ETV Bharat / international

మదురో ఆపరేషన్​లో 56మంది భద్రతాధికారుల మృతి- వెనెజువెలాతో పాటు క్యూబా సైనికులు మరణం

మదురో ఆపరేషన్​లో భారీగా సైనికుల మృతి- 56కు చేరిన మొత్తం మృతుల సంఖ్య

Trump
Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 7:15 AM IST

2 Min Read
Choose ETV Bharat

US Attacks Venezuela : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్​ మదురోను బంధించే క్రమంలో అమెరికా చేపట్టిన ఆకస్మిక దాడుల్లో 56 మంది భద్రతాధికారులు మరణించారు. వెనెజువెలాకు చెందిన 24 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు వెనిజువెలాలో పనిచేస్తున్న 32 మంది క్యూబా సైనిక, పోలీసు అధికారులు సైతం ఈ ఆపరేషన్‌లో మరణించారని క్యూబా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మరోవైపు డజన్లకొద్దీ భద్రతా సిబ్బంది, పౌరులు కూడా మరణించారని వెనెజువెలా అటార్నీ జనరల్‌ తారెక్‌ విలియం మంగళవారం తెలిపారు. యుద్ధ నేరం కింద కేసులు నమోదు చేసి విచారిస్తామని ఆయన ప్రకటించారు.

అటు క్యూబా ఆర్మీలో మరణించిన 32 మంది వయసు 26- 60 ఏళ్ల మధ్య ఉంటారని చెప్పింది. అలాగే మరణించిన వారిలో కల్నల్స్, లెఫ్టినెంట్లు, మేజర్లు, కెప్టెన్లతోపాటు కొంతమంది రిజర్వ్ సైనికులు ఉన్నారని క్యూబా తెలిపింది. వీరంతా రెవల్యూషనరీ ఆర్మ్​డ్​ ఫోర్సెస్​, అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను క్యూబా ప్రభుత్వం వివరించింది. అయితే, వెనెజువెలాలో ఏ మిషన్​లో భాగంగా పనిచేస్తున్నారన్న విషయాన్ని మాత్రం క్యూబా ప్రభుత్వం వివరించలేదు. అయితే, వెనెజువెలా, క్యూబా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొంత ఆర్మీ ఆ దేశంలో ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ప్రవేశించిన 5 నిమిషాల్లోనే ఆపరేషన్​ కంప్లీట్​!
కాగా, వెనెజువెలా రాజధాని కరాకస్​లోని లా కార్లోటా ఎయిర్​ఫీల్డ్​, ప్యూర్టే లియునా మిలిటరీ బేస్​, లా గ్వైరా నౌకాశ్రయంతోపాటు కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు శుక్రవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్​ను అమెరికా తమ అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని కాసేపటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్​లో అధికారికంగా ప్రకటించారు. వెనుజువెలా అధ్యక్ష భవన కాంపౌండ్‌లోకి ప్రవేశించిన 5 నిమిషాల్లోనే డెల్టా ఫోర్స్‌ కమెండోలు మదురోను బంధించినట్లు తెలిపారు. అయితే ఈ దాడులను వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్​ ఖండించారు. దీనిని సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు. అటు వెనెజువెలాపై అమెరికా చేసిన దాడులను రష్యా, ఇరాన్​, చెనా, కొలంబియా సహా ఇతర దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ధైర్యముంటే అధ్యక్ష భవనానికి వచ్చి నన్ను తీసుకెళ్లండి!
అంతకుముందు వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా బలగాలు నిర్భందించే కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ మదురో చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. 'ధైర్యముంటే అధ్యక్ష భవనానికి వచ్చి తనను తీసుకెళ్లండి' అంటూ మదురో అందులో సవాల్‌ విసిరినట్లు వీడియోలో ఉంది. ఈ క్రమంలోనే వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే ఇదివరకు ప్రకటించిన నజరానాను 50 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.450 కోట్లు)కు పెంచింది అమెరికా. దీనిపై తీవ్రంగా స్పందించిన మదురో, అమెరికాను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వచ్చి నన్ను తీసుకెళ్లండి. మీకోసం నేను మిరాఫ్లోర్‌లోనే (వెనెజువెలా అధ్యక్ష భవనం) ఎదురు చూస్తున్నా. ఆలస్యం చేయొద్దు' అని ఉద్వేగ ప్రసంగంలో సవాల్‌ విసిరారు. అయితే అలాగే అమెరికా సైన్యం వెనెజువెలా అధ్యక్ష భవనంలోకి వెళ్లి ఆయన్ను అరెస్టు చేసి తీసుకుపోవడం గమనార్హం.

మదురోలా అమెరికాకు కొలంబియా అధ్యక్షుడు సవాల్​- సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్

వెనెజువెలా ప్రజల శ్రేయస్సును భారత్​ కోరుకుంటోంది- అక్కడి పరిణామాలు ఆందోళనకరం: జైశంకర్