలక ప్రకటన చేసింది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు.

19 పాక్‌ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్న అఫ్గాన్‌
గత ఆదివారం పాక్‌ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారంగా గురువారం రాత్రి అఫ్గాన్‌ తాలిబన్‌ దళాలు సరిహద్దులోని పాక్‌ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్‌లో 19 పాకిస్థానీ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు అఫ్గాన్‌ పేర్కొంది. పాకిస్థానీ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌గా పేరు
గురువారం రాత్రి అఫ్గాన్‌ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్‌ సైన్యం అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. తాము కాబూల్‌తో సహా చిత్రాల్‌, ఖైబర్‌, మొహమ్మద్‌, కుర్రం, బజౌర్‌ సెక్టార్‌లో వైమానిక దాడులు నిర్వహించినట్లు పాక్​ సైన్యం పేర్కొంది. దీనికి ‘ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌’గా పేరు పెట్టింది.

133 మంది తాలిబన్లను హతమార్చినట్లు ప్రకటించుకున్న పాక్‌ సైన్యం
మరోవైపు మృతులకు సంబంధించి తాలిబన్ల ప్రకటనను పాకిస్థాన్‌ సైన్యం తోసిపుచ్చింది. తమవైపు కేవలం ఇద్దరు మాత్రమే మృతిచెందారని ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. 133 మంది తాలిబన్లను మట్టుబెట్టామని 200 మందికి గాయాలయ్యాయని పాక్‌ ప్రధాని అధికార ప్రతినిధి మొషార్రఫ్‌ జైదీ తెలిపారు. 27 అఫ్గాన్‌ పోస్టులను ధ్వంసం చేయగా 9 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తమ పోస్టులన్నీ సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మిగిలింది బహిరంగ యుద్ధమే : పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
ఆఫ్గానిస్థాన్ తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. తమ సహనం పరిమితి దాటిందని, ఇప్పుడు మిగిలింది బహిరంగ యుద్ధమేనని పేర్కొన్నారు. తాలిబన్‌ దళాలపై పాక్‌ సైన్యం బలంగా ప్రతిస్పందిస్తుందని ఖవాజా చెప్పారు.

"నాటో దశాలు ఉపసంహరించిన తర్వాత అఫ్గానిస్థాన్​లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని భావించాం. తాలిబన్​ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని అనుకున్నాం. కానీ వారు మాత్రం ప్రపంచంలోని ఉగ్రవాదులను సమీకరించి టెర్రరిజాన్ని పెంచుతున్నారు. వారి సొంత ప్రజల హక్కులను సైతం కాలరాస్తున్నారు. ఇస్లాం మహిళలకు ఇచ్చిన హక్కులను కూడా లాగేసుకున్నారు. మాకు సహనం నశించింది. ఇక మీకు మాకు మధ్య బహిరంగ యుద్ధమే."

ఖవాజా ఆసిఫ్, పాకిస్థాన్ రక్షణ మంత్రి

'దేశ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు'
బాహ్య శక్తుల దూకుడును అణిచివేయడానికి పాకిస్థాన్ భద్రతా దళాలు పూర్తిగా సమర్థులని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దేశ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. ప్రతి దురాక్రమణకు తగిన సమాధానం ఇచ్చి తీరుతామని ఎక్స్‌లో పోస్టుచేశారు. పాక్‌ ప్రజలు, సాయుధ దళాలు దేశ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అఫ్గాన్ గగనతలంలోకి పాక్‌ ఫైటర్ జెట్
అటు కాబుల్‌లో మూడుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని తాలిబన్‌ అధికారులు చెబుతున్నారు. కాబుల్‌, కాందహార్‌, పక్తియా ప్రావిన్స్‌లలో వైమానిక దాడులు జరిగాయని అఫ్గాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా వెల్లడించారు. అఫ్గాన్ గగనతలంలోకి పాక్‌ ఫైటర్ జెట్ ప్రవేశించిందని, దానిని అఫ్గాన్ దళాలు కూల్చివేశాయని స్థానిక మీడియా వెల్లడించింది. ధ్రువీకరణలేని కొన్ని దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు. పాక్, అఫ్గాన్‌ల మధ్య దాదాపు 2,611 కిలోమీటర్ల డ్యూరాండ్‌ సరిహద్దు ఉంది. అయితే దానిని అఫ్గానిస్థాన్‌ అధికారికంగా గుర్తించడం లేదు.