ETV Bharat / health

ఉదయం లేవగానే కీళ్ల నొప్పులా? - మీ శరీరంలో ఈ సమస్యలు ఉండొచ్చట!

- నడుము పట్టేసినట్లు, కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తోందా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!

Waking Up with Stiff Back and Joints
Waking Up with Stiff Back and Joints (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : June 6, 2026 at 2:47 PM IST

4 Min Read
Choose ETV Bharat

Waking Up with Stiff Back and Joints : ఉదయం లేచిన దగ్గర్నంచి రోజంతా ఉత్సాహంగా ఉండాలని అనుకుంటాం. కానీ, మంచం దిగగానే నడుము పట్టేసినట్లు, కీళ్లు బిగుసుకుపోయి అడుగు తీసి అడుగు కూడా వేయలేని పరిస్థితిని కొందరు ఫేస్ చేస్తుంటారు. ఇవి వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడతాయి. మరి, ఉదయాన్నే ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఇది ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంకేతమా? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

వయసు మీద పడినప్పుడు కీళ్లు నొప్పిగా ఉండడం, కండరాలు బిగుసుకుపోవడం సహజమే. లేదా రోజంతా కష్టపడి పనిచేసినా కూడా ఇలాగే అనిపిస్తుంది. చాలా మందిలో కాస్త స్ట్రెచింగ్ చేసి, కదలితే ఈ నొప్పులు తగ్గిపోతాయి. కానీ, ఈ సమస్య కొన్ని నిమిషాలకు మించి ఉండటం లేదా రోజూ అలాగే ఉంటే మాత్రం.. అది మీ శరీరం ఇస్తున్నహెచ్చరిక సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు.

శరీరం విశ్రాంతి తీసుకునేటప్పుడు రక్తప్రసరణ కొంచెం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్లు కదలకుండా ఉండటం, కండరాలు ఎక్కువ సేపు రిలాక్స్​గా ఉంటాయంటున్నారు. తద్వారా శరీరం కొద్దిసేపు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుందట. కానీ, దీర్ఘకాలికంగా బిగుసుకుపోవడం లేదా 30 నిమిషాలకు పైగా ఉంటే.. అది వాపు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత లేదా కండర ఎముక సంబంధిత సమస్యలకు సూచన కావచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆర్థరైటిస్‌కు : 30-60 నిమిషాలు మించి కీళ్ల బిగుసుకుపోతే అది వాపు కలిగించే ఆర్థరైటిస్​కు సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చేతులు, మణికట్టు, మోకాళ్లు లేదా చీలమండలలో ఉంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాపు కలిగించే పరిస్థితులకు కారణం కావచ్చని చెబుతున్నారు. అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్ లాగా కాకుండా.. ఇన్​ఫ్లమేటరీ ఆర్థరైటిస్​తో వచ్చే నొప్పి సాధారణ వాపుతో కూడి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ సమస్య కదలికల వల్ల తగ్గుతుంది కానీ, విశ్రాంతి తీసుకుంటే నొప్పి మరింత ఎక్కువవుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కీళ్లలో వాపుతో పాటు నిరంతరం బిగుసుకుపోతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సకాలంలో చికిత్స ప్రారంభిస్తే కీళ్ల దెబ్బతినకుండా ఆపవచ్చని సలహా ఇస్తున్నారు. బలహీనమైన కండరాలు, గట్టిపడిన స్నాయువులు కూడా నిద్రలో బిగుసుకుపోతాయని Harvard Health Publishing పేర్కొంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండూ ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోవడానికి కారణం కావచ్చని తెలిపింది.

వరుసగా 3 రోజులు నిద్రలేకపోతే ఏం జరుగుతుంది? - ఈ మార్పులతో మీరు షాక్ అవుతారు!

ఫైబ్రోమైయాల్జియా : శరీరం అంతటా వచ్చే నొప్పులు, కండరాల బిగుతు ఫైబ్రోమైయాల్జియా ముఖ్య లక్షణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది నాడీ వ్యవస్థ నొప్పిని ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చే ఒక దీర్ఘకాలిక సమస్య అంటున్నారు. దీనివల్ల తీవ్రమైన అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయట. ఈ క్రమంలో యోగా లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చని సూచిస్తున్నారు. అలాగే, మంచి నిద్ర అలవాట్లపై దృష్టి పెట్టడం, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఫైబ్రోమయాల్జియా అనేది నొప్పిని గ్రహించడంలో వచ్చే ఒక రుగ్మతని National Library of Medicine పేర్కొంది. దీర్ఘకాలికంగా శరీరమంతా వ్యాపించిన నొప్పి, అలసట, నిద్ర, గ్రహణశక్తి, మానసిక ఆరోగ్య సమస్యలు లాంటి లక్షణాలు ఉంటాయట. ఫైబ్రోమయాల్జియా ఉన్నవారు తాము ఎక్కువసేపు నిద్రపోతామని చెప్పినప్పటికీ, తరచుగా అలసటతో మేల్కొంటారని mayoclinic తెలిపింది

నడుము కింది భాగంలో బిగుతు : వెన్నెముక కింది భాగంలో దీర్ఘకాలిక నొప్పి లేదా బిగుతు ఉంటే.. అది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లక్షణం కావచ్చంటున్నారు నిపుణులు. ఇది వెన్నెముకను ప్రభావితం చేసే ఒక రకమైన ఇన్​ఫ్లమేటరీ వ్యాధి అని చెబుతున్నారు. ఈ సమస్య కదలికలతో తగ్గుతుందని, విశ్రాంతితో ఎక్కువవుతుందని చెబుతున్నారు. ఇది వృద్ధులలో కంటే యువకులలో ఎక్కువగా కనిపిస్తుందట. ఒకవేళ ఈ బిగుతు మూడు నెలల కంటే ఎక్కువ కాలం ఉండి, ఉదయాన్నే మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్లును సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే ఫిజియోథెరపీ, యాంటీ ఇన్​ఫ్లమేటరీ మందులు వాడటం వల్ల ఈ వ్యాధి ముదరకుండా ఆలస్యం చేయవచ్చని పేర్కొంటున్నారు.

ఆస్టియో ఆర్థరైటిస్ : ఒకవేళ బిగుతు 30 నిమిషాల కంటే బిగుతుగా ఉండి, రోజంతా పనులు చేసే కొద్దీ నొప్పి ఎక్కువవుతుంటే.. అది ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చంటున్నారు నిపుణులు. ఇది కీళ్లలోని మృదులాస్థి అరిగిపోవడం వల్ల వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం, కండరాలను బలంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలట. అలాగే, ఉదయాన్నే హీట్ థెరపీ వల్ల బిగుతును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇవి కూడా : కీళ్లలో బరువుగా అనిపించడం, థైరాయిడ్ లోపం లేదా విటమిన్ డి లోపం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సాధారణ రక్త పరీక్షల ద్వారా ఈ లోపాలను గుర్తించవచ్చంటున్నారు. విటమిన్ సప్లిమెంట్లు లేదా థైరాయిడ్ చికిత్స ద్వారా ఈ లక్షణాలను పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు.

వైద్యడిని ఎప్పుడు సంప్రదించాలి? :

  • ప్రతిరోజూ గంట కంటే ఎక్కువ సమయం బిగుతుగా ఉండటం
  • కీళ్ల వాపు లేదా ఎర్రబడటం
  • జ్వరం లేదా కారణం లేకుండా బరువు తగ్గడం
  • తీవ్రమైన అలసట

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాఫీ ఎప్పుడు, ఎలా తాగితే లాభం? - ఈ విషయాలు తెలుసా?

మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!