ETV Bharat / health

కిడ్నీ ఫెయిల్యూర్​ వార్నింగ్స్ - లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

కిడ్నీ వ్యాధి లక్షణాలేంటి? - డాక్టర్​ను ఎప్పుడు సంప్రదించాలంటే?

Kidney Disease
Kidney Disease (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : April 6, 2026 at 3:55 PM IST

4 Min Read
Choose ETV Bharat

Warning Signs of Kidney Disease : రక్తం నుంచి వ్యర్థపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం వల్ల రోగాల బారిన పడడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు. అయితే, కిడ్నీ సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల మరణం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కిడ్ని వ్యాధిని సూచించే హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ముఖ్యంగా, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అయితే ఎటువంటి హెచ్చరిక సంకేతాలు లేకుండా కిడ్నీలను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రారంభ సంకేతాలు సాధారణంగా ఉండటం వల్ల, వ్యాధి తీవ్రమై డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరమయ్యే వరకు చాలా మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లు తెలియదట. ఈ క్రమంలో డయాబెటిస్, రక్తపోటు, జీవనశైలికి సంబంధించిన వ్యాధులు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కిడ్నీల సమస్యల భారం వేగంగా పెరుగుతోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. దీనిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు. అందుకు, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మీ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!

రాత్రి సమయంలో తరచూ మూత్రవిసర్జన : కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రారంభ సంకేతాల్లో తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం ఒకటని nhs.uk పేర్కొంది. ముఖ్యంగా, రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి చాలాసార్లు మేల్కొంటునట్లయితే అది కిడ్నీ వ్యాధి లక్షణం కావచ్చనని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల్లోని ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు, మూత్రవిసర్జన చేయాలనే కోరిక పెరుగుతుందంటున్నారు. మరి ముఖ్యంగా, రాత్రిపూట ఎక్కువసార్లు నిద్రలేవాల్సి వస్తుందని వివరిస్తున్నారు.

పాదాలు లేదా కాళ్లలో వాపు : మూత్రపిండాల వైఫల్య లక్షణాల్లో చేతులు, చీలమండలు లేదా ముఖం చుట్టూ వాపు వస్తుందని clevelandclinic పేర్కొంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు అవి అదనపు సోడియం ద్రవాన్ని, నీరును ఫిల్టర్ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమంగా ద్రవ నిలుపుదలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా, పాదాలు లేదా కాళ్లలో వాపు వస్తుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా, దిగువ భాగాల్లో బూట్లు లేదా సాక్స్ వేసుకునే ప్రదేశంలో సాధారణంగా కంటే గట్టిగా ఉన్నట్లు మీకు అనిపిస్తే అది కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చని సూచిస్తున్నారు.

మూత్రంలో రక్తం : మూత్రంలో రక్తం కనిపించడం అనేది కిడ్నీలు దెబ్బతిన్నాయనడానికి తీవ్రమైన సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రంలో రక్తం వస్తే మూత్ర నాళానికి నష్టం జరిగిందని చెబుతున్నారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మూత్రం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగు లేదా రక్తం గడ్డకట్టడాన్ని గమనించినట్లయితే వెంటనే సంబంధిత డాక్టర్​ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. మూత్రంలో రక్తం అనేది కిడ్నీ వ్యాధికి అత్యంత ఆందోళనకరమైన హెచ్చరిక సంకేతాల్లో ఒకటని National Kidney Foundation పేర్కొంది.

నురుగతో కూడిన మూత్రం : నురుగుతో కూడిన మూత్రం రావడాన్ని ప్రోటీన్యూరియా అంటారు. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ప్రోటీన్​లను సమర్థంగా ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా, అల్బుమిన్ వంటి ప్రోటీన్లు మూత్రంలోకి లీక్ అవుతాయని, దీనివల్ల మూత్రంలో నురుగు ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.

శ్వాస ఆడకపోవడం : కిడ్నీ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవాలు పేరుకుపోవడానికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. దీంతో శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇది కిడ్నీ వ్యాధి చివరి దశలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. కానీ, కొందరిలో ఈ సమస్య ప్రారంభ దశల్లో కూడా సంభవించవచ్చని తెలియజేస్తున్నారు. శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయలేకపోతే అవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోతాయని, దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని Mayo Clinic పేర్కొంది. ముఖ్యంగా, విశ్రాంతి తీసుకునేటప్పుడు లేదా పడుకునేటప్పుడు శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటే వీలైనంత త్వరగా డాక్టర్​ను సంప్రదించడం మంచిదట.

నిరంతర అలసట, బలహీనత : అలసట అనేక అనారోగ్య పరిస్థితులకు సాధారణ లక్షణం. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం వ్యర్థ, విష పదార్థాలతో నిండిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, ఒంట్లో శక్తి లేకపోవడం, అలసటకు దారి తీస్తుందంటున్నారు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా నిరంతర అలసటగా అనిపిస్తే కిడ్నీ వ్యర్థాలను సమర్థవంతంగా ఫిల్టర్ చేయడం లేదని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నైట్​ షిఫ్ట్​ల్లో పనిచేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు!

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితో పోషకాహర లోపం ఉన్నట్టేనట!