పరగడుపున నీరు తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
- ఉదయం లేవగానే నీళ్లు ఎందుకు తాగాలి? - నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Published : September 2, 2026 at 3:22 PM IST
Drinking Water Before Brushing After Waking Up : ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీరు తాగడం అనేది కేవలం ఒక అలవాటు మత్రమే కాదు, ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. రాత్రంతా శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ఎటువంటి ద్రవపదార్థాలు అందవు. దీనివల్ల ఉదయానికి శరీరం సహజంగానే కొంతవరకు డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ఈ క్రమంలో ఉదయం లేవగానే నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు : ప్రతిరోజూ ఉదయం శరీరం స్వల్ప డీహైడ్రేషన్‌తోనే మేల్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస పీల్చడం, చెమట పట్టడం ద్వారా శరీరం నిరంతరం నీటిని కోల్పోతూనే ఉంటుందంటున్నారు. ఈ విధంగా రాత్రంతా కొంత వరకు నీటి నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఫలితంగా, తెలియకుండానే ప్రతిరోజూ ఉదయం స్వల్ప నీటి కొరతతో లేస్తామని వివరిస్తున్నారు. అందుకే, ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు నీటిని తాగి ఆ కొరతను భర్తీ చేయడం అనేది.. శరీర వ్యవస్థను చురుగ్గా ప్రారంభించడానికి ఉన్న అత్యంత సులువైన మార్గాలలో ఒకటని పేర్కొంటున్నారు.
మెదడుకు బూస్టర్! : ఉదయాన్నే నీరు తాగడం వల్ల మెదడు ఉత్తేజం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మన మెదడులో దాదాపు 75 శాతం నీరే ఉంటుందట. కాబట్టి, స్వల్ప డీహైడ్రేషన్ ఏర్పడినా అది మెదడు పనితీరును మందగింపజేస్తుందని అంటున్నారు. డీహైడ్రేషన్ వల్ల మన ఏకాగ్రత, తాత్కాలిక జ్ఞాపకశక్తి, మానసిక స్థితి దెబ్బతింటాయని PLOS ONE జర్నల్ పేర్కొంది. కాబట్టి, నిద్ర లేవగానే నీరు తాగి శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం ద్వారా.. దినచర్య ప్రారంభం కాకముందే మెదడు పూర్తి సామర్థ్యంతో చురుగ్గా పనిచేసేలా చూసుకోవచ్చట.
'BP' పెరిగితే తలనొప్పి?, షుగర్ పేషెంట్లకు తేనె! - 'అపోహలను' నమ్మొద్దంటున్న నిపుణులు!
మెటబాలిజానికి : ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీవక్రియ వేగవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున నీరు తాగడం వల్ల జీవక్రియకు మంచిదట. ఈ క్రమంలో 500 మిల్లీలీటర్ల నీటిని తాగడం వల్ల జీవక్రియ రేటు ఏకంగా 30 శాతం పెరిగిందని Journal of Clinical Endocrinology and Metabolism పేర్కొంది. ఈ ప్రభావం నీరు తాగిన 10 నిమిషాల లోపే ప్రారంభమవుతుందట. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగి, శరీరం రోజంతా క్యాలరీలను వేగంగా కరిగించేలా రీఛార్జ్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
జీర్ణవ్యవస్థకు : ఉదయాన్నే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఉత్తేజితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవగానే నీరు తాగడం వల్ల పెద్దపేగు ప్రేరేపించబడి, జీర్ణ ప్రక్రియలు వేగవంతం అవుతాయంటున్నారు. ఈ క్రమంలో శరీరానికి సరిపడా నీరు అందించడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గడమే కాకుండా, పేగుల కదలికలు క్రమబద్ధంగా సాగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగడం ద్వారా రోజంతా మీ జీర్ణక్రియ సజావుగా సాగడానికి అవసరమైన ఒక చక్కటి లయ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలు : ఉదయాన్నే నీరు తాగడం వల్ల అప్పటికే శ్రమిస్తున్న కిడ్నీలకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి రాత్రంతా నిరంతరాయంగా శరీరంలోని వ్యర్థాలను వడపోస్తూనే ఉంటాయట. ఉదయాన్నే తాగే నీరు, శరీరంలోకి మరేదైనా ఆహారం చేరకముందే ఆ పేరుకుపోయిన వ్యర్థాలను మూత్రం ద్వారా సులభంగా బయటకు పంపి వేయడానికి సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండాల పనితీరు మందగించడమే కాకుండా, కాలక్రమేణా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుందని National Kidney Foundation పేర్కొంది. కాబట్టి, ఉదయాన్నే తాగే ఒక గ్లాసు నీరు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.
మెరిసే చర్మానికి : ఉదయాన్నే నీరు తాగడం చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో జరిగే నీటి నష్టం చర్మాన్ని లోపలి నుంచి ప్రభావితం చేస్తుందంటున్నారు. ఉదయాన్నే శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం వల్ల చర్మం స్థితిస్థాపకత పునరుద్ధరించబడుతుందని తెలియజేస్తున్నారు. అలాగే చర్మం కాంతివిహీనంగా మారడానికి లేదా మొటిమలు రావడానికి కారణమయ్యే టాక్సిన్స్ బయటకు పంపివేయడానికి ఇది సహాయపడుతుందని వివరిస్తున్నారు.
ముందుగా బ్రష్ చేయడం : చాలా మందిని వేధించే ప్రశ్న ఇదే. ఆయుర్వేదం, జపనీస్ వాటర్ థెరపీ సంప్రదాయాల ప్రకారం.. పళ్లు తోముకోవడానికి ముందే నీరు తాగడం మంచిదట. ఎందుకంటే, రాత్రంతా నోటిలో ఊరే లాలాజలంలో (సలైవా) శరీరానికి మేలు చేసే ప్రయోజనకరమైన ఎంజైములు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్దిష్ట అంశంపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నప్పటికీ, బ్రష్ చేయడానికి ముందే నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు ఉండవని, అలాగే ఇది దంత ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని పేర్కొంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'లేట్ నైట్ స్క్రీన్స్, ఎర్లీ మార్నింగ్ అలారమ్స్' - మీ శరీరంలో జరిగేది ఇదే!
'క్యాన్సర్' ముప్పును ఎదుర్కోవచ్చా? - కొన్ని అలవాట్లతో చెక్ పెట్టొచ్చట!

