ETV Bharat / health

చదువు ఒత్తిడిలో అధిక ఆహారం - ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్న నిపుణులు!

పరీక్షల టెన్షన్ - బరువు పెరగడానికి అసలు కారణం ఇవేనట!

stress eating
stress eating (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 13, 2026 at 4:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Eating While Under Stress Leads to Health Problems : పూటకో అస్సైన్​మెంట్, వారానికో టెస్ట్, నెలకో పరీక్ష, రోజూ 12-14 గంటలు బెంచీలకే పరిమితం. ఇంత ఒత్తిడిలో కూడా పిల్లలు తినేదెప్పుడు? తమ గురించి తాము ఆలోచించేదెప్పుడు? దీంతో వారు 'స్ట్రెస్ ఈటింగ్' వైపు మళ్లుతున్నారు. అటు శరీరాకృతినీ, ఇటు ఆరోగ్యాన్నీ కోల్పోతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో బరువు పెరగడానికి కారణాలేంటో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

పిల్లలు బరువు పెరగడానికి కారణం థైరాయిడ్ కావచ్చని చాలామంది తల్లిదండ్రులు సొంతంగానే పరీక్షలు చేయిస్తున్నారు. అయితే ప్రధాన కారణం ఒత్తిడి, దానివల్ల మారే జీవనశైలి, ఆహారపు అలవాట్లు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఇంటర్మీడియట్ చదువు అంటే విద్యార్థులు, వారి పేరెంట్స్​కు పెద్ద యుద్ధమే. JEE, NEET, EAPCET ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారట. ముఖ్యంగా, హాస్టళ్లలో విద్యార్థులు తక్కువ నిద్ర, ఒత్తిడి కారణంగా ఒబెసిటీ బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు.

స్ట్రెస్ ఈటింగ్ : పిల్లలు పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి, వారికి తెలియకుండానే ఎక్కువ ఆహారం తింటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా నష్టం చేస్తోంది. అర్ధరాత్రి వరకు చదివే పిల్లలు ఆ టైంలో ఆకలి వేసి విద్యార్థులు మైదాతో చేసిన ఆహార పదార్థాలు (బిస్కెట్లు, నూడుల్స్) ప్యాకేజ్డ్ చిప్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇది జీర్ణక్రియను దెబ్బ తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, వారాంతాల్లో క్యాంటీన్లలో లభించే కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్ పిల్లల పొట్టల్లో 'టాక్సిక్ ఫ్యాట్'గా మారుతున్నాయి. హడావుడిలో ఉదయం అల్పాహారం మానేయడం, తర్వాత ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్, వారి బంధువులు హాస్టళ్లు ఉన్న తమ పిల్లల్ని చూసేందుకు వెళ్లినప్పుడు అధిక క్యాలరీలు ఉండే ప్యాకేజ్డ్ పదార్థాలను కొని, ఇస్తూ ఉంటారు. ఇది కూడా విద్యార్థులు కీడు చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"డయాబెటిస్" కంటి చూపును ప్రభావితం చేస్తుందా? - పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

ఒబెసిటీతో దుష్పరిణామాలు : పొత్తి కడుపు అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్ పెరగడం వల్ల ఇన్సులిన్ తగ్గుతుంది. తద్వారా, టైప్ -2 డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీ లివర్ లాంటి వాటి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఒబెసిటీ వల్ల బద్ధకం వస్తుంది. మగతగా ఉంటుంది. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. నిద్రలో శ్వాస ఆడకపోవడం, స్లీప్ ఆప్నియా (sleep apnea), అమ్మాయిల్లో హార్మోన్ల సమస్యలు వంటివి వస్తాయి. ఈ క్రమంలో 15-18 ఏళ్ల వయసులోనే విపరీతంగా బరువు పెరగడం వల్ల దీర్ఘకాలంలో కీళ్ల నొప్పులు, థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అమ్మాయిలో PCOD వచ్చే ప్రమాదం ఉందట. అంతేకాదు, తోటి విద్యార్థుల హేళనలు ఎదుర్కొవడం వల్ల మానసికంగా కుంగిపోతారు. ఇది వారి ఆరోగ్యంపైన కాదు, మార్కులమీద కూడా ప్రభావం చూపుతుంది.

ఎండ తగలకపోవడం, ఆటలు లేకపోవడంతో విద్యార్థుల్లో Vitamin D లోపం ఏర్పడుతుంది. ఇది క్రమంగా ఎముకలు, కండరాల బలహీనతకు దారితీసే ప్రమాదం ఉంది. పరీక్షల ఆందోళన, ఒత్తిడి లాంటి కారణాల వల్ల చాలామంది ఎమోషనల్ ఈటింగ్​కు గురవుతారు. ఈ అలవాటు ఒబెసిటీకి దారితీసే అవకాశం ఉంది. శరీర అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే ఫ్యాట్ కారణంగా శరీరంలో TNF ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్-6 (IL-6) వంటి రసాయనాలు విడుదలై డయాబెటిస్, బీపీ, కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. - ప్రొఫెసర్ డా. కె. రాంబాబు

ఇప్పుడేం చేద్దాం :

  • రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామ శిక్షణ యోగా, అవుటోడోర్ ఆటలు ఆడడం లాంటివి తప్పనిసరి చేయాలి.
  • చదువుతో పాటు పిల్లలలో వచ్చే శారీరక మార్పులు, బరువును గమనించాలి.
  • క్లాస్​ బ్రేక్ టైంలో ఒకేచోట కూర్చోకుండా కారిడార్​లో కాసేపు నడవాలి.
  • ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్​కు ముందు రూమ్​లోనే 10-15 నిమిషాలు ఏదైనా వ్యాయామం చేయాలి.
  • హాస్టల్​ మెనూలో కార్బోహైడ్రేట్లు తగ్గించి, పీచు, ప్రొటీన్లు పెంచాలి.
  • పిల్లలకు ఆయిల్​ ఫుడ్​, జంక్​ఫుడ్​కు బదులు వేయించిన శనగలు, బాదం, రాగి లడ్డూలు, జామ కాయలు, యాపిల్స్ లాంటివి ఇవ్వాలి.
  • రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరంలో విషపదార్థాలను బయటకు పంపి, ఆకలి, బరువుని అదుపులో ఉంచుతుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకునేదెలా? - నిపుణులు ఏమంటున్నారంటే!

'మొక్కజొన్న పొత్తు' అంటే ఇష్టమా? - ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందట!