ఇరాన్ నేతలు చెడ్డవారు- టెహ్రాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ కీలక కామెంట్స్- ఒప్పందం ముగిసిందని చెప్పిన యూఎస్ ప్రెసిడెంట్- అయితే టెహ్రాన్‌తో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడి

Published : July 8, 2026 at 3:00 PM IST
Trump says ceasefire is over : ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్‌పై అమెరికా జరిపిన దాడులపై స్పందించిన ట్రంప్ తాత్కాలిక ఒప్పందం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఇరాన్ నేతలు చెడ్డవారని, తనకు సంబంధించిన వరకు ఒప్పందం ముగిసిపోయిందన్నారు. అయితే చర్చలు కొనసాగించడానికి వారికి తాను అనుమతి ఇస్తానని చెప్పారు. అయినా ఇరాన్‌తో చర్చలు జరపడమంటే సమయాన్ని వృధా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు.
'ఇరాన్ నేతలు చెడ్డవారు'
టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ నేతలు చెడ్డ వ్యక్తులని, వాళ్లు ప్రమాదకరమని అన్నారు. వారు మానసిక స్థితి సరిగాలేని వారని చెప్పుకొచ్చారు. వారిని విశ్వసించలేమని పేర్కొన్నారు. అణ్వాయుధాలు వారి చేతికి దక్కితే వాటిని ఉపయోగించడానికి కూడా వెనుకాడరని ఆరోపించారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మార్చిందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
On the status of the ceasefire with Iran, US President Donald Trump says, "To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum... They're led by sick people... I'll speak to our negotiators. They want to negotiate—they're good people... but they have to… pic.twitter.com/8oZYJJS7dV
— ANI (@ANI) July 8, 2026
నా దృష్టిలో ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిపోయింది. నేను ఇకపై వారితో వ్యవహారాలు మాట్లాడాలనుకోవటం లేదు. వారు ఒప్పందాల విషయంలో నిజాయితీగా వ్యవహరించరు. ఒక ఒప్పందానికి అంగీకరించి బయటకు వెళ్లిన తర్వాత దాన్ని తిరస్కరిస్తారు. బయటకు వెళ్లి పత్రికల ముందు జోకులు వేస్తారు. అలాంటి వారితో చర్చలు జరపడం సమయం వృథా చేయడమే."
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా సంధానకర్తలపై విశ్వాసం
అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి సంధానకర్తలు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించాలని భావిస్తున్నారని ట్రంప్ తెలిపారు. వారు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, తుది నిర్ణయం తనదేనని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా అది అమలవుతుందనే నమ్మకం తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఇరాన్‌కు చెందిన ప్రమాదకర వ్యక్తులపై అమెరికా బలగాలు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించాయని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ దాడులకు దిగడంతో తాము గట్టిగా సమాధానం ఇచ్చామన్నారు. అత్యంత ప్రమాదకర లక్ష్యాలపై శక్తివంతమైన దాడులు చేశారని అన్నారు. మరోవైపు అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ, ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను అమెరికానే పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
హర్మూజ్ జలసంధి పరిణామాలు, దక్షిణ ఇరాన్‌పై దాడులు, ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే చర్యలు అమెరికా రెచ్చగొట్టే వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ లొంగబోదని, సైనిక, ఆర్థిక బెదిరింపులతో తమ దేశాన్ని భయపెట్టలేరని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. బెదిరింపులు, ఒత్తిళ్ల కాలం ముగిసిందని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని హెచ్చరించారు. "బెదిరింపులు, దోపిడీల యుగం ముగిసింది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు" అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
మరింత ఉద్రిక్తంగా హర్మూజ్ జలసంధి
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడడం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది.
వైరల్ అవుతున్న 'బూమ్' పోస్ట్
ఈ దాడుల అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదికైన 'ట్రూత్ సోషల్'లో చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 'నేను దీనికి ఓటు వేశాను' అనే వ్యాఖ్యతో పాటు 'బూమ్' అనే పదం, పేలుడు యానిమేషన్ ఉన్న ఓ పోస్టు స్క్రీన్‌షాట్‌ను ఆయన పంచుకున్నారు. అలాగే ఇరాన్‌లో జరిగిన భారీ పేలుళ్లకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. అమెరికా దళాలు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత రాడార్ కేంద్రాలు, నౌక విధ్వంసక క్షిపణి స్థావరాలు, అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్సకు చెందిన 60కుపైగా వేగవంతమైన దాడి నౌకలను లక్ష్యంగా చేసుకుని కచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.
'మిత్రదేశాల ఐక్యతకు ఇదో పరీక్ష'- ఇరాన్ యుద్ధంలో నాటో తీరుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి
'వాళ్లు ఆపేద్దామనుకుంటున్నారు'- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

