10 వేల అడుగులు Vs 45 నిమిషాల వర్కౌట్స్ - ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ vs వర్క్అవుట్స్ - ఈ రెండింటిలో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? నిపుణులు సమాధానమేంటి!

Published : January 8, 2026 at 4:04 PM IST
Ten Thousand Steps or 45 Minutes Workouts: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా అవసరం. ప్రతి రోజు 10 వేల అడుగులు నడవడం లేదా 45 నిమిషాలు వర్కౌట్స్ చేయడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. అయితే, చాలా మందికి ఈ రెండింట్లో ఏది చేస్తే మేలు? అనే అనుమానం వస్తుంటుంది. మరి దీనికి నిపుణుల సమాధానం ఏంటి? ఏది చేస్తే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
10 వేల అడుగులు : ఇదొక చాలా తేలిక, చవకైన, అందరికి అందుబాటులో ఉండే వ్యాయామం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా చేయొచ్చు. రోజుకు 10 వేల అడుగులు నడవడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ, జీర్ణ వ్యవస్థ మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుందని, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, రక్తపోటును తగ్గిస్తుందని The Nutrition Source అధ్యయనం పేర్కొంది. అంతేకాదు, ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభించడంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుందట. దీనికి ఖరీదైన పరికరాలు లేదా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు.
రోజంతా 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!
అయితే ఒకేసారి 10వేల అడుగులు నడవాల్సిన అసవరం లేదట. మన సమయాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి రోజులో వీలు కుదిరినప్పుడల్లా చేయొచ్చని చెబుతున్నారు. ఉదయం ఒక అరగంట లేదా గంట నడవడంతోనే సగానికిపైగా టార్గెట్ పూర్తి చేసుకోవచ్చట. ఆఫీసులో గంటకోసారి కుర్చీలో నుంచి లేచి 10 నిమిషాలు నడవడం, లిఫ్ట్ ఎక్కే బదులు మెట్లమార్గం ఎంచుకోవడం, రాత్రిపూట భోజనం చేసిన తర్వాత మరో 15 నిమిషాలు నడిచి లక్ష్యాన్ని పూర్తి చేయొచ్చని అంటున్నారు. ఇప్పుడు అడుగులు లెక్కించడానికి స్మార్ట్‌వాచ్‌లు ఎలాగో ఉన్నాయి. సెల్ఫోన్లోనూ ఈ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. నడక వ్యాయామాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. నడకతోనే కండరాలు బలంగా మారవని, ఫిట్‌గా అవడానికి ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే, క్రమం తప్పకుండా నడక సాగించాలి. మధ్యలో ఆపేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు.
45 నిమిషాల వ్యాయామం : జిమ్‌లో సైక్లింగ్, కార్డియో, వర్కౌట్స్ వంటివి ఏవైనా చేయొచ్చు. ఈ 45 నిమిషాల ఎక్సర్‌సైజ్‌తో తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయంటున్నారు నిపుణులు. తద్వారా తొందరగా బరువు తగ్గే అవకాశముందట. శరీరంలోని కండరాలు దృఢంగా మారడంతో పాటు శక్తి లభిస్తుందని, శరీరం ఫిట్‌గా ఉండటంతో మానసిక ప్రశాంతత పొందుతారని.. తద్వారా చక్కటి నిద్ర పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో ఉదయం లేదా సాయంత్రం జిమ్‌కెళ్లి వ్యాయామాలు చేయడం, ఇంట్లోనే కార్డియో, యోగాసనాలు వంటివి చేయొచ్చని అంటున్నారు. సైక్లింగ్ చేస్తూ శరీరానికి శ్రమ కలిగించవచ్చని చెబుతున్నారు. శారీరక శ్రమ ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని, ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని World Health Organization అధ్యయనం పేర్కొంది.

ఈ ఎక్సర్సైజ్లు ఎలా పడితే అలా చేసే వీలు లేదు. తేలిక పాటి వ్యాయామాల నుంచి క్రమంగా కఠిన వ్యాయామాలకు నిదానంగా వెళ్లాలి. ఒకేసారి కఠినమైనవి చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. జిమ్‌లో ట్రైనర్ శిక్షణ ఇస్తారు. ఇంటి దగ్గరే చేయాలనుకుంటే ఆన్‌లైన్‌లో వ్యాయామాలకు సంబంధించి అనేక మొబైల్ అప్లికేషన్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయని సూచిస్తున్నారు.
ఈ రెండింట్లో ఏదీ బెస్ట్ : సాధారణ, నిలకడైన ఆరోగ్యం కోసం రోజూ 10 వేల అడుగులు నడిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అదే, కాస్త తొందరగా బరువు తగ్గాలి, కండరాలు దృఢంగా మారాలంటే 45 నిమిషాల వ్యాయామం మేలని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, ఫిట్‌నెస్ కావాలంటే రెండూ చేయొచ్చని సూచిస్తున్నారు. ఏం చేసినా, క్రమం తప్పకుండా చేస్తేనే ఫలితముంటుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గుండె ఆరోగ్యం "స్పెషల్ డైట్" - నిపుణులు సూచిస్తున్న డైట్ ప్లాన్లు ఇవే!


