వరుసగా 3 రోజులు నిద్రలేకపోతే ఏం జరుగుతుంది? - ఈ మార్పులతో మీరు షాక్ అవుతారు!
నిద్రపోకపోతే ఏమవుతుంది? - మీరూ ఇలా ఆలోచిస్తున్నారా?

Published : June 3, 2026 at 5:22 PM IST
What Happens if you Dont Sleep for 3 Days : పరీక్షల టెన్షన్, పని ఒత్తిడి, వరుస ప్రయాణాలు, డిప్రెషన్ ఇలా కారణాలేవైనా, రెండు, మూడు రోజుల పాటు నిద్రపోకపోతే శరీరం ఏం జరుగుతుందో అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? చాలామంది ఒకటి నుంచి రెండు రోజులు నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని తేలికగా తీసుకుంటారు. కానీ, నిద్రలేమి గంటలు పెరిగే కొద్దీ శరీరం, మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజులు నిద్రపోకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? గంటలు గడిచే కొద్ది ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? తదితర పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
మొదటి రోజు : 24 గంటల పాటు నిద్రపోకపోతే మొదటగా శరీరం అలసటగా అనిపిస్తుంది. కళ్లలో మంట, తలనొప్పి, చిరాకు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. మెదడు ఏ విషయంపైన ఫోకస్ పెట్టలేదు. చేసే పనుల్లో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ సరిగా చేయలేరు. ఈ సమయంలో శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుందట. అందుకే, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా అనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొందరికి ఎక్కువగా ఆకలి వేస్తుందని చెబుతున్నారు. జంక్ ఫుడ్ తినాలనే కోరిక పెరిగిపోతుందట. 24 గంటల నిద్రలేమి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను గణనీయంగా పెంచి, శ్రద్ధ, క్రియాశీల జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని National Library of Medicine పేర్కొంది.
చిన్న వయస్సులో మోకాళ్ల, తుంటి నొప్పులా? - ఈ చిన్న చిన్న అలవాట్లే కారణమని తెలుసా?
రెండవ రోజు : 48 గంటల పాటు నిద్రపోకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. ఈ దశలో మెదడు సరిగా పనిచేయలేదు. మాట్లాడేటప్పుడు మాటలు తడబడతాయి. ఏం చెబుతున్నారో కూడా మర్చిపోతూ ఉంటారు. కళ్లు మసకగా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో శరీరం కొన్ని సెకండ్ల పాటు మైక్రోస్లీప్లోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు. అంటే, మనకు తెలియకుండానే మెదడు కొన్ని క్షణాలు నిద్రలోకి వెళుతుందట. ఇది డ్రైవింగ్ లేదా మెషీన్లతో పనిచేసే వారికి చాలా ప్రమాదరమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు పెరిగిపోతాయట. దీర్ఘకాలిక పూర్తి నిద్రలేమి (> 45 గంటలు) ఫలితంగా ప్రతికూల మానసిక స్థితులు పెరుగుతాయని, ముఖ్యంగా అలసట, శక్తి కోల్పోవడం, నిద్రమత్తు, గందరగోళం వంటి భావనలు కలుగుతాయని University of Pennsylvania పేర్కొంది.
మూడవ రోజు : 72 గంటల పాటు అంటే మూడు రోజులు నిద్ర లేకపోతే మెదడు తీవ్రంగా ప్రభావం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో భ్రమలు కలగడం మొదలవుతాయట. వస్తువులు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు కనిపిస్తాయి. చుట్టూ ఉన్న విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేరు. చిన్నచిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేరు. శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందంటున్నారు నిపుణులు. బీపీ, డయాబెటిస్, ఒబెసిటీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకుండా ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక వైకల్య లక్షణాలు పెరుగుతాయని National Library of Medicine పేర్కొంది. ఇవి చిన్నపాటి చూపు లేదా స్పర్శ భ్రమలతో ప్రారంభమై, భ్రాంతులు, తీవ్ర భ్రమలుగా మారి, చివరకు తీవ్రమైన పిచ్చి లాంటి స్థితికి దారితీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో మెదడు రీసెట్ అవ్వాలంటే నిద్ర చాలా అవసరం. నిద్ర సమయంలోనే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలోని కణాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయి. అందుకే, ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కరెంటుతో కండలా? - EMS ట్రెండ్‌తో లాభమెంత? నష్టమెంత?
పక్షవాతానికి "రిహాబిలిటేషన్" చికిత్స - ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

