హైబీపీతో బాధపడుతున్నారా? - ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!
-అధిక రక్తపోటు నియంత్రణలో ఉండాలా? - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Published : October 23, 2025 at 12:50 PM IST
Ways to Control Blood Pressure Naturally: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. ఇందుకు ఒబెసిటీ, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమలేకపోవడం, ఒత్తిడి, నొప్పి నివారణ మందులు ఎక్కువగా వాడడం వంటివి ప్రధాన కారకాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల గుండె పోటు, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశము లేకపోలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ, డాక్టర్ సలహాలు పాటిస్తూనే అదుపులో ఉంచుకోవడానికి కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం మేలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆహారం : DASH (Dietary Approaches to Stop Hypertension), మెడిటరేనియన్ ఆహార పద్ధతులు రెండూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి సహయపడతాయని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ప్రాసెస్ చేసిన మాంసాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం తగ్గించి.. ఆకుకూరలు, తృణధాన్యాలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు, చిక్కుళ్లు, బీన్స్, ఆలివ్ నూనె, అవకాడోలు, గింజలు, విత్తనాలు, చేపలు, లీన్ మీట్స్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి తినాలని సిఫార్సు చేస్తున్నారు. DASH ఆహారం అధిక రక్తపోటు కోసం ఉత్తమ ఆహారంగా పేరు పొందిందని National Heart, Lung, And Blood Institute అధ్యయనంలో పేర్కొంది. అంతేకాకుండా, మెడిటరేనియన్ ఆహారపు శైలి.. గుండె జబ్బులు, స్ట్రోక్‌లను నివారించడంలో, ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి ప్రమాద కారకాలను తగ్గించడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని American Heart Association అధ్యయనం పేర్కొంది.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? - ఏం తినకూడదో మీకు తెలుసా?
క్రమం తప్పకుండా వ్యాయామం : వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన తీవ్రత గల ఏరోబిక్ కార్యాచరణ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ క్రమంలో చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, యోగ, వెయిట్ లిఫ్టింగ్ వంటివి లేదా మీకు ఆసక్తి ఉన్న ఏదైనా కార్యాచరణను ఎంచుకోవచ్చని అంటున్నారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల రక్తపోటు, బరువు, ఒత్తిడి తగ్గుతుందని American Heart Association అధ్యయనం పేర్కొంది.
వీటికి దూరంగా : ధూమపానం మానేయడం చాలా ముఖ్యమంటున్నారు. ఈ అలవాటు ధమనులలో ప్లేక్ ఏర్పడే ప్రమాదాన్ని, రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ పరిమాణాన్ని, గుండె కొట్టుకునే రేటు, రక్తపోటును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ధూమపానం పూర్తిగా మానేయడం ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు. ఒకవేళ మానేయలేకపోతే, మితంగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే మద్యపానాన్ని కూడా తగ్గించాలని చెబుతున్నారు.

ఒత్తిడిని అదుపులో : దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల అధిక రక్తపోటు, నిద్రలేమి, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని University of Rochester Medical Center అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ధ్యానం, యోగ, 7 గంటలు నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నచ్చిన పనులు చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి నిర్వహణ పద్ధతులు అనేవి రోజువారీ రక్తపోటు వైవిధ్యతను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయని అంటున్నారు.
మితంగా ఉప్పు : అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన ఆహార విధానంలో భాగంగా టీనేజర్లు, పెద్దలు.. రోజువారీ ఉప్పు వినియోగం 2,300 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదని Centers for Disease Control and Prevention అధ్యయనం పేర్కొంది.

ఆరోగ్యకరమైన బరువు : అధిక బరువు వల్ల గుండెపై అదనపు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వలన అధిక రక్తపోటు, రక్తనాళాలకు నష్టం వంటి ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కేవలం 10 పౌండ్ల బరువు తగ్గడం కూడా రక్తపోటును నిర్వహించడానికి లేదా నివారించడానికి సహయపడుతుందని American Heart Association అధ్యయనం పేర్కొంది. శారీరక శ్రమను పెంచడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటించడం ద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన మూలికలు : అధిక రక్తపోటు, ప్రీ-హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అల్లం, వెల్లుల్లి, యాలకులు, దాల్చిన చెక్క వంటివి రోజువారీ ఆహారంలో మితమైన మొత్తంలో తీసుకోవడం మంచిదని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"అధిక కొలెస్ట్రాల్"తో బాధపడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!
ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? - తస్మాత్ జాగ్రత్త అంటున్న నిపుణులు!

