చలికాలంలో తీవ్ర ఒళ్లు నొప్పులా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!
వాతావరణ మార్పులు కారణంగానే ఒళ్లు నొప్పులు - ఇలా చేస్తే బెటర్ అంటున్న నిపుణులు!

Published : November 15, 2025 at 12:57 PM IST
Body Pains in Winter Season: చలికాలం మొదలయితే చాలు బద్ధకం ఆవహిస్తుంది. ఉదయాన్నే ఒళ్లంతా నొప్పులతో నిద్రలేవడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కొందరైతే కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి ఉంటుంది. అందుకే శీతాకాలంలో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చలికాలంలో ఒళ్లు నొప్పులు ఎందుకు వస్తాయో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
వాతావరణ మార్పులు : చలి పెరిగే కొద్దీ, వాతావరణ పీడనం తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ పీడన మార్పు వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు, స్నాయువులు, లిగమెంట్లు కొద్దిగా ఉబ్బుతాయని చెబుతున్నారు. దీని కారణంగా కీళ్లపై ఒత్తిడి పెరగడం వల్ల నొప్పి, పట్టేసినట్టు అనిపిస్తుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ నొప్పి ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. వాతావరణ పీడనంలో మార్పులు మైగ్రేన్లు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, ఆస్టియో ఆర్థరైటిస్-ప్రేరిత నొప్పి, వెన్నునొప్పి, న్యూరోపతిక్ నొప్పి వంటి వివిధ రకాల నొప్పికి కారణమవుతాయని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
డిప్రెషన్ మందులు వాడుతూ మద్యం సేవిస్తున్నారా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
రక్త ప్రసరణ తగ్గడం : చలికి శరీరంలో రక్త సరఫరా నిదానించి ఒళ్లంతా తిమ్మిర్లు, నొప్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎక్కువ సమయం కదలకుండా కూర్చోకూడదని, మధ్యలో కాళ్లూ, చేతులను సాగదీస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
కదలిక లేకపోవడం : చలి కారణంగా చాలా మంది ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. దీంతో వ్యాయామం లేదా శారీరక శ్రమను తగ్గిస్తారు. శారీరక కదలిక లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడి, కీళ్లు బిగుసుకుపోతాయని, ఇది నొప్పులకు దారితీస్తుందని చెబుతున్నారు. శీతాకాలంలో మనం కొంచెం ఎక్కువగా చురుగ్గా ఉండమని, కాబట్టి మనం కొంచెం ఎక్కువగా నొప్పిని అనుభవిస్తామని Health University of Utah అధ్యయనం పేర్కొంది. అలాగే చలితో, కొన్నిసార్లు మన కీళ్లు కొంచెం తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయని తెలిపింది.
కీళ్ల ద్రవం చిక్కబడటం : కీళ్లకు కందెన వలె పనిచేసే సైనోవియల్ ఫ్లూయిడ్ చలిలో మరింత చిక్కబడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కీళ్ల కదలిక తగ్గి, నొప్పి, బిగుసుకుపోవడం పెరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా, చల్లటి వాతావరణానికి ఎముకల్లో ఉండే గుజ్జు గట్టిపడుతుందని తెలియజేస్తున్నారు. ఒళ్లు నొప్పులకు ఇది కూడా ఒక కారణంగా తెలియజేస్తున్నారు. అందుకే స్నానానికి గోరువెచ్చటి నీళ్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని కదలకుండా ఉంచడం వల్ల చలికాలంలో నొప్పులు మరింత ఎక్కువవుతాయని హెచ్చరిస్తున్నారు.
- చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎప్పటి వ్యర్థాలు అప్పుడే బయటకు వెళ్లిపోతాయని అంటున్నారు. దీని వల్ల శరీరం బద్ధకం నుంచి బయటపడి యాక్టివ్గా ఉంటుందని తెలియజేస్తున్నారు.
- శీతాకాలంలో శరీరానికి కావల్సిన దానికంటే సూర్యరశ్మి తక్కువగా అందుతుందని, దీనివల్ల కూడా ఒళ్లు నొప్పులు వస్తాయని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు సలహా మేరకు డి విటమిన్ మాత్రలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
- శరీరాన్ని తగినంత వెచ్చగా ఉంచేందుకు లేయర్డ్ దుస్తులు ధరించాలని Johns Hopkins University అధ్యయనం పేర్కొంది.
- ఎక్కువ సమయం నిలబడి, కూర్చోని చేసే పనులు అయితే 30 నిమిషాలకు ఒకసారి పొజిషన్ మారుస్తూ ఉండాలని అంటున్నారు. అలా చేయడం వల్ల కండరాల మీద ఒత్తిడి పడే అవకాశం తగ్గుతుందని వివరిస్తున్నారు.
- విటమిన్ డి, సి, కె అధికంగా ఉండే కమలా, క్యాబేజి, పాలకూర, టమాటాలు తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచేందుకు తోడ్పడతాయని తెలియజేస్తున్నారు.
- పెద్ద మొత్తంలో బరువులు ఎత్తినా ఆ ప్రభావం కండరాల మీద పడుతుందని, దీంతో ఒళ్లు నొప్పులు వస్తాయంటున్నారు. జిమ్లో తక్కువ బరువులు ఉండే వ్యాయామాలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హైబీపీ కొత్త మార్గదర్శకాలు ఇవే! - ఏం సూచిస్తున్నాయో తెలుసా?
చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? - ఆశ్చర్యకరమైన ఫలితాలకు అవకాశం ఇచ్చినట్టే!

