ETV Bharat / health

ఆరోగ్యానికి "నడక" మంచిదే - కానీ ఈ పద్ధతుల్లో నడిస్తే మరికొన్ని ప్రయోజనాలు!

-నడవడంలో కూడా పలు రకాలు - ఒక్కో రకంగా నడిస్తే ఒక్కో లాభం - అవేంటో తెలుసా?

Types of Walking and Benefits
Types of Walking and Benefits (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 11, 2026 at 3:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Types of Walking and Benefits: మారిన లైఫ్​స్టైల్​, ఆహారపు అలవాటు, శారీరక శ్రమ లేకపోవడం, గంటలతరబడి ఒకే దగ్గర కూర్చోవడం ఇలా కారణాలు ఏమైతేనేమి మెజార్టీ పీపుల్​ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, డయాబెటిస్, పీసీఓఎస్‌ వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారు కోకొల్లలు. అందుకే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మెజార్టీ పీపుల్​ వాకింగ్​ను తమ రొటీన్​లో భాగం చేసుకుంటున్నారు. అయితే, ఒకే రీతిలో నడవకుండా వివిధ రకాలుగా వాక్​ చేయడం వల్ల మరిన్ని బెనిఫిట్స్​ పొందొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

1. తడాసన నడక: ఆధునిక జీవనశైలికి, శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చేసే ఒక విశిష్టమైన యోగ నడకగా దీనిని చెబుతున్నారు నిపుణులు. ఇది పర్వతాసనాన్ని పోలి ఉంటుందని వివరిస్తున్నారు. ఇలా నడవడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలు దృఢంగా మారతాయని, ఇక నిటారుగా నడవడం వల్ల శరీర ఆకృతి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ నడకను లైఫ్​స్టైల్లో భాగం చేసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్​గా ఉండచ్చని వివరిస్తున్నారు.

ఎలా నడవాలి:

  • ముందుగా రెండు పాదాలను దగ్గరగా ఉంచి, వెన్నముకను నిటారుగా ఉంచి నిలబడాలంటున్నారు.
  • ఆ తర్వాత రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి లాక్​ చేసి, అరచేతులు ఆకాశం వైపు చూసేలా చేతులను పైకి ఎత్తాలట.
  • అనంతరం అరికాళ్లు నేలకు తగలకుండా కేవలం మునివేళ్లపై నిలబడి ముందుకు అడుగులు వేయాలని చెబుతున్నారు.

2. 8 షేప్​ వాకింగ్​: సాధారణంగా వాకింగ్‌ అంటే ఒకటే దారిలో నడుస్తూ వెళ్తుంటాం. అయితే అలా కాకుండా ఒకే ప్లేస్​లో ఎనిమిది నెంబర్​ మాదిరిగా తిరుగుతూ నడిచే పద్ధతిని సిద్ధ నడక అంటారని తెలుపుతున్నారు. ఇలా 8 షేప్​ వాకింగ్​ చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. ఇక ఏకాగ్రతకు ఈ నడక మంచిదని చెబుతున్నారు. అదే విధంగా ఒత్తిడి, డిప్రెషన్​ నుంచి ఉపశమనం లభిస్తుందని, మెదడు పనితీరు మెరుగుపడి సమస్యలను పరిష్కరించే స్కిల్స్​ అలవడతాయంటున్నారు.

ఎలా నడవాలి:

  • ఒక ప్రాంతంలో ఒక సరళ రేఖపై కాస్త దూరంలో రెండు వస్తువులు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత వాటి చుట్టూ ఎనిమిది అంకె వచ్చేట్టుగా వాకింగ్‌ చేయాలని వివరిస్తున్నారు.

3. రివర్స్​ వాకింగ్​: ముందుకు నడవడం వల్ల మాత్రమే కాదు వెనక్కి నడవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కాస్త కష్టమైనా.. ఈ వాకింగ్​ వల్ల మోకాళ్ల కండరాలు స్ట్రాంగ్​గా మారతాయని చెబుతున్నారు. అలాగే కీళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​లో పేర్కొన్నట్లు వివరిస్తున్నారు. ఇక శరీర ఆకృతి నిటారుగా మారడంలోనూ ఈ నడక కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

4. కాకి నడక: కాకి లాగ నడవడం వల్ల కూడా పలు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా నడవడం వల్ల పొట్ట కండరాలు బలోపేతం అవుతాయని, తద్వారా జీర్ణశక్తి మెరుగవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యల నుంచి రిలీఫ్​ కలుగుతుందని, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.

ఎలా చేయాలంటే:

  • ఈ నడకలో భాగంగా ముందుగా కాకి భంగిమలాగా కూర్చోవాలంటున్నారు.
  • అనంతరం రెండు చేతులతో రెండు మోకాళ్లను పట్టుకొని ముందుకు నడవాలని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"బరువు తగ్గడం నుంచి జుట్టు రాలడం వరకు" - శరీరంలో "ఈ లక్షణాలను" నిర్లక్ష్యం చేయకూడదట!

షుగర్ పేషెంట్లకు అలర్ట్ - "డిన్నర్" టైంలో ఇవి చాలా ప్రమాదకరమట!